logo

డ్రైవర్లు... అల్లాడుతున్నారు!

Updated : 24 Apr 2024 05:43 IST

వేసవి వేడిమితో ఉక్కిరి బిక్కిరి

సిబ్బందికి కొరవడిన సౌకర్యాలు

 

ఎండ వేడిమిని తాళలేక తలకు రుమాలుతో విధుల్లో..

న్యూస్‌టుడే, పాలకొండ/ గ్రామీణంః బత్తిలి నుంచి శ్రీకాకుళం వైపు ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి డ్రైవర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బస్సు  అదుపు తప్పే ముందే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. ఈ ఘటన భామిని మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.
వేసవి తీవ్రత పెరిగింది. నిత్యం 40 డిగ్రీలు దాటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఇటువంటి వేడిమి వాతావరణంలోనూ ఆర్టీసీ బస్సుల్లో సిబ్బంది అగ్గి కుంపటిపై విధులు నిర్వహించాల్సి వస్తోంది. అయితే బస్సుల్లో గానీ, ఆర్టీసీ సముదాయాల్లో గానీ వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం వట్టిమాటే అవుతోంది.

ఇదీ పరిస్థితి..

పాలకొండ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు కలిపి 300 మంది,  సాలూరులో 230, పార్వతీపురంలో 284, విజయనగరంలో 405, ఎస్‌.కోటలో 162 మంది ఉన్నారు. ‌్ర వేసవి కాలంలో రోజూ 8 గంటలు విధులు నిర్వహించేందుకు  ఆపసోపాలు పడుతున్నారు. ప్రధానంగా చోదకులు ఎండ తీవ్రత, ఇంజిన్‌ నుంచి వచ్చే వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ‌్ర ఆర్టీసీ బస్సుల్లో గాని, ప్రయాణ ప్రాంగణాల్లో ప్రత్యేకంగా సిబ్బందికి ఎటువంటి సౌకర్యాలు ఉండడంలేదు. గమ్యస్థానం నుంచి తిరిగి బస్‌స్టేషన్‌కు చేరుకునేటప్పుడు కాస్త విరామం దొరుకుతుంది. ఈ సమయంలో సేద తీరేందుకు ఆర్టీసీ కాంప్లెక్సుల్లో విశ్రాంతి గదులు లేవు. ప్రయాణికులు నిరీక్షించే బెంచీలపైనే వీరూ సేదతీరాల్సి వస్తోంది. ప్రత్యేక వసతి, తాగునీరు అందుబాటులో లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. గాలి ఆడని బస్సుల్లోనే కొందరు సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. మహిళా కండక్టర్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం.


సౌకర్యాలు కల్పించాలి

ఆర్టీసీ కాంప్లెక్సుల్లోనైనా సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలి. వేసవి కాలంలో ఎండల్లో విధులు నిర్వహించడం కష్టంగా ఉంది. బస్టాండుకు చేరుకున్నాక.. కాసేపైనా విశ్రాంతి తీసుకునేందుకు వసతి ఉండాలి. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు మెరుగు పర్చాలి.
 బీకేమూర్తి, ఈయూ జోనల్‌ కార్యదర్శి


ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన

వేసవిలో విధులు నిర్వహించే సిబ్బంది తరచూ నీరు తాగాలని చెబుతున్నాం. విధుల్లో అలసటగా ఉంటే అక్కడే బస్సును నిలిపి కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా సూచించాం. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించాం.
పి.వెంకటేశ్వరరావు, డిపో మేనేజరు, పాలకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని