logo

అగ్నిగుండం తొక్కిన అన్నాడీఎంకే అభ్యర్థి

కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా రామచంద్రన్‌ పోటీ చేస్తున్నారు. ఇతను సోమవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Updated : 27 Mar 2024 02:47 IST

కౌసిక్‌తో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ జయశీలన్‌

 నిప్పులు తొక్కుతున్న రామచంద్రన్‌

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా రామచంద్రన్‌ పోటీ చేస్తున్నారు. ఇతను సోమవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పాపనాయక్కన్‌ పాళ్యంలోని బన్నారి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేసి అగ్నిగుండం తొక్కి మొక్కులు చెల్లించుకున్నారు.


తమిళం చదవడం రాని ఎన్‌టీకే అభ్యర్థి

ప్యారిస్‌ : తమిళం చదవడం రాని నామ్‌తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అభ్యర్థితో జిల్లా కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. తెన్‌కాశికి చెందిన సి.కౌసిక్‌(27) డాక్టర్‌. ఎన్‌టీకే జిల్లా కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన ఆయన సోమవారం నామినేషన్‌ వేయడానికి తవిరుదునగర్‌ కలెక్టరేట్‌కు వెళ్లారు. అనంతరం అతని వద్ద ప్రతిజ్ఞ ఫారాన్ని ఇచ్చి కలెక్టర్‌ జయశీలన్‌ చదవమన్నారు. తనకు తమిళం చదవడం రాదనడంతో కలెక్టర్‌ చదువుతుండగా చెబుతూ ప్రతిజ్ఞ చేశారు. తల్లిదండ్రులు ఉత్తరాది రాష్ట్రంలో ఉంటున్నారని, ఆయనఅక్కడే చదువుకున్నారని, తమిళం మాట్లాడటం మాత్రమే వచ్చని పార్టీ వర్గీయులు తెలిపారు.


ఎంపీ చేసిన పనులు చెబితే రూ.కోటి బహుమతి: పోస్టర్‌ కలకలం

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తిరుప్పూర్‌ స్థానం నుంచి డీఎంకే కూటమి తరఫున ప్రస్తుత ఎంపీ, సీపీఐకి చెందిన సుబ్బరాయన్‌ మరోసారి బరిలోకి దిగారు. నియోజకవర్గ ప్రజలను సరిగా కలవలేదంటూ ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించకముందే.. ‘ఆయన కనిపిస్తే రమ్మనండి’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇది రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. నియోజకవర్గానికి సుబ్బరాయన్‌ చేసిన పనుల జాబితా చెబితే రూ.కోటి బహుమతి ఇస్తామని మన్నిన్‌ మైందర్గల్‌ కూట్టమైప్పు పేరిట తాజాగా పలుచోట్ల పోస్టర్లు అంటించారు. తిరుప్పూర్‌ కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం బయటికొచ్చిన సుబ్బరాయన్‌ను నియోజకవర్గ ప్రజలకు ఏమి చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని విలేకర్లు ప్రశ్నించారు. రూ.కోటి బహుమతి ఇస్తానని చెప్పిన ఆ వ్యక్తి ఆ నగదుతో తన కార్యాలయానికి వస్తే తిరుప్పూర్‌లో అమలుచేసిన పథకాలు వివరిస్తానని సుబ్బరాయన్‌ సమాధానమిచ్చారు.


పశువుల సంతలో మన్సూర్‌ అలీఖాన్‌ ప్రచారం

 వేలూర్‌, న్యూస్‌టుడే: ఇండియ జననాయక పులిగళ్‌ పార్టీ అధ్యక్షుడు, నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వేలూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు.  వేలూర్‌ సత్తువచ్చారిలోని కొండ కిందప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం పొయ్‌కై పశువుల సంతకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. అక్కడి దుకాణంలో కూర్చొని లేహ్యం విక్రయించి ఓట్లు అభ్యర్థించారు. అక్కడున్నవారు మన్సూర్‌ అలీఖాన్‌తో సెల్ఫీలు దిగారు. సంతలో మేకలు విక్రయిస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి మేకను చేతిలోకి తీసుకొని రూ.6 వేలు అని విక్రయించి ప్రజలను ఓట్లు అడిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని