logo

7,124 మందికి ఇంటి నుంచే ఓటు!

85 ఏళ్లు దాటినవారు, అర్హులైన దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ప్రజాస్వామ్య దేశంలో అయిదేళ్లకోసారి ఓటు అనే వజ్రాయుధంతో పాలకులను ఎన్నుకునే సదావకాశం లభిస్తుంది.

Published : 30 Mar 2024 04:37 IST

85 ఏళ్లు దాటినవారు, అర్హులైన దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ప్రజాస్వామ్య దేశంలో అయిదేళ్లకోసారి ఓటు అనే వజ్రాయుధంతో పాలకులను ఎన్నుకునే సదావకాశం లభిస్తుంది. దీన్ని వినియోగించుకునేందుకు వరుసలో నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయాలి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమైన ప్రస్తుత తరుణంలోనూ ఇదే విధానం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరు పోలింగ్‌ కేంద్రాల వరకు వెళ్లలేక హక్కును  వినియోగించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా ఉంటున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లలేని దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వారు ఈసారి ఇంటి వద్దే ఓటేసే వెసులుబాటు కల్పించింది. ఇందుకు అర్హులు సంబంధిత ఎన్నికల అధికారులకు  దరఖాస్తు చేసుకుంటే.. వారు అవకాశమిస్తారు.

న్యూస్‌టుడే, రణస్థలం

జిల్లావ్యాప్తంగా 18,59,910 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషుల సంఖ్య 9,22,442 మంది, మహిళల సంఖ్య 9,37,329 మందిగా ఉంది. వారిలో దివ్యాంగ ఓటర్లు 4,501, 85 ఏళ్లు దాటినవారు 2,623 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి ఇంటి వద్దే ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు నోడల్‌ అధికారిగా డ్వామా పీడీ, ఇతర సభ్యులను జిల్లా ఎన్నికల అధికారి నియమించారు.

12డీ ద్వారా దరఖాస్తు..

హో ఓటింగ్‌కు అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేవారిని ముందుగా బూత్‌స్థాయి అధికారులు గుర్తించి.. వారి ఇంటికెళ్లి ఫారం -12డీ అందజేస్తారు. దాన్ని పూరించి ఇస్తే ఆ దరఖాస్తులను బీఎల్వోలు రిటర్నింగ్‌ అధికారికి పంపుతారు. సమగ్రంగా పరిశీలించి నిర్ధారించిన తరువాతే అర్హుల ఇంటికి పోస్టల్‌ బ్యాలెట్‌ పంపుతారు. వారిలో ఎవరైనా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేస్తామని చెబితే వారికి 12డీ దరఖాస్తులు ఇవ్వరు. పోలింగ్‌ కేంద్రాల్లోనూ దివ్యాంగులకు ర్యాంపులు, వృద్ధులకు చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంటాయి.

రహస్య పద్ధతిలో ఓటింగ్‌..

ఫారం -12 డీ పూరించి ఇంటి వద్దే ఓటు వేయాలని దరఖాస్తు చేసుకున్నవారి ఇంటికి ఎన్నికల సిబ్బంది మొబైల్‌ వ్యానులో చేరుకుంటారు. ఇందులో ఇద్దరు పోలింగ్‌ అధికారులు, వీడియో గ్రాఫర్‌, మరో రక్షణ అధికారి ఉంటారు. అక్కడ ఓటరుకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తారు. అధికారులు నిర్దేశిత పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఓటరు రహస్యంగా ఓటు వేసి బ్యాలెట్‌ పెట్టెలో వేస్తారు. మొత్తం ప్రక్రియను అధికారులు పూర్తిగా చిత్రీకరిస్తారు. సాధారణ ఎన్నికలకు ఒక రోజు ముందుగానే ప్రక్రియ పూర్తి చేస్తారు.

అవగాహనతోనే మెరుగైన పోలింగ్‌

జిల్లాలో ఇంటి నుంచే ఓటు వేసేందుకు 7,124 మంది అర్హులున్నట్లు అధికారులు తేల్చారు. వారు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సిబ్బంది ఇళ్లకు వెళ్లాల్సి ఉంది. ఈ విధానంపై జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు పెద్దగా ప్రచారం కల్పిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. అదనపు పోలింగ్‌ సిబ్బంది అవసరమవుతారని, పోలింగ్‌ ఒకరోజు ముందే దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు ఎన్నికల సామగ్రి తీసుకెళ్లాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు సతమతమవుతున్నట్లు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అర్హులైనవారు ఇంటి వద్దే ఓటు వేసేందుకు కృషి చేస్తే పోలింగ్‌ శాతం కచ్చితంగా పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని