logo

విధుల్లో మేటిగా.. వీధుల్లో మేమేగా..

పోలీస్‌ విధులంటేనే సవాల్‌తో కూడుకున్నది. అలాంటి సేవలను హోంగార్డులు పోలీసులతో సమానంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ పరిరక్షణ ఇలా పోలీస్‌పరంగా అందించే అన్ని సేవలను మేము

Published : 06 Dec 2021 02:14 IST

హోంగార్డుల దినోత్సవం నేడు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

పోలీస్‌ విధులంటేనే సవాల్‌తో కూడుకున్నది. అలాంటి సేవలను హోంగార్డులు పోలీసులతో సమానంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ పరిరక్షణ ఇలా పోలీస్‌పరంగా అందించే అన్ని సేవలను మేము సైతం అంటూ వీరు చూపుతున్న చొరవ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఏటా డిసెంబరు ఆరో తేదీన హోంగార్డుల వ్యవస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం..

జిల్లాలో 735మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి రోజుకి రూ.710 చొప్పున ప్రభుత్వం జీతం చెల్లిస్తోంది. వీటితో పాటుగా వైఎస్‌ఆర్‌ హెల్త్‌ కార్డు కింద రూ.2.50 లక్షల వరకు వైద్యసేవలను అందిస్తున్నారు. జిల్లాలోని హోంగార్డుల్లో పోలీస్‌ విభాగంలో 555 మంది విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు వివిధ శాఖల్లో డిఫ్యుటేషన్‌లో ఉన్నారు.

కరోనా సమయంలో పోలీసులతో సమానంగా హోంగార్డులు విధులు నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలు చేయడానికి ప్రాణాలను పణంగా పెట్టి వీరు సేవలు అందించారు. ఈ క్రమంలో కరోనా సోకి అనకాపల్లికి చెందిన హోంగార్డు ఒకరు మృతిచెందారు. జిల్లాలో 40మంది వరకు కరోనా బారిన పడి కోలుకున్నారు. ట్రాఫిక్‌, స్టేషన్‌ నిర్వహణ సహా అన్ని విధుల్లో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వీరు అందిస్తున్న సేవలను పోలీస్‌ ఉన్నతాధికారులతో పాటుగా ప్రజలు కొనియాడుతున్నారు.

సంతాప కార్యక్రమం చేపడుతున్నాం

సోమవారం నిర్వహించే హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారికి సంతాపం తెలిపే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో గత ఏడాది హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని జరపలేదు. ఈ ఏడాది మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి వల్ల సంతాప దినాలు పాటిస్తున్నారు. దీంతో కరోనాతో మృతిచెందిన హోంగార్డులకు సంతాపం తెలిపి కార్యక్రమాన్ని ముగిస్తాం

- బి.రామకృష్ణారావు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, అడ్మిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని