logo

బాలుడి జీవితాన్ని చిదిమేసిన శునకం

అభం, శుభం తెలియని ఓ చిన్నారి జీవితాన్ని శునకం చిదిమేసింది. బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిండు నూరేళ్లు హాయిగా ఉంటాడనుకున్న కుమారుడి ఆయుష్షు అయిదేళ్లకే తీరడంతో తల్లిదండ్రులు తట్టుకోలేక పోతున్నారు. తనయుడి అందమైన రూపాన్ని తలుచుకుంటూ దిక్కులు పెక్కుటిల్లేలా రోధించిన హృదయ విదారక ఘటన మాక్లూర్‌ మండలం కల్లెడిలో చోటు చేసుకుంది.

Updated : 09 Jan 2024 08:34 IST

నిషాన్ష్‌

మాక్లూర్‌, నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: అభం, శుభం తెలియని ఓ చిన్నారి జీవితాన్ని శునకం చిదిమేసింది. బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిండు నూరేళ్లు హాయిగా ఉంటాడనుకున్న కుమారుడి ఆయుష్షు అయిదేళ్లకే తీరడంతో తల్లిదండ్రులు తట్టుకోలేక పోతున్నారు. తనయుడి అందమైన రూపాన్ని తలుచుకుంటూ దిక్కులు పెక్కుటిల్లేలా రోధించిన హృదయ విదారక ఘటన మాక్లూర్‌ మండలం కల్లెడిలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. బండారి మధు, రజిని దంపతులకు ముగ్గురు పిల్లలు. అందరి కంటే చిన్నవాడైన నిషాన్ష్‌(5) ఎల్‌కేజీ చదువుతున్నాడు. గత నెల 25న తాత ధర్మయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. తాత చరవాణి ఇచ్చి పనిలో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో కుక్క బాలుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో రక్తస్రావమైంది. వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స అందించి ఇంటికి పంపించారు. ఈ నెల ఒకటో తేదీన రెండో డోసు సైతం ఇప్పించారు. రెండు రోజుల కిందట ఉన్నపలంగా వాంతులు, విపరీతమైన జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. 7వ తేదీన తీసుకెళ్తుండగా రాత్రి 10.30కి మార్గమధ్యలో చిన్నారి మృతి చెందాడు. తల్లిదండ్రులు విలపించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని