logo

విద్యార్థులు.. సైబర్‌ రక్షకులు

పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్‌ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు.

Updated : 19 Apr 2024 06:18 IST

 విద్యాశాఖ సమన్వయంతో పోలీసుల అవగాహన కార్యక్రమాలు 

న్యూస్‌టుడే, ఏర్గట్ల: పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్‌ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. పనులు ఎంత సులభంగా అవుతున్నాయో.. కొంచెం అప్రమత్తంగా లేకున్నా అంతకంటే ఎక్కువగా నష్టపోయే అవకాశముంది. ఇలాంటి నేరాలు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో సైబర్‌నేరాల నివారణకు ‘సైబర్‌ అంబాసిడర్స్‌ ప్లాట్‌ఫారం(సీఏపీ)’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లాలో 188 పాఠశాలల నుంచి ఎంపిక..

జిల్లాలో 188 పాఠశాలల నుంచి నలుగురి చొప్పున 752 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించి సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేయనున్నట్లు ఆర్మూర్‌ డివిజన్‌ మహిళా భద్రతా విభాగం(షీటీమ్‌) కానిస్టేబుల్‌ విఘ్నేశ్‌ పోహర్‌ తెలిపారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. అలాగే ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు మెంటార్లుగా ఉంటారన్నారు. వీరికి పోలీసు శాఖ పాఠశాల స్థాయిలో శిక్షణనిచ్చి ధ్రువపత్రాలు, బ్యాడ్జీలు పంపిణీ చేస్తుంది. తర్వాత వీరితో గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు.

  సైబర్‌మోసాల గురించి వివరిస్తున్న రిషిత, వైష్ణవి


చాలా విషయాలు నేర్పించారు

- చరణ్‌, 9వ తరగతి విద్యార్థి.

సైబర్‌ భద్రత, సురక్షిత డౌన్‌లోడ్లు, మాల్‌వేర్లు, వైరస్‌లు, ఈ-మెయిల్‌ బెదిరింపులు, ఫేక్‌ అప్లికేషన్లను ఎలా గుర్తించడం వంటివి శిక్షణలో నేర్చుకున్నాం. గ్యాడ్జెట్ల వాడకం, అనవసర యాప్‌లు, ఓటీపీల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి అప్లికేషన్‌కు బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి.


అందరి బాధ్యత  

- బస్వారెడ్డి, ఏసీపీ, ఆర్మూర్‌

ఆన్‌లైన్‌ మోసాలు, మహిళలు, బాలికలపై ఆన్‌లైన్‌లో వేధింపులు వంటి వాటిని నివారించేందుకు విద్యాశాఖ సహకారంతో పోలీసుశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు శిక్షణనిచ్చి వారి గ్రామాల్లో ప్రజలకు సైబర్‌ నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది. నేరాలు అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు