logo

జగనన్న గొప్పలు.. పప్పు లేక తిప్పలు..!

జగన్‌ జమానాలో పేదలకు కందిపప్పు కూడా అందడం లేదు. తెదేపా హయాంలో రేషన్‌ కార్డుదారులకు ఇచ్చిన రెండు కిలోల కందిపప్పును గద్దెనెక్కిన తర్వాత కిలోకు కుదించారు. ఆ తర్వాత క్రమంగా సరఫరాలో కోత పెడుతూ వచ్చారు.

Published : 16 Apr 2024 05:12 IST

నిరుపేదలపై అదనపు భారం మోపిన వైకాపా ప్రభుత్వం

..జగన్‌ జమానాలో పేదలకు కందిపప్పు కూడా అందడం లేదు. తెదేపా హయాంలో రేషన్‌ కార్డుదారులకు ఇచ్చిన రెండు కిలోల కందిపప్పును గద్దెనెక్కిన తర్వాత కిలోకు కుదించారు. ఆ తర్వాత క్రమంగా సరఫరాలో కోత పెడుతూ వచ్చారు. ప్రస్తుతం పూర్తిగా ఇవ్వకుండా చేశారు. ఈ రూపంలో నిరుపేదలపై ఆర్థిక భారం మోపారు. ఓ వైపు బహిరంగ విపణిలో ధరలు మండిపోతున్నాయి.. మరోవైపు ప్రభుత్వం రాయితీపై అందించే సరకులు సైతం అందక సామాన్యులు కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు అల్లాడిపోతున్నారు.

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

టెక్కలిలో లబ్ధిదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనదారుడు


 అయిదేళ్లలో కథ మారిందిలా..

తెలుగుదేశం పాలనలో 2014-19 వరకు రేషన్‌ దుకాణాల్లో కిలో కందిపప్పు ధర రూ.40కే ఇచ్చేవారు. అది కూడా ప్రతి కుటుంబానికి 2 కిలోలు చొప్పున సరఫరా చేసేవారు.


వైకాపా ప్రభుత్వం వచ్చాక రాయితీపై కిలో కందిపప్పు రూ.67కు ఇచ్చేవారు. అది కూడా నెలకు కిలో మాత్రమే. ఏడాదిన్నర నుంచి అది కూడా అరకొరగా సరఫరా చేస్తున్నారు.


ప్రస్తుత పరిస్థితి.. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.180గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం  సరఫరా నిలిపివేయడంతో ప్రతి కార్డుదారుడిపై కిలో కందిపప్పుపై రూ.93 అదనపు భారం పడుతోంది.


ఎన్నికల ముందు కూత..

‘రేషన్‌ దుకాణానికి వెళ్తే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, కిరోసిన్‌, గోధుమపిండి, కారం, పసుపు, నూనె, ఉప్పు.. ఇలా తొమ్మిది రకాల వస్తువులు లభించేవి. చంద్రబాబు పాలనలో రేషన్‌ దుకాణానికి వెళ్తే బియ్యం తప్ప ఏమైనా దొరుకుతుందా..?’


కొలువుదీరాక కోత..

వైకాపా పాలనలో ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారులకు రేషన్‌ అందజేస్తున్నారు. గతంలో మాదిరిగా సరకులు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. కేవలం బియ్యం, అరకొరగా పంచదారతో సరిపెడుతున్నారు. ఏడాదిన్నర నుంచి కందిపప్పును ఎత్తేశారు.


8,199 మెట్రిక్‌ టన్నులు ఎగ్గొట్టేశారు..

జిల్లావ్యాప్తంగా 6,71,803 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఆయా లబ్ధిదారులకు ప్రభుత్వం సక్రమంగా కందిపప్పు సరఫరా చేయడం లేదు. గత 16 నెలలుగా జిల్లాలో 10,327.81 మెట్రిక్‌ టన్నులు కందిపప్పు సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 2128.32 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇచ్చారు. మిగతా 8199.50 మెట్రిక్‌ టన్నులు ఎగ్గొట్టేశారు. దీంతో చాలా మందికి రాయితీ పప్పు అందకపోవడంతో బహిరంగ మార్కెట్ కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఆర్థిక భారం పడుతోందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తినలేకపోతున్నాం..: అయిదేళ్ల నుంచి నిత్యావసర సరకులు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వం కూడా వీటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పేదలకు రేషన్‌ డిపోల ద్వారా ఇచ్చే సరకుల్లోనూ కోత పెడుతున్నారు. గడిచిన నాలుగు నెలల నుంచి మాకు కందిపప్పు ఇవ్వలేదు. పంచదార కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు. నాణ్యమైన బియ్యం ఇస్తామని ప్రకటించినప్పటికీ దొడ్డు బియ్యమే అందిస్తున్నారు. వాటిని తినలేకపోతున్నాం.

పంచిరెడ్డి హారతి, పొన్నాడ, ఎచ్చెర్ల మండలం


రూ.147.59 కోట్లు మిగుల్చుకున్నారు..

16 నెలల నుంచి కందిపప్పు సరఫరాలో ప్రభుత్వం కోత విధిస్తూ వచ్చింది. అలా చేయడం ద్వారా పాలకులు ఇప్పటి వరకు రూ.147.59 కోట్లు మిగుల్చుకుంది. క్షేత్రస్థాయిలో కందిపప్పు ఇవ్వనందుకు లబ్ధిదారులు ఎండీయూ వాహనదారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.


ఇంత దారుణం ఎప్పుడూ లేదు..: గతంలో రేషన్‌ దుకాణాల్లో బియ్యం, పప్పుతో పాటు ఇతర సరకులు ఇచ్చేవారు. మాలాంటి పేదలకు అవి ఎంతో ఉపయోగంగా ఉండేది. పండగ రోజుల్లో మరికొన్ని అదనంగా పంపిణీ చేసేవారు. ప్రస్తుతం కందిపప్పు కూడా సరిగా ఇవ్వట్లేదు. బియ్యంతోనే సరిపెడుతున్నారు. బయట ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు.

బెనియా కుందిని, టెక్కలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని