logo

వ్యూహం.. ప్రతివ్యూహం..

జిల్లాలో వైకాపా బాధ్యతలను తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అధిష్ఠానం కట్టబెట్టింది. ఈ చర్యను నిరసిస్తూ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అలకపాన్పు ఎక్కారు.

Updated : 02 Feb 2024 07:58 IST

చెవిరెడ్డికి జిల్లా సమన్వయ బాధ్యతలు
హైదరాబాద్‌లో బాలినేని మంతనాలు

శ్రీనివాసరెడ్డి, భాస్కర్‌రెడ్డి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో వైకాపా బాధ్యతలను తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అధిష్ఠానం కట్టబెట్టింది. ఈ చర్యను నిరసిస్తూ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అలకపాన్పు ఎక్కారు. బుధవారం రాత్రి హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లిన ఆయన.. అక్కడే తన అనుయాయులతో భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు.

సాయంత్రానికి మారిన కథ...: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి విషయంలో బాలినేని తొలుత మెత్తబడ్డట్టే కనిపించారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా తనకేం బాధ లేదని చెప్పారు. అదే రోజు సాయంత్రానికి కథ మారిపోయింది. ఎంపీ స్థానం వరకు మాత్రమే చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తామని తొలుత చెప్పిన పార్టీ పెద్దలు.. సాయంత్రానికి జిల్లా మొత్తం సమన్వయ బాధ్యతల్ని ఆయనకు కేటాయించారు. బాపట్ల పార్లమెంట్‌ స్థానంలోని సంతనూతలపాడును కూడా ఆయనకే అప్పగించారు. ఈ నిర్ణయంతో బాలినేని ఖిన్నులయ్యారు. అధిష్ఠానంపై కినుక వహించి హుటాహుటిన హైదారాబాద్‌ వెళ్లారు.

తాడేపల్లి కేంద్రంగా కుట్రలంటూ..!: ఒంగోలు ఎంపీ స్థానం ఎవరికనేది తేల్చకుండా వైకాపా అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో బాలినేనిలో మరింత అనుమానం మొదలైందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మాగుంటకు నిరాకరించి ఆయన స్థానంలో చెవిరెడ్డి పేరును తాడేపల్లి ప్యాలెస్‌ ప్రతిపాదించింది. తొలుత ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన బాలినేని చివరకు అంగీకరించారు. అదే సమయంలో ఆయనకు జిల్లా బాధ్యతలు మెలిక పెట్టడం, ఎంపీ సీటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో తెర వెనుక ఏవో మంతనాలు సాగుతున్నాయనేది బాలినేని భావన. తాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తన బావ వై.వి.సుబ్బారెడ్డి చక్రం తిప్పి తన కుమారుడు విక్రాంత్‌రెడ్డిని తెర మీదకు తెచ్చే అవకాశం ఉందని అనుమానించారు. తన ప్రాభవం తగ్గించేందుకు తాడేపల్లి కేంద్రంగా కుట్ర చేస్తున్నారని అసహనానికి గురయ్యారు. హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అక్కడే మకాం వేసి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. బాలినేని హైదరాబాద్‌లో ఉండగానే ఒంగోలులో ఇళ్ల స్థలాల భూసేకరణ నిమ్తితం మంజూరైన రూ.126 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ కావడం గమనార్హం. ఈ వ్యూహ, ప్రతివ్యూహాలు.. అనూహ్య పరిణామాలు అధికార పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని