logo

జీవనాధారం కల్పించండి సారూ!

మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 19 Mar 2024 04:01 IST

సైకిల్‌ను భుజంపై పెట్టుకొని కలెక్టరేట్‌కు వచ్చిన రైతు

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోడలి వెంకటరాయుడు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గారవలసకు చెందిన చిరువ్యాపారి. గ్రామంలోని రైతుల నుంచి కూరగాయలు సేకరించి వివిధ గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ విక్రయిస్తారు. సోమవారం ఇంటి నుంచి పార్వతీపురం బయలుదేరిన ఆయనపై ఊరి శివారులోనే ఏనుగులు దాడి చేశాయి. అప్రమత్తమైన ఆయన పొలాల్లోకి పారిపోగా.. రోడ్డుపై ఉన్న సైకిల్‌, కూరగాయలను ధ్వంసం చేశాయి. ఇన్నాళ్లు తన కుటుంబ పోషణకు ఆధారంగా నిలిచిన సైకిల్‌ను ఆటోలో పార్వతీపురం వరకు వెంకటరాయుడు తీసుకొచ్చారు. కాంప్లెక్స్‌ నుంచి సైకిల్‌ భుజాన వేసుకొని కలెక్టరేట్‌కు వెళ్లారు. రోజూ కూరగాయలు అమ్మితే నాలుగు డబ్బులొస్తాయని, సైకిల్‌ లేకుండా జీవనం సాగించలేనని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ముందు మొరపెట్టుకున్నారు. కొమరాడ తహసీల్దారుతో కలెక్టర్‌ చరవాణిలో మాట్లాడి బాధితుడికి న్యాయం చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని