logo

ఎడాపెడా మోత..

నగరంలో చెత్త సేకరణ రుసుముల వసూలు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కు అన్న చందాన సాగుతోంది. మరో పక్క యూజీడీ ఛార్జీల విధింపునకు జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.రుసుములపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆస్తి పన్నులో భాగంగా ఇవి వసూలు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఒక్కో ఇంటికి మురికివాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.120 వసూలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసింది. అయితే ఇప్పటికీ ఏవి మురికివాడలనేది విభజించ లేదు.

Published : 24 Jan 2022 02:17 IST

 యూజీడీ ఛార్జీల వసూలుకు సన్నాహాలు

ఇప్పటికే చెత్త సేకరణ రుసుములపై వ్యతిరేకత

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

చెత్తను సేకరిస్తున్న కార్మికులు

నగరంలో చెత్త సేకరణ రుసుముల వసూలు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కు అన్న చందాన సాగుతోంది. మరో పక్క యూజీడీ ఛార్జీల విధింపునకు జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

రుసుములపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆస్తి పన్నులో భాగంగా ఇవి వసూలు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఒక్కో ఇంటికి మురికివాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.120 వసూలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసింది. అయితే ఇప్పటికీ ఏవి మురికివాడలనేది విభజించ లేదు.

త్వరలో యూజీడీ ఛార్జీల విధింపు: భూగర్భ మురుగునీటి వ్యవస్థ కనెక్షన్ల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని అధికారులు త్వరలో ఆయా ఛార్జీలు విధించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రారంభంలో ఒక్కో కనెక్షన్‌కు నెలకు రూ.40 విధించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇటీవల దాన్ని సవరించి రూ.50గా నిర్ధారించింది. ఇంట్లో రెండు మరుగుదొడ్లు ఉంటే ఒక్కో దానికి రూ.50 చొప్పున కట్టాల్సిందే..

* నగరంలో 84,368 యూజీడీ(అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ) కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో దానికి రెండు నుంచి 40 వరకు మరుగుదొడ్లు అనుసంధానించి ఉంటాయి. ప్రస్తుత కనెక్షన్లపై నెలకు మొత్తం రూ.4.5కోట్ల నిధులు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవల అధికారులు లెక్క కట్టారు.

సర్దిచెప్పలేక సతమతం..

వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి, కార్పొరేటర్ల సహకారంతో చెత్త సేకరణ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలకు సర్ది చెప్పలేకపోతున్నామని అధికార వైకాపాకు చెందిన పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే భారాలు వేయడం సరికాదని అభిప్రాయ పడుతున్నారు. సీపీఎం, సీపీఐ, తెదేపా, జనసేన, భాజపా కార్పొరేటర్లు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రెండున్నరేళ్లలో రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు కల్పించడానికి నిధులు వ్యయం చేయకుండా, ఇప్పుడు ప్రజల నుంచి చెత్త సేకరణ రుసుములు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

కేవలం రూ.20లక్షలు వసూలు

నగరంలో 5,43,243 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటిల్లో 1,80,928 అసెస్‌మెంట్లు మురికివాడల్లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. జీవీఎంసీ అధికారులు పకడ్బందీగా చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేయగలిగితే నెలకు రూ.5.43 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి. జీవీఎంసీ ఎంపిక చేసిన 8 వార్డుల నుంచి గతేడాది డిసెంబరులో కేవలం రూ.20లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు. వాణిజ్య సముదాయాలు, హోటళ్ల నుంచి వసూలు చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేకపోయినా, ఇప్పటి వరకు వారికి డిమాండ్‌ నోటీసులు జారీ చేయలేదు. ఈ విధానాన్ని అన్ని వార్డుల్లో ఎప్పుడు అమలు చేస్తారో అధికారులు చెప్పలేకపోతున్నారు.

నూతన ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసుల జారీ

మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్నులోకి మార్చిన అనంతరం పెరిగిన పన్నులకు సంబంధించిన డిమాండ్‌ నోటీసులను జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. నగరంలోని 5,43,243 అసెస్‌మెంట్లలో 3,60,345 అసెస్‌మెంట్ల ఆస్తి పన్నులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. 2021-2022 ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త పన్నులు అమలులోకి వచ్చాయి. ఆయా నిధులు చెల్లించడానికి ఈ ఏడాది మార్చి వరకు గడువు ఉంది. ఇప్పటికే పన్నులు చెల్లించినవారు పెరిగిన 15శాతం నిధులు కట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు చెల్లించని వారు రెండు అర్ధ సంవత్సరాలకు చెల్లించాలి.

ఎక్కువ భారం పడకుండా..

యూజీడీ కనెక్షన్ల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. పదేళ్ల కిందట ఒక జీవో రాగా నాడు అమలు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. నగర ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఛార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.

- కె.వి.ఎన్‌. రవి, మంచినీటి సరఫరా, యూజీడీ నిర్వహణ, పర్యవేక్షక ఇంజినీరు
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని