logo

చివరి గింజ వరకూ కొంటాం

రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.విజయసునీత స్పష్టం చేశారు. ఆదిలో కొనుగోళ్లు కొంత నెమ్మదిగా ఉన్నా రెండు వారాల నుంచి వేగంగా జరుగుతున్నాయన్నారు. ‘

Published : 27 Jan 2022 06:12 IST

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం


ఎం.విజయసునీత, జేసీ

రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.విజయసునీత స్పష్టం చేశారు. ఆదిలో కొనుగోళ్లు కొంత నెమ్మదిగా ఉన్నా రెండు వారాల నుంచి వేగంగా జరుగుతున్నాయన్నారు. ‘ఈనాడు డిజిటల్‌’తో ముఖాముఖిలో మరిన్ని విషయాలు వెల్లడించారు.

లక్ష్యాన్ని సమీక్షిస్తాం...

మొత్తం 7.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. దిగుబడులు ఆ మేరకు కనిపించడం లేదు. ఇప్పటివరకూ 2.15 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాం. లక్ష్యాన్ని సమీక్షిస్తాం. అవసరాన్ని బట్టి మార్పులు చేస్తాం. రైతుల దగ్గరున్న చివరి గింజ వరకూ కొంటాం. ఆందోళన అవసరంలేదు.

మిల్లర్లు తీసుకోవాల్సిందే

అధికారులు, మిల్లర్ల మధ్య తేమ శాతం విషయంలో కొన్నిచోట్ల వ్యత్యాసాలొచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. తక్షణమే సంబంధిత మండల అధికారులు, మిల్లర్లతో మాట్లాడాం. కొందరు మిల్లర్లను హెచ్చరించాం. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ ధాన్యం పరిశీలించినా తేమ శాతం 14కి మించట్లేదు. 17 వరకూ అనుమతి ఉంది. ఆర్బీకే సిబ్బంది తేమ శాతం పరీక్షించిన తర్వాత మిల్లర్లు ధాన్యం తీసుకోవాల్సిందే. మరోసారి పరీక్షించి ధాన్యం వెనక్కి పంపించడం కుదరదు.

రంగుమారిన ధాన్యమూ..

రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభించాం. ఇటీవల వాటిని పరిశీలించడానికి కేంద్ర బృందం క్షేత్రస్థాయికి వచ్చి వెళ్లింది. రైతులెవరికైనా ఇబ్బందులు తలెత్తితే ఫోన్‌ చేసి సహాయం పొందొచ్ఛు ● చట్టబద్ధ కౌలుదారు, సాగుదారుల నుంచి మాత్రమే ధాన్యం సేకరిస్తున్నాం. ఎలాంటి అనుమతుల్లేకుండా, ఆక్రమించుకుని కొందరు సాగు చేస్తుంటే వారి నుంచి తీసుకోవడం సాధ్యం కాదు.

పరిశీలించి చర్యలు

అగ్ని ప్రమాదాలు ఎలా జరిగాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పంట కోసిన తర్వాత పరిహారం వర్తించదు. చేతికొచ్చిన ధాన్యం అగ్ని ప్రమాదానికి గురికావడం బాధాకరం. వాటిపై పూర్తి వివరాలు అందిన తర్వాత పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

ఎంఐజీ పథకానికి మంచి స్పందన

అర్బన్‌ లేఅవుట్లు కావడంతో ఎంజీఐ పథకానికి మంచి స్పందన ఉంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంత భూమి అవసరమనేది లెక్కించాం. దాదాపు 1,585 ఎకరాల అవసరమైంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఆక్రమణలు, అవరోధాలు, కోర్టు కేసులు లేని భూమిని సేకరించాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకే క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు భూమిని పరిశీలించి ప్రతిపాదనలు పంపించారు. వీలైనంత వరకు పట్టణానికి దగ్గర ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని