logo

దప్పిక తీరే దారేది జగన్‌..!

ప్రతీ గ్రామానికి రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెదేపా హయాంలో 2017 డిసెంబరు నెలలో వంశధార నదిలో అచ్యుతాపురం వద్ద శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు.

Published : 17 Apr 2024 04:52 IST

పూర్తికాని శ్రీముఖలింగం తాగునీటి పథకం పనులు
అయిదేళ్లుగా లక్ష్యాన్ని నీరుగార్చిన వైకాపా సర్కారు
న్యూస్‌టుడే, జలుమూరు, సారవకోట

ప్రతీ గ్రామానికి రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెదేపా హయాంలో 2017 డిసెంబరు నెలలో వంశధార నదిలో అచ్యుతాపురం వద్ద శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. జలుమూరు, సారవకోట మండలాల పరిధిలోని 93 గ్రామాల్లోని 73,983 మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొదటి విడతలో రూ.28 కోట్లు విడుదలయ్యాయి. వాటితో అధికారులు పనులు చేయించి రెండు మండలాల్లోని 47 గ్రామాల ప్రజలకు తాగునీరందించారు. రెండో విడతలో రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇంతలో ఎన్నికలు రావడం, అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రెండో విడత నిధులు సైతం మంజూరయ్యాయి. పనులు ప్రారంభించి నేటికి అయిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. రెండో విడతలో 46 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉండగా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.

ఎదురుచూపులే మిగిలాయి

జలుమూరు మండలంలో 18, సారవకోట మండలంలో 17 ట్యాంకుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ఆశించిన ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. పథకం వద్ద మోటార్లు తరచూ మొరాయిస్తుండటంతో పనులు పూర్తయిన గ్రామాల ప్రజలకు సైతం తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయినా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జలుమూరు మండలంలోని రావిపాడు, హరికృష్ణమ్మపేట, పెద్దదూగాం, దరివాడ, చిన్ననామాలపేట, సారవకోట మండలంలోని సారవకోట, పద్మాపురం తదితర గ్రామాల్లో నీటి ట్యాంకులు అసంపూర్తిగా ఉన్నాయి.


20 రోజుల్లో తాగునీరు అందిస్తాం

- జె.సుదర్శనరావు, డీఈఈ గ్రామీణ తాగునీటి విభాగం

మొదటి విడతలోని 47 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందిస్తున్నాం. రెండో విడతలో 46 గ్రామాలకు అందించాల్సి ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలకు మాత్రమే అందించాం. జలుమూరు మండలంలో 18, సారవకోట మండలంలో 17 ట్యాంకులు పనులు జరుగుతున్నాయి. మరో 20 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పరిధిలోని 93 గ్రామాలకు తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నాం.   


ఎప్పటికి పూర్తవుతాయో..

- బమ్మిడి అప్పలనరసమ్మ, హరికృష్ణమ్మపేట

శ్రీముఖలింగం ప్రాజెక్టు ద్వారా తాగునీరు వస్తుందని ఆశపడినా, చివరికి నిరాశే మిగిలింది. మా గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు పనులు రెండు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇంటి వద్ద ఉన్న బావుల నీరు తాగడానికి ఉపయోగిస్తున్నాం. బావులు లేని కుటుంబాలు పక్కింటి వారిపై ఆధారపడుతున్నారు. ఇతర అవసరాలకు చెరువు నీరే గతి. మా కష్టాలు తీరే దారి కనిపించడం లేదు.  


పైపులైను వేసి వదిలేశారు

- సాయిలక్ష్మి, సారవకోట

తెదేపా హయాంలో మంచినీటి పథకం మంజూరైంది. శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించేందుకు పైపులు లైను వేసి వదిలేశారు. ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టారు. తాగునీరు వస్తుందని, సమస్య పరిష్కారమవుతుందని ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితం లేకుండా పోయింది. సారవకోటలో పురాతన మంచినీటి పథకం ఉంది. రోజుకు అరగంట సమయం మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీటి కష్టాలు తప్పడం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని