logo

పేదోడి ఇళ్లపై జగన్‌ ఉక్కుపాదం

తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటున్న సీఎం జగన్‌.. ప్రకృతి విపత్తు ధాటికి ఇళ్లు కోల్పోయిన బాధితులను పట్టించుకోలేదు. నోరు తెరిస్తే పేదలకు తామే మేలు చేస్తున్నామంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి హుద్‌హుద్‌ ఇళ్ల విషయంలో కరుణ చూపలేకపోయారు.

Updated : 18 Apr 2024 06:55 IST

వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ

తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటున్న సీఎం జగన్‌.. ప్రకృతి విపత్తు ధాటికి ఇళ్లు కోల్పోయిన బాధితులను పట్టించుకోలేదు. నోరు తెరిస్తే పేదలకు తామే మేలు చేస్తున్నామంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి హుద్‌హుద్‌ ఇళ్ల విషయంలో కరుణ చూపలేకపోయారు. ఎన్నికల ముందు నేను ఉన్నాను.. నేను విన్నాను’ అన్న వ్యక్తి గద్దెనెక్కగానే చేతులెత్తేశారు. నిరుపేదల పట్ల అంతులేని నిర్లక్ష్యం చూపారు. తెదేపా హయాంలోనే కట్టిన గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా అయిదేళ్ల పాటు తాత్సారం చేశారు. ఎక్కడ వాటిని అందజేస్తే తెదేపాకు కలిసి వస్తుందనే అక్కసుతో మోకాలడ్డారు. వైకాపా వికృత రాజకీయంతో అయిదేళ్లుగా లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పట్లేదు.

ఈ చిత్రంలో పనికిరాని మొక్కల మధ్య కనిపిస్తుంది హుద్‌హుద్‌ ఇళ్ల సముదాయం. కోటబొమ్మాళిలో తెదేపా హయాంలో రూ.10 కోట్లు వెచ్చించి.. 192 గృహాలను నిర్మించారు. వాటిని వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయకుండా వదిలేశారు. ఇప్పటికే కిటికీలు, తలుపులకు వేసిన అద్దాలు పగిలిపోయాయి. పైపులైన్లు మరమ్మతులకు గురయ్యాయి. 

 -  న్యూస్‌టుడే, కోటబొమ్మాళి


విలువైన సామగ్రి మాయం..

జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో వినియోగంలోకి రాని హుద్‌హుద్‌ ఇళ్లు ఆకతాయిలకు అడ్డాలుగా మారాయి. మందుబాబులు తిష్ఠ వేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, పలాస, బెండి, సోంపేట సముదాయాల్లో తలుపులు, కిటికీలకు చెదలు పట్టాయి. అద్దాలు పగిలిపోయాయి. నీటి పైపులు, వైరింగ్‌, బోర్డులు చోరుల పాలయ్యాయి. ఇళ్ల మధ్య పనికి రాని మొక్కలు పెరిగాయి. పలు నిర్మాణాలు బీటలు వారాయి. తాగునీటి ట్యాంకులు, శానిటరీ పైపులు విరిగిపోయాయి.

జిల్లా వ్యాప్తంగా 2,274 హుద్‌హుద్‌ ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి గత తెదేపా ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసింది. శ్రీకాకుళం నగర పరిధిలోని కంపోస్టు కాలనీ, శ్రీకాకుళం గ్రామీణ మండలం కుందువానిపేటలో 480 ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.5,35,568 చొప్పున, ఆమదాలవలస, పలాస పురపాలక సంఘాల పరిధిలో ఒక్కో ఇంటికి రూ.నాలుగు లక్షల చొప్పున, మిగిలిన ఇళ్లకు రూ.3.98 లక్షలు చొప్పున వ్యయం చేశారు. సోంపేట మండలంలో 128 ఇళ్లకు 84 గృహాల నిర్మాణం పూర్తయింది.

అర్హులకు అందని తాళాలు..

  • శ్రీకాకుళం గ్రామీణ మండలం కుందువానిపేటలో 288 హుద్‌హుద్‌ ఇళ్లు నిర్మించారు. వైకాపా ప్రభుత్వం తొలి విడతలో 140, రెండో విడతలో 72 ఇళ్లు పంపిణీ చేసింది. తొలి విడతలో ఎంపిక చేసిన 21 మంది తెదేపా సానుభూతిపరులనే నెపంతో వారికి ఇంటి తాళాలు అందజేయలేదు. ఈ జాబితాలో సునామీ పేరిట ఇళ్లు పొందిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకే గృహాలు కేటాయించారు.  
  • ః సంతబొమ్మాళి పరిధిలో హుద్‌హుద్‌ ఇళ్లు అందజేస్తామని పలువురి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఓ కీలక ప్రజాప్రతినిధి వసూలు చేశారు. ఈ విషయమై తెదేపా ప్రతినిధులు ప్రశ్నించడంతో మిన్నకుండిపోయారు.
  •  టెక్కలి నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించి తెదేపా అధికారంలో ఉండగానే తుపాను సమయంలో నష్టపోయిన లబ్ధిదారుల పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఇంతలో ఎన్నికలు రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక లబ్ధిదారుల పేర్లను పలుమార్లు మారుస్తూ వచ్చింది. అయినప్పటికీ ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు.
  •  పలాస, బెండిలోనూ అప్పటికే సిద్ధం చేసిన లబ్ధిదారుల జాబితాలను అధికారం చేపట్టిన తర్వాత వైకాపా నాయకులు రద్దు చేశారు. మళ్లీ లబ్ధిదారుల ఎంపిక జరుపుతామని, అయిదేళ్ల పాటు కాలయాపన చేస్తూ గడిపేశారు.
  • హుద్‌హుద్‌ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. అప్పట్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఉచితంగా గృహాలు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2,274 ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణాలు పూర్తికాగా లబ్ధిదారుల జాబితాను అధికారులు కలెక్టర్‌కు పంపారు. ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వం ఇళ్ల పంపిణీలో తీవ్ర జాప్యం చేసింది. కొన్నిచోట్ల అరకొరగా పంపిణీ చేసినా మౌలిక వసతులు కల్పించలేకపోయింది. ఫలితంగా ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు అయిదేళ్లుగా ఎదురుచూపులు, అవస్థలు తప్పడం లేదు.

    అయిదేళ్లయినా అప్పగించలేదు..

హుద్‌హుద్‌ సమయంలో ఎంతో నష్టపోయాం. బెండికొండ వద్ద ఇళ్లు నిర్మించారు. వాటిని కేటాయిస్తారని అధికారులు చెప్పారు. ఊరికి దూరమైనా సొంత గూడు దొరుకుతుందని సంతోష పడ్డాం. ఇంతలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిపోయింది. వైకాపా అధికారంలో ఉన్న అయిదేళ్లు ఎదురుచూసినా మాకు ఇల్లు అప్పగించలేదు. పేదల విషయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం.
- ఎస్‌.హేమలత, కొండవూరు


కాళ్లరిగేలా తిరుగుతున్నా..

నా భర్త చనిపోయారు. బిడ్డతో అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. మా వీధిలో వేసుకున్న పాకను రెవెన్యూ అధికారులు ఆక్రమణ అంటూ తొలగించారు. అప్పట్లో రెండు నెలల పాటు అంబేడ్కర్‌ భవన్‌లోనే తలదాచుకున్నాం. హుద్‌హుద్‌ ఇంటి కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించట్లేదు. కొందరికి మాత్రమే ఇచ్చారు.
- గయా గురువారి, టెక్కలి


నిర్లక్ష్యంగా వదిలేశారు..

నేను, నా భర్త ఇడ్లీలు విక్రయిస్తూ.. వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. కోటబొమ్మాళిలో కొండపక్కన తెదేపా హయాంలో ఇళ్లు నిర్మించారు. అవైనా ఇస్తారనుకుంటే నిర్లక్ష్యంగా వదిలేశారు. మాలాంటి పేదలను గుర్తించకపోవడం సబబు కాదు.

- సకలాభక్తుల సునీత, కోటబొమ్మాళి



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని