logo

మరో ముగ్గురు

భాజపా మూడో జాబితాలో ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Updated : 03 Nov 2023 04:47 IST

బాన్సువాడ, బోధన్‌, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గాలకు భాజపా అభ్యర్థుల ఎంపిక

ఈనాడు, కామారెడ్డి: భాజపా మూడో జాబితాలో ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మొదటి జాబితాలో నిజామాబాద్‌ అర్బన్‌, కామారెడ్డి, జుక్కల్‌, బాల్కొండ, అర్మూర్‌ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మూడో జాబితాలో అనూహ్యంగా బాన్సువాడ టికెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించారు. బోధన్‌ నుంచి వడ్డీ మోహన్‌రెడ్డి, నిజామాబాద్‌ గ్రామీణానికి దినేష్‌కులాచారి అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. యెండల లక్ష్మీనారాయణ నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాల టికెట్‌ ఆశించినప్పటికీ అధిష్ఠానం బాన్సువాడ కేటాయించింది.

ఎల్లారెడ్డి ఒక్కటే మిగిలింది

ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలుండగా రెండు జాబితాల్లో ఎనిమిదింటికి భాజపా అభ్యర్థులను ఖరారు చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పద్నాలుగు మంది ఆశావహులు టికెట్‌ కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. పైలా క్రిష్ణారెడ్డి, బైండ్ల పోశయ్య, బంగ్లా చైతన్య, బాపురెడ్డిలతో పాటు మరి కొందరు టికెట్‌ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి రెండు రోజుల కిందట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నాలుగో జాబితాలో ఈయనకు పార్టీ అధిష్ఠానం టికెట్‌ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

  • నియోజకవర్గం
  • అభ్యర్థి
  • విద్యార్హత
  • రాజకీయ అనుభవం

  • నిజామాబాద్‌ గ్రామీణం
  •  దినేష్‌ కులాచారి
  • సివిల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌

  • తెలుగుదేశం పార్టీ విద్యార్థి, యువజన విభాగాలతో పాటు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదవులు చేపట్టారు. జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు. 2021లో భారాసకు రాజీనామా చేసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

  • బాన్సువాడ
  • యెండల లక్ష్మీనారాయణ
  • బీఎ(ఎల్‌.ఎల్‌.బి)
  • ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా మొదలు పెట్టి భాజపాలో చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. భాజపా యువజన విభాగం, భాజపా జిల్లా, రాష్ట్ర శాఖల్లో వివిధ హోదాల్లో పదవులు చేపట్టారు. 1999లో నిజామాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2009లో నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు.

  • బోధన్‌
  • వడ్డీ మోహన్‌రెడ్డి
  • డిగ్రీ(బీకాం)
  • తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు. నవీపేట జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా, రాష్ట్ర, జాతీయ కార్యవర్గాల్లో పనిచేశారు. 2018-22 మధ్య కాలంలో తెరాస(భారాస)లో పనిచేశారు. 2022లో భాజపాలో చేరారు..
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు