logo

ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!

బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు.

Updated : 19 Mar 2024 06:43 IST

బొబ్బిలిలో అందని టిడ్కో గృహాలు

బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడిన సమయంలో లబ్ధిదారులకు వాటిని అప్పగించి ఓట్లు కొల్లగొట్టాలని నేతలు చూశారు. ఇదే అంశంపై లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇటీవల పుర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయగా.. సౌకర్యాలు లేకుండా ఎలా అంటూ నిలదీశారు. అయినప్పటికీ వాలంటీర్లతో నచ్చజెప్పి అప్పగించాలని చూశారు. ఇంతలో ఎన్నికల కోడ్‌ రావడంతో మౌనం వహించారు. 

న్యూస్‌టుడే, బొబ్బిలి


సీసీ రహదారుల కోసం తవ్విన గొయ్యి

 అయిదేళ్లు ఊరుకుని ఆఖరులో పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రామన్నదొరవలస వద్ద 26 బ్లాకుల్లో 1680 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఒక్క విద్యుద్దీకరణ పనులే చివరి దశకు వచ్చాయి. కనెక్షన్లు ఇంకా ఇవ్వలేదు. పైన నీటి ట్యాంకులు అమర్చలేదు. చినుకు పడితే సముదాయాల వద్ద కాలు మోపలేని పరిస్థితి. పట్టణం నుంచి సముదాయాల వద్దకు వెళ్లేందుకు ప్రధాన మార్గం లేదు. పారిశ్రామికవాడ నుంచి బీటీ రహదారి వేస్తామని గతంలో చెప్పుకొచ్చారు. రైల్వే ట్రాకు అడ్డంగా ఉంది. ఇంతవరకు రైల్వే నుంచి రహదారి వేసేందుకు అనుమతులు లేవు. సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే శంబంగి ఇటీవల ప్రకటించారు. పుర కమిషనర్‌ రామలక్ష్మి సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఎక్కడా జరగలేదు.

సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తే సరిపోతుందా..

ఈ నెల 6న టిడ్కో సముదాయాల వద్ద రూ.3.71 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను  టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌తో కలిసి ఎమ్మెల్యే శంబంగి ప్రారంభించారు. విద్యుత్తు సదుపాయం అందుబాటులోకి వస్తే సరిపోతుందన్న ఆలోచనతో లబ్ధిదారులకు అందజేయాలని ఆ రోజు అనుకున్నారు. కాలువలు, రహదారులు, తాగునీరు వంటి పనులకు రూ.7 కోట్లతో టెండర్లు పిలిచినా ప్రారంభం కాలేదు. గోతులు తీసి వదిలేశారు. ‘మీ మాటలు నమ్మి వెళ్తే మా సమస్యలు తర్వాత ఎవరు వింటారని లబ్ధిదారులు అనడంతో మిన్నకున్నారు. ఫలితంగా టిడ్కో గృహాలు అందజేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని