logo

YSRCP: గెలవలేం! మార్చేద్దాం!!

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఎన్నికల షెడ్యూల్‌ అతి సమీపంలోకి చేరుకుంటున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి.

Updated : 17 Dec 2023 08:45 IST

నష్ట నివారణకు వైకాపా సరికొత్త తంత్రం
గిద్దలూరుకు  బాలినేని, ఒంగోలుకు బలరాం!
పరిశీలనలో లేని ప్రజాప్రతినిధుల అదృశ్యం

ఈనాడు, ఒంగోలు: ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఎన్నికల షెడ్యూల్‌ అతి సమీపంలోకి చేరుకుంటున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. గెలుపు గాలి వీయడం లేదంటూ నష్ట నివారణ పేరుతో పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు వైకాపా అధిష్ఠానం తెర లేపింది. గెలవలేం.. తప్పదు మార్చేద్దామంటూ కుండబద్దలు కొడుతోంది. ఇందులో భాగంగానే యర్రగొండపాలెం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండపికి, ఇప్పటి వరకు అక్కడ సమన్వయకర్తగా వ్యవహరించిన వరికూటి అశోక్‌బాబును బాపట్ల జిల్లా వేమూరుకు మార్చింది. వేమూరు నుంచి ఎన్నికైన మంత్రి మేరుగు నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఇతర నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్‌లను సాగనంపి కొత్త వారిని ఎంపిక చేసేందుకు జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాడేపల్లి నుంచి కొందరికి కబురందింది. ఈ అంశంపై మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు, బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తితో అధిష్ఠానం మాట్లాడినట్లు సమాచారం. నేడో రేపో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితోనూ భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వైకాపా రీజినల్‌ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డిని బాలినేని హైదరాబాద్‌లో శనివారం కలిసి మాట్లాడినట్లు సమాచారం. వైకాపా అధిష్ఠానం చేపడుతున్న చర్యలు ఇప్పుడు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తూ రోజు రోజుకీ అలజడి రేపుతున్నాయి.
సిట్టింగ్‌లకు అనేక అవరోధాలు...: జిల్లాలోని అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలతో పాటు, పార్టీలో లుకలుకలు, వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. సంతనూతలపాడు, దర్శి, మార్కాపురం, ఒంగోలు, కనిగిరి ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలొచ్చాయి. సంతనూతలపాడులో ఒక వర్గం బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మరికొందరు ఎమ్మెల్యేలపై శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులకు మళ్లీ టిక్కెట్లు ఇస్తే ఓటమి తప్పదని వైకాపా అధిష్ఠానం భావిస్తోంది. ఈ పరిస్థితి నుంచి కాస్తైనా బయట పడాలంటే కొత్త ముఖాలైతే కొంత వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావించి అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఒంగోలుకు కరణం బలరామకృష్ణమూర్తి, గిద్దలూరుకు బాలినేని శ్రీనివాసరెడ్డి, మార్కాపురానికి శిద్దా రాఘవరావు, ఉమ్మడి ప్రకాశంలోని చీరాలకు మోపిదేవి వెంకట రమణ, లేకుంటే ఆమంచి కృష్ణమోహన్‌ పేర్లు ప్రచారంలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని మార్కాపురానికి, బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డికి గిద్దలూరు ఇచ్చి బాలినేని, మాగుంట పోటీకి దూరంగా ఉంటారనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఆయా ప్రతిపాదనలకు సిట్టింగ్‌లు అంగీకరిస్తారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది.


కక్క లేక.. మింగుడు పడక...

ఈ పరిస్థితులు అధికార పార్టీలో తీవ్ర అసంతృప్తులు, అసమ్మతులను తారస్థాయికి చేర్చేలా పరిణమించాయి. తమకు చోటుచేసుకున్న పరాభవంపై కొందరు బహిరంగంగా మాట్లాడుతుండగా.. మరికొందరు లోలోన కుమిలి పోతున్నారు. ఇంకొందరైతే ఏకంగా నియోజకవర్గాలను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విజయవాడ, హైదరాబాద్‌లో ఉంటూ ముఖ్య నేతలతో పైరవీలు చేయించుకుంటున్నారు. సమన్వయకర్తగా నాగార్జునను నియమించినప్పటి నుంచే సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. అదే సమయంలో మేరుగ నాగార్జున అక్కడ పోటీకి సన్నాహాలు చేసుకునే పనిలో పడ్డారు. కొండపి సమన్వయకర్తగా నియమితులైన మంత్రి సురేష్‌.. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించలేక ఎక్కడైనా సై అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అదే సమయంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న యర్రగొండపాలేన్ని వీడటం ఇష్టం లేక ద్వితీయశ్రేణి నాయకులతో రాజీనామా నాటకాలకు తెర లేపారనే విమర్శలు వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్‌ అతి సమీపంలోకి వచ్చిన నేపథ్యంలో ఎవరికి టిక్కెట్‌ దక్కుతుందో తెలియక నేతలు ఆందోళనతో కాలం గడుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని