logo

విశ్వేశ్వరయ్యను వీడని శాపం..!

నరసన్నపేట నియోజకవర్గ కేంద్రానికి కూరగాయల మార్కెట్ కరవైంది. పాలకులు ప్రజల అవసరాలను పట్టించుకోకకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

Published : 27 Mar 2023 05:16 IST

వినియోగంలోకి రాని కూరగాయల మార్కెట్
నిధుల్లేక చేతులెత్తేసిన పంచాయతీ
న్యూస్‌టుడే, నరసన్నపేట

శిథిలమైన దుకాణ సముదాయం

నరసన్నపేట నియోజకవర్గ కేంద్రానికి కూరగాయల మార్కెట్ కరవైంది. పాలకులు ప్రజల అవసరాలను పట్టించుకోకకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నరసన్నపేట ఎమ్మెల్యే దీని నిర్మాణాలకు తోడ్పడతారని ఎన్నో ఆశలు పెట్టుకున్న మేజర్‌ పంచాయతీ ప్రజల కల నెరవేరడం లేదు. మరోవైపు ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ వద్ద నిధుల లేమి వెంటాడుతుండటంతో విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం కూరగాయల దుకాణ సముదాయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పూర్తిగా ప్రారంభానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరింది. ప్రభుత్వాలు మారినపుడల్లా ఈ సమస్యకు మోక్షం కలుగుతుందని ఎదురుచూస్తున్నారు. 

నరసన్నపేటలో 2001 జనవరి 13న కూరగాయల దుకాణాలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. అప్పట్లో ఈ ప్రమాదంలో 8 దుకాణాలు కాలిపోగా, ప్రభుత్వం డీఆర్‌డీఏ నుంచి నిధులు సమకూర్చి పక్కా దుకాణ సముదాయన్ని నిర్మించింది. విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ పేరుతో 52 దుకాణాలను నిర్మించి ఒకేచోట కూరగాయాల వ్యాపారాలకు స్థానం కల్పించారు. దాదాపు రూ.10 లక్షలతో నిర్మించిన విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ 2003 ఆగస్టు 23న ప్రారంభించారు. నాటి నుంచి ఈ దుకాణ సముదాయం వివాదాల్లో చిక్కుకుంది. నిర్మాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వ్యాపారులు దుకాణాల వినియోగానికి ఆసక్తి చూపలేదు. ముందు వరుసలో ఉన్న దుకాణాలకే వ్యాపారులు మొగ్గుచూపడంతో వెనుక వరుస దుకాణాలు నిరుపయోగంగా మారాయి. మరోవైపు వ్యాపారుల నుంచి లబ్ధిదారుల వాటాగా రూ.10వేలు వసూలు చేశారు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో పలుమార్లు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో వ్యాపారులు న్యాయం చేయాలని లోకాయుక్తను ఆశ్రయించారు.  

రోడ్ల పైనే దుకాణాలు

నరసన్నపేటలో రోడ్డంతా కూరగాయల దుకాణాలు వెలిశాయి. కాలేజీ రోడ్డుకు ఇరువైపులా గుత్త దకాణాలతో పాటు తోపుడుబళ్ల వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బజారులోని విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్కు వెళ్లి కొనేవారే లేకపోవడంతో కూరగాయల మార్కెట్తో పాటు ఇతర వ్యాపారాలు పడిపోయాయి. నిరుపయోగంతో పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ దుకాణ సముదాయాన్ని వినియోగంలోకి తేవాలంటే రూ.కోట్లు అవసరం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దుకాణ సముదాయన్ని పూర్తిగా తొలగించి రైతుబజారులా మారిస్తేనే వినియోగంలోకి వస్తుంది. ఇక గ్రామ పంచాయతీ వద్ద నిధుల లేమితో ఈ మార్కెట్ ఊసెత్తడం లేదు. పంచాయతీ వద్ద అందుబాటులో ఉన్న నిధులు కేవలం మార్కెట్‌ నిర్వహణకే సరిపోతోంది. ప్రభుత్వం ముందుకొచ్చి ఈ దుకాణ సముదాయాన్ని పునర్‌ నిర్మించాల్సి ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నరసన్నపేట వచ్చినప్పుడు కూడా ఈ కూరగాయల మార్కెట్ ఊసెత్తకపోవడం గమనార్హం.


వ్యాపారులు ఆసక్తి చూపడంలేదు

రోడ్లపై ఉన్న కూరగాయల మార్కెట్ వల్ల విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చేసేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం చొరవ చూపితేనే సమస్య పరిష్కారమవుతుంది. రెండు దశాబ్దాలుగా మార్కెట్పై ఆశలు నీరుగారిపోయాయి. విశాలమైన స్థలం ఉన్నా సరైన కూరగాయల మార్కెట్ లేదు.

అప్పారావు, శాంతామణి కూరగాయల వ్యాపారుల సంఘం కార్యదర్శి


నిధుల్లేక చేయలేకపోతున్నాం..

గ్రామ పంచాయతీని నిధుల సమస్య వెంటాడుతోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తేనే విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకురాగలం. కాలేజీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను అడ్డుకోవాల్సి ఉంది.

బూరెళ్ల శంకరరావు, సర్పంచి, నరసన్నపేట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు