logo

వేలూర్‌లో విజయ బావుటా ఎగురవేసేదెవరు?

స్వాతంత్య్ర పోరాటానికి బీజం వేసిన, సిపాయిల తిరుగుబాటుకు వేదికగా నిలిచిన వేలూర్‌ నియోజకవర్గంలో పోటీ రసవత్తంగా మారింది.

Published : 06 Apr 2024 00:44 IST

న్యూస్‌టుడే, రెడ్‌హిల్స్‌

స్వాతంత్య్ర పోరాటానికి బీజం వేసిన, సిపాయిల తిరుగుబాటుకు వేదికగా నిలిచిన వేలూర్‌ నియోజకవర్గంలో పోటీ రసవత్తంగా మారింది. చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిలో పాలారు నది ఒడ్డున ఉన్న వేలూర్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్‌ పరిధిలో వేలూర్‌, అనైకట్టు, కేవీకుప్పం, గుడియాత్తం, వాణియంబాడి, ఆంబూరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో ముస్లింలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అదేవిధంగా క్రైస్తవులు, వన్నియర్లు, ముదలియార్లు, ఆదిద్రావిడ తెగకు చెందిన వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. వేలూర్‌ లోక్‌సభ స్థానానికి 1951లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇంతవరకు కాంగ్రెస్‌ 5 దఫాలు, డీఎంకే 4 సార్లు, అన్నాడీఎంకే 3, పీఎంకే, ఐయూఎంఎల్‌ తలా 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థి, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఓల్డ్‌) తలా ఒకసారి గెలుపొందాయి.

రెండు ఎంపీల పద్ధతి

1951లో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు ఎన్నికయ్యే పద్ధతి ఉన్న సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ముత్తుకృష్ణన్‌, రాంసుందర్‌ గెలుపొందారు. 1957 ఎన్నికల్లో అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముత్తుకృష్ణన్‌, మునుస్వామి విజయం సాధించారు. 1962లో ఒక ఎంపీ ఎన్నికయ్యే పద్ధతి ప్రవేశపెట్టగా కాంగ్రెస్‌కు చెందిన అబ్దుల్‌వాహిద్‌, 1967లో డీఎంకేకు చెందిన కుసేలర్‌ విజయకేతనం ఎగుర వేశారు. 1971లో డీఎంకేకు చెందిన ఉలగనంబి, 1977లో ఇండియన్‌ నేషన్‌ కాంగ్రెస్‌ (ఓ)కు చెందిన దండాయుధపాణి, 1980లో స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్‌సమద్‌, 1984లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన ఏసీ షణ్ముగం, 1989లో అబ్దుల్‌సమద్‌, 1991లో అక్బర్‌బాషా, 1996లో డీఎంకేకు చెందిన షణ్ముగం, 1998, 99లో పీఎంకే అభ్యర్థి ఎన్డీ షణ్ముగం గెలుపొందారు. 2004, 2010లో ఐయూఎంఎల్‌కు చెందిన ఖాదర్‌మొహిద్దీన్‌, అబ్దుల్‌రెహ్మన్‌ విజయం సాధించారు. 2014లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన సెంగుట్టువన్‌, 2019లో డీఎంకేకు చెందిన కదిర్‌ ఆనంద్‌ గెలుపొందారు.

పరిష్కారం కాని సమస్యలు

పాలారు నది కర్ణాటకలో పుట్టినా వేలూరు జిల్లాలో ఎక్కువ దూరం ప్రవహిస్తోంది. నదిలో వరదలేర్పడితే నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. దీంతో చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రజలు ఏళ్ల తరబడి కోరుతున్నారు. 2005లో పేర్నంపట్టు సమీపంలోని బత్తలపల్లిలో ఆనకట్ట నిర్మాణ పనులు చేపట్టి తర్వాత వదిలేశారు. చిన్నశివకాశిగా పేరుపొందిన గుడియాత్తం పరిసర ప్రాంతాల్లో వందలాది అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలకు 24 గంటల పాటు త్రీఫేస్‌ విద్యుత్తు సరఫరా చేయాలనే డిమాండ్‌ ఉంది. కేవీ కుప్పంలో 24 ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, అగ్నిమాపదళ కేంద్రం, వాణియంబాడి న్యూటౌన్‌లో రైల్వే వంతెన, మల్లగుంటలో సిప్కాట్‌ నెలకొల్పాలని ప్రజలు కోరుతున్నారు.

గెలుపునకు వ్యూహాలు

మూడేళ్లలో డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనాకర్షక పథకాలు కదిర్‌ ఆనంద్‌కు ఘన విజయం సాధించి పెట్టనున్నాయని ధీమాతో కార్యకర్తలు ఉన్నారు. మరో వంక గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఏసీ షణ్ముగం ఈ సారి ఎలాగైన గెలిచి తీరాలనే పట్టుదలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఉచిత వైద్య శిబిరాలు, ఉద్యోగ మేళాలు నిర్వహించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కల్యాణ మండపాలు నిర్మించనున్నట్లు ప్రకటించి వేలూర్‌లో రూ.కోటి వ్యయంతో మండప నిర్మాణానికి ఇటీవల శంకస్థాపన చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి డాక్టరు పశుపతి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు.

ప్రస్తుత పోటీదారులు

ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే తరఫున మంత్రి దురైమురుగన్‌ తనయుడు, సిట్టింగ్‌ ఎంపీ కదిర్‌ ఆనంద్‌ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇతని చేతిలో గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవి చూసిన భాజపా కూటమిలోని పుదియ నీది కట్చి అధ్యక్షుడు ఏసీ షణ్ముగం మళ్లీ బరిలోకి దిగారు. అన్నాడీఎంఏ నుంచి డాక్టరు పశుపతి, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా ఇంజినీరు మహేష్‌ ఆనంద్‌, సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ పోటీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని