logo

ఓటమెరుగని ఓపీఎస్‌

మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసి, తన రాజకీయ జీవితంలో ఇంతవరకు ఎన్నికల్లో ఓటమి తెలియని ఓ పన్నీర్‌సెల్వం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తుపై పోటీ చేస్తుండటం గమనార్హం.

Published : 27 Mar 2024 00:46 IST

న్యూస్‌టుడే, సైదాపేట: మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసి, తన రాజకీయ జీవితంలో ఇంతవరకు ఎన్నికల్లో ఓటమి తెలియని ఓ పన్నీర్‌సెల్వం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తుపై పోటీ చేస్తుండటం గమనార్హం. అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రతిపక్ష నేత, కోశాధికారి తదితర పలు ఉన్నత పదవులు వహించిన ఓపీఎస్‌ మొట్టమొదటిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండంతో పాటు, ప్రత్యేక చిహ్నంపై పోటీ చేయనుండటంతో ఓటమెరుగని నేతకు ఈసారి పరిస్థితి ఎలా ఉందోనని సర్వత్రా ఆసక్తి కలుగుతోంది.

 పోటీకి మొదట విముఖత

భాజపా కూటమిలో పన్నీర్‌ కోరిన నియోజకవర్గాలు కేటాయించకపోగా, కమలం గుర్తుపై పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇష్టపడని ఓపీఎస్‌.. మద్దతుదారులతో తీవ్రంగా చర్చలు జరిపిన తర్వాత భాజపా కూటమిలో ఒక నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మొదట భాజపా కూటమికి మద్దతు ప్రకటించి, ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించినా ఎన్నికల్లో పోటీ చేసి బలాన్ని నిరూపించాలని మద్దతుదారులు కోరడంతో స్వయంగా రామనాథపురం నుంచి బరిలో దిగేందుకు నిర్ణయించారు.

సాధారణ కార్యకర్తగా ప్రస్థానం

మొదట టీ దుకాణం నడుపుతూ వచ్చిన ఓపీఎస్‌ 1973లో అన్నాడీఎంకేలో సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1996లో పెరియకుళం నగర కౌన్సిల్‌ అధ్యక్షుడయ్యారు. అప్పట్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన టీటీవీ దినకరన్‌కు సన్నిహితంగా ఉండేవారు. 2001లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పన్నీర్‌కు వచ్చింది. పెరియకుళం నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2006లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 2011, 2016లో బోడినాయకనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బోడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇలా ఆయన తన రాజకీయ జీవితంలో ఓటమనేది ఎరుగలేదు.

పలు కీలక పదవులు

మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 2001 సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు జయలలిత ముఖ్యమంత్రిగా ఉండేందుకు నిషేధం విధించగా ఎమ్మెల్యే అయిన కొన్ని నెలలకే పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 2001 సెప్టెంబర్‌ నుంచి 2002 మార్చి వరకు ఆరు నెలలపాటు ఆ పదవిలో ఉన్నారు. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు, 2016లో ఆమె మృతి చెందినప్పుడు పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక, ప్రజాపనులు, మద్యపాన నిషేధం, రెవెన్యూ తదితర ముఖ్య శాఖలకు మంత్రిగా నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించడం గమనార్హం.

ప్రత్యేక చిహ్నంతో..

జయలలిత మృతి అనంతరం ముఖ్యమంత్రి అయిన ఆయన శశికళ బలవంతంతో ఆ పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఎడప్పాడి పళనిస్వామిని శశికళ ముఖ్యమంత్రిని చేశారు. శశికళ, టీటీవీలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన ఓపీఎస్‌.. తర్వాత ఎడప్పాడితో జతకట్టారు. అన్నాడీఎంకే సమన్వయకర్తగా పని చేశారు. తర్వాత ఈపీఎస్‌, ఓపీఎస్‌ మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అన్నాడీఎంకే పూర్తిగా ఎడప్పాడి పళనిస్వామి వశమవడంతో ప్రస్తుతం అన్నాడీఎంకే, రెండాకుల గుర్తు కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామనాథపురంలో పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల్లో విజయం సాధించి తన బలాన్ని నిరూపిస్తారా? లేక ఓడిపోయి తన రాజకీయ భవిష్యత్తును మరింత మసకబార్చుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని