logo

Balineni: ప్యాలెస్‌తో ఇక తెగతెంపులు!.. తీవ్ర పరాభవానికి నొచ్చుకున్న బాలినేని

నిన్నటి వరకు పార్టీకి పెద్దన్న. తన కనుసైగతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌, వైకాపా రాజకీయాలను నడిపిన నేత. ఒకప్పుడు వైకాపా అధినేత వద్దకు నేరుగా వెళ్లి ముచ్చటించేంత చొరవ.. ఇప్పుడు ఆయన కరుణ కోసం మూడు రోజులపాటు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన అవస్థ. అయినా అధిష్ఠానం మనస్సు కరగలేదు.

Updated : 11 Jan 2024 12:09 IST

ఎంతకీ తెరుచుకోని తాడేపల్లి తలుపులు
అనుయాయులతో మాజీ మంత్రి సమాలోచనలు
న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

అయిదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. ఇంతకంటే ఇంకేం కావాలి. కాదూకూడదంటే ఇంట్లో కూర్చుంటా. ఇంత అవమానాల్ని భరించాల్సిన అవసరం లేదు..


జగన్‌ వేరు రాజశేఖర్‌రెడ్డి వేరు. ఇద్దరి ఆలోచనా విధానాలకు చాలా తేడా ఉంది. నమ్మినవాళ్లకు, నమ్ముకున్న వాళ్లకు రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో విలువ ఇచ్చేవారు. జగన్‌కు అటువంటివేమీ లేవు..


నిన్నటి వరకు పార్టీకి పెద్దన్న. తన కనుసైగతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌, వైకాపా రాజకీయాలను నడిపిన నేత. ఒకప్పుడు వైకాపా అధినేత వద్దకు నేరుగా వెళ్లి ముచ్చటించేంత చొరవ.. ఇప్పుడు ఆయన కరుణ కోసం మూడు రోజులపాటు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన అవస్థ. అయినా అధిష్ఠానం మనస్సు కరగలేదు. అవతలి నుంచి పిలుపు అందలేదు. తాడేపల్లి ప్యాలెస్‌ తలుపులు ఎంతకీ తెరుచుకోలేదు. ఒకవిధంగా అతని ముప్ఫై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ చవిచూడని ఘోర పరాభవమిది. ఈ పరిణామాలతో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చిన్నబోయారు. తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆరు నూరైనా జగన్‌తోనే తమ ప్రయాణం అని పదే పదే ఘంటాపథంగా చెప్పిన ఆయన.. అధిష్ఠానం తనపట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్ర అవమానకరంగా భావించారు. ఇకపై తాడేపల్లి ప్యాలెస్‌తో చర్చించేది లేదని తేల్చేశారు. మూడు రోజులుగా మకాం వేసిన విజయవాడలోని హోటల్‌ గదిని ఖాళీ చేశారు. తన దారి తాను చూసుకుంటానంటూ తనయుడు ప్రణీత్‌ రెడ్డితో సహా హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ ఉదంతం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.        

          

ఆ రెండు అంశాల పైనే పట్టు...: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధానంగా రెండు అంశాలపై పట్టుబడుతున్నారు. ఒంగోలులో ఇళ్లపట్టాల పంపిణీకి రూ.179 కోట్లు కావాలని తొలి నుంచీ కోరుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఇంతకాలం ధీమాగా ఉన్నారు. సానుకూల స్పందన రాలేదు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డికి టికెట్‌ కేటాయించాలని అడుగుతున్నారు. అలా అయితే తన బావ అయిన తితిదే మాజీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టకుండా నియంత్రించొచ్చని తలిచారు. ఈ రెండు విషయాల్లోనూ బాలినేని పట్టు వీడటం లేదు. ఇందుకు మూడు రోజులుగా విజయవాడలోనే మకాం వేశారు. తనతో సంప్రదింపులు జరుపుతున్న వైకాపా సమన్వయకర్త విజయసాయిరెడ్డితో పాటు సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఇంటెలిజెన్స్‌ అధికారులతో ఇదే విషయం స్పష్టం చేస్తూ వచ్చారు. సోమ, మంగళవారాల్లో సీఎంవోకు వెళ్లిన బాలినేని.. ఇవే డిమాండ్లను వారి ముందుంచారు.

వెళ్లిపోవడమే ఉత్తమం...: గడిచిన మూడు రోజులుగా పలు జిల్లాలకు చెందిన నేతలతో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమవుతున్నారు. బాలినేనితో ముఖాముఖికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నట్లు తెలిసింది. ఏదేమైనా జగన్‌తోనే పయనిద్దామంటూ పదేపదే తండ్రిపై ఒత్తిడి తెస్తున్న బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డి కూడా.. తాడేపల్లి ప్యాలెస్‌ తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు కలత చెందినట్లు సమాచారం. చివరికి కుమారుడితో పాటు కీలక నాయకులతో బుధవారం సమావేశమైన బాలినేని అవమానాలను భరిస్తూ వేచిచూడటం కంటే వెళ్లిపోవటమే ఉత్తమమనే ఆలోచనకు వచ్చారని తెలిసింది.

ఇకపై చర్చించేది లేదు...: తాడేపల్లిని వీడి హైదరాబాద్‌ వెళ్లే సమయంలో తన అనుయాయులతో బాలినేని కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ‘అయిదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. ఇంతకంటే ఇంకేం కావాలి. కాదూకూడదంటే ఇంట్లో కూర్చుంటా. ఇంత అవమానాల్ని భరించాల్సిన అవసరం లేదు’ అన్నట్లు తెలిసింది. ‘జగన్‌ వేరు రాజశేఖర్‌రెడ్డి వేరు. ఇద్దరి ఆలోచనా విధానాలకు చాలా తేడా ఉంది. నమ్మిన వాళ్లకు, నమ్ముకున్న వాళ్లకు రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో విలువ ఇచ్చేవారు. జగన్‌కు అటువంటివేమీ లేవు..’ అని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ‘మూడు రోజులుగా తాడేపల్లి ప్యాలెస్‌ పిలుపు కోసం వేచి ఉన్నా పిలవలేదు. ఇక్కడ ఉండీ అనవసరం. హైదరాబాద్‌ వెళ్లిపోతున్నా.. మళ్లీ ఇక్కడ నుంచి పిలుపు వచ్చినా చర్చించేది లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేయబోతున్నా..’ అని తన సన్నిహితులతో బాలినేని వ్యాఖ్యానించినట్లు సమాచారం.


ఆ ఇద్దరి పయనం ఎటు వైపో..!: తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బాలినేని రాజకీయ పయనం ఎటు వైపో అనే విషయం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుడితో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పట్టుదలతో ఉన్నారు. వైకాపా టికెట్‌ ఇవ్వబోరని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి.. ప్రత్యామ్నాయాలపై సీరియస్‌గా దృష్టి సారించారు. బాలినేనితో మూడు రోజులపాటు సాగించిన ఏకాంత చర్చల్లోనూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో సాగిన భేటీలోనూ తమ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే బాలినేని, మాగుంట కోసం గట్టిగానే ప్రయత్నించినా.. పార్టీ పెద్దలు అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. సీఎంను కలిసేందుకు అనుమతి కోరినా ఈ అంశం తప్ప మరింకేదైనా ఉందా..? అనే ప్రశ్న ఎదురైందని.. దీంతో పార్టీ పెద్దల వైఖరిని తెలుసుకున్న బాలినేని తన ప్రతిపాదనకు విలువలేదని గ్రహించి వెనుదిరిగినట్లు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలినేని ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు, మాగుంట శ్రీనివాసులురెడ్డి దారెటు అనే చర్చ జోరుగా సాగుతోంది.


మూడో జాబితా.. మరోసారి వాయిదా...: ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల మార్పుతో రెండు జాబితాలు విడుదల చేసిన వైకాపా అధిష్ఠానం తాజా పరిణామాల నేపథ్యంలో మూడో జాబితా విడుదలపై మల్లగుల్లాలు పడుతోంది. మంగళవారమే మూడో జాబితా విడుదల చేస్తారని అంతా ఎదురుచూశారు. అనివార్య కారణాలని చెప్పి బుధవారానికి వాయిదా వేశారు. దీంతో ఒంగోలు మినహాయించి దర్శి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణాలు, అలకలు, బుజ్జగింపుల నేపథ్యంలో బుధవారం విడుదలవుతుందని భావించిన మూడో జాబితా కూడా మరోసారి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని