logo

CM Jagan: యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు

ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్‌ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్‌ లేదని చెప్పారు.

Updated : 20 Apr 2024 09:57 IST

మందుల్లేకుండానే వైద్య చికిత్సలు
ప్రజలతో వైకాపా సర్కారు ఆటలు
జగన్నాటకంలా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ తీరు

ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్‌ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్‌ లేదని చెప్పారు. మళ్లీ వారం తర్వాత వెళ్లినప్పటికీ అదే సమాధానం ఎదురైంది. ప్రైవేట్‌గా వ్యాక్సిన్‌ వేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆమె దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఇలా నిత్యం అనేకమంది పిల్లలకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం వేయించకపోతే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, ఆరోగ్య సురక్షా అమలు తీరు ఆచరణలో ఓ నాటకాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ రెండు విధానాలను అమలులోకి తెచ్చింది. పాత సీసాలో కొత్త మందు పోసినట్లు ఫ్యామిలీ డాక్టర్‌ విధానం కొనసాగుతోంది.

రోగులంటూ ఆధార్‌ నంబర్ల నమోదు...

గతంలో 104 ద్వారా అందించిన సేవలకే కొత్త పేరు పెట్టి వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యుల్ని నియమించింది. వీరిలో ఒకరు నెలలో ఒకసారి గ్రామానికి మొబైల్‌ వాహనంలో వెళ్లి వైద్యసేవలందించాల్సి ఉంటుంది. అవసరమైన మందులు లేకుండానే ఈ కార్యక్రమం నామమాత్రంగా నడుపుతోంది. చిన్నపిల్లలకు అవసరమైన యాంటీ బయాటిక్స్‌ మందులు అందుబాటులో లేవు. కొన్ని సందర్భాల్లో జ్వరానికి వాడే పారాసిటిమల్‌ మాత్రలు కూడా ఉండటం లేదు. గ్రామాలకు వెళ్లిన వైద్యులు.. ఉన్నతాధికారులకు తప్పుడు ప్రోగ్రెస్‌ రిపోర్టులు సమర్పించి మమ అనిపిస్తున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి గ్రామానికి పీహెచ్‌సీ వైద్యాధికారులతో పాటు స్పెషలిస్టు వైద్యులు వెళ్లాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా వారెవరూ కానరావడం లేదు. ప్రతి శిబిరంలో కనీసం 300 మందికి సేవలందించాలని లక్ష్యం విధించారు. మందుల్లేక రోగులు రాకపోవడంతో వారి గ్రామాల్లో ప్రజల ఆధార్‌ నంబర్లు సేకరించి పరీక్షలు, వైద్యం అందించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

గోళీలకూ చాలని బడ్జెట్‌...

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు నెలలకు సరిపోయేలా ఏటా నాలుగు సార్లు మందులు అందజేయాల్సి ఉంటుంది. పీహెచ్‌సీలో నమోదయ్యే ఓపీల సంఖ్యను బట్టి రూ.40 వేల నుంచి రూ.2 లక్షల విలువైన మందులు ఇవ్వాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ మొదటి వారంలో ఇవ్వాల్సిన మందులు ఇంతవరకు పీహెచ్‌సీలకు ఇవ్వలేదు. గిద్దలూరు మండలం రాజుపాలెం, కొనకనమిట్ల, తాళ్లూరు మండలం గంగవరం, మద్దిపాడు వంటి కేంద్రాల్లో ఓపీలు రోజుకు 40 వరకు వస్తాయి. దీంతో వారికి కేటాయించిన బడ్జెట్‌ సరిపోక మందులు బయట తెచ్చుకోమని సూచిస్తున్నారు.

పురిటి బిడ్డల ఆరోగ్యంతో  చెలగాటం...

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జీజీహెచ్‌కి సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ద్వారా వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. వాటిని డీఎంహెచ్‌వో పరిధిలోని వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రంలో భద్రపరచి కోల్డ్‌ స్టోరేజి బాక్సుల్లో పీహెచ్‌సీలకు పంపుతారు. మార్చి 15 తర్వాత ఎక్కడా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవు. పిల్లలకు హెపటైటిస్‌, కోరింత దగ్గు వంటివి రాకుండా అయిదు రకాల వ్యాధులకు ఉపయోగపడే పెంటావాలెంట్‌ వ్యాక్సిన్‌ ప్రవేశపెట్టారు. వీటిని పుట్టిన బిడ్డలకు ఆరు, పది, 14వ వారాల్లో షెడ్యూల్‌ ప్రకారం వేయాలి. అదేవిధంగా డిప్తీరియా, పర్ట్యూసిస్‌, టెటనస్‌ రాకుండా డీపీటీ వ్యాక్సిన్‌ నిర్ణీత నెలల్లో వేయాలి. ఈ రెండూ ప్రస్తుతం అందుబాటులో లేవు. వీటిని వేయించడానికి ఆసుపత్రికి పిల్లల్ని తీసుకొచ్చిన వారు నిరాశగా వెనుతిరుగుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వీటి ఖరీదు రూ.3 వేల వరకు ఉంటుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన టీకాలను అందుబాటులో ఉంచకుండా పిల్లల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. దీనిపై డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మిని వివరణ కోరగా.. ప్రతిపాదనలు పంపామమని, త్వరలో సరఫరా అవుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని