logo

ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ

నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని  కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 19 Mar 2024 06:44 IST

పేదల గూడుకు.. ‘కోడ్‌’ దెబ్బ!
30 వేల దరఖాస్తులు పెండింగ్‌
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే

బొబ్బిలి ఐటీఐ కాలనీ వద్ద జగనన్న కాలనీ


నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 90 రోజుల్లోగా మంజూరు చేస్తాం

ప్రభుత్వం, వైకాపా ప్రజాప్రతినిధులు

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌: నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని  కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నాన్చుతూ రావడంతో  ఇంతలో ఎన్నికల కోడ్‌ వచ్చింది. దీంతో ఎదురు చూసిన లబ్ధిదారులంతా నిరాశకు గురికావాల్సి వస్తోంది.

ఎన్నికలు దగ్గరకొస్తున్నందున కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని రెండు జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా మంజూరుకు సిద్ధంగా ఉందంటూ నమ్మించారు. ఆ మేరకు ఇప్పటికే మంజూరై పనులు ప్రారంభం కాని లబ్ధిదారులవి రద్దు చేసి, వారి స్థానంలో కొత్త దరఖాస్తుదారుల కోసం ప్రతిపాదనలు, అక్టోబరు నెలాఖరు నాటికి డీపీఆర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తులు, రద్దు చేయాల్సినవి రెండు రూపాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


  • విజయనగరం జిల్లాలో ఇంకా 16,336 మంది మంజూరు కోసం అర్హులుగా గుర్తించారు. తొలి విడతలో మంజూరైన వాటిలో 6,307 రద్దు కోసం ప్రతిపాదించారు.
  • మన్యం జిల్లాలో 11,823 మందిని మంజూరు కోసం అర్హులుగా గుర్తించారు.

తొలివిడతలో రెండు జిల్లాల్లో 1,05,269 ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటికీ 50,341 మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత అర్హులైన వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో గృహం మంజూరు చేస్తామని నమ్మబలికారు. అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు రాజాం, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాలకు రెండో విడతగా కొన్నింటిని మాత్రమే మంజూరు చేశారు.


గృహ ప్రవేశాలు ఇక లేనట్లే..

సామూహిక గృహ ప్రవేశాలు ఇప్పట్లో లేనట్లే. ప్రభుత్వం రెండో విడత సామూహిక గృహ ప్రవేశాలకు ఉమ్మడి జిల్లాలో 26,485 ఇళ్లను లక్ష్యంగా నిర్దేశించింది. విజయనగరం జిల్లాలో 16,228 గృహాలకు 2,161, మన్యంలో 10,257 నిర్మాణాలకు వెయ్యి వరకే పూర్తయినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో కొత్తగా మంజూరు ఉండదని గృహ నిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. గృహ ప్రవేశాలకు ఇంకా నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని