logo

జగనన్న ఏలుబడి.. అవస్థల అంగన్‌వాడీ!

అంగన్‌వాడీ కేంద్రాలు.. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది  వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీటికి సొంత భవనాలు      సమకూరక.. రేకుల షెడ్లలో, చాలీచాలని అద్దె కొంపల్లో కొనసాగుతున్నాయి.

Published : 24 Apr 2024 05:24 IST

అంగన్‌వాడీ కేంద్రాలు.. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది  వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీటికి సొంత భవనాలు      సమకూరక.. రేకుల షెడ్లలో, చాలీచాలని అద్దె కొంపల్లో కొనసాగుతున్నాయి. చాలా కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేక చిన్నారులతో పాటు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ కేంద్రాలను విలీనం చేసిన చోట వంట, సరకుల నిల్వ, పిల్లల చదువు తదితరాలన్నింటికీ ఒక్క గదే కేటాయించడంతో అవస్థలు తప్పడం లేదు.                  

నిధులు లేక ఇబ్బందులు..

సాలూరు మండలంలోని సారిక పంచాయతీ దండిగాం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం పరిస్థితి ఇది. ఇక్కడ ఆరేళ్ల క్రితం సొంత భవనం కోసం పనులు ప్రారంభించారు. నిధుల లేమితో పూర్తికాలేదు. దీంతో 13 మంది చిన్నారులు శిథిల భవనంలో తలదాచుకుంటున్నారు.
- న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం  


తడక చాటున..

గరుగుబిల్లి మండలంలోని రావుపల్లిలో ఒకటి, నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలు ఒకే ఇంటిలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ 8 మంది పిల్లలు కూర్చోవడానికి తప్ప మిగిలిన సౌకర్యాలు లేవు. నీటి కోసం బోర్ల వద్దకు వెళ్లాల్సిందే.
- న్యూస్‌టుడే, గరుగుబిల్లి


పాకలోనే చిన్నారులు..

కొమరాడ మండలంలోని శిఖవరంలో 9 మంది చిన్నారులు కేంద్రంలో ఉంటారు. ఇక్కడ సొంత భవనం నిర్మాణానికి నాడు-నేడులో నిధులు కేటాయించినా గుత్తేదారులు లేకపోవడంతో పనులు జరగలేదు. పూరిపాకలో కేంద్రం నడుస్తోంది. ఆటలు ఆడే పరికరాలు ఉన్నప్పటికీ స్థల సమస్యతో అవి మూలకు చేరాయి.          

- న్యూస్‌టుడే, కొమరాడ


రేకుల షెడ్డులో..

గుమ్మలక్ష్మీపురం మండలం వంతరగూడలో 15 మంది చిన్నారులు, ఇద్దరు బాలింతలు పోషకాహారం పొందుతున్నారు. సొంత భవనం లేక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఇక్కడ పంకాలు కూడా లేనందున ఎండ తీవ్రతతో చిన్నారులు ఉక్కిరిబిక్కిరి  అవుతున్నారు.

న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం


బిల్లులు రాక..పనులు సాగక

చీపురుపల్లి మండలం బైరెడ్డి అంగన్‌వాడీ కేంద్ర భవనం నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.8 లక్షలు మంజూరు చేసింది. తరువాత ప్రభుత్వం మారడంతో మిగులు పనులు చేస్తే బిల్లులు రావేమోనని గుత్తేదారు పనులు నిలిపివేశారు. మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన భవనాలు 13 వరకు ఉన్నాయి.  

న్యూస్‌టుడే, చీపురుపల్లి గ్రామీణం


గోడలన్నీ బీటలే..

వంగర మండలం మగ్గూరు-2 అంగన్‌వాడీ కేంద్ర భవనం గోడలు బీటలు వారి ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

 -న్యూస్‌టుడే, వంగర


శిథిల భవనంలో..

దత్తిరాజేరు మండలం గొభ్యాం, దత్తిరాజేరు, దత్తి, పోరలి, బలభద్రరాజపురం, భూపాలరాజపురం, చుక్కపేట గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె కొంపల్లోనే నడుస్తున్నాయి. దత్తి, డి.వెంకటాపురం గ్రామాల్లో కొత్త భవనాల నిర్మాణాలు ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి.

-న్యూస్‌టుడే, దత్తిరాజేరు


అన్నీ ఒకే  గదిలో..

తెర్లాం మండలంలోని జగన్నాథవలస కేంద్రంలో 14 మంది చిన్నారులు న్నారు. పాఠశాల భవనంలో దీనికి  కేటాయించిన గదిలోనే సరకుల నిల్వ, వంట, కుర్చీలు, చిన్నారులుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.
- న్యూస్‌టుడే, తెర్లాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని