logo

నిత్యం.. అగమ్యగోచరం!

విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న నాన్‌స్టాప్‌ బస్సులు ప్రయాణికులకు విసుగు తెప్పిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చే వాటిల్లోనూ ఇదే పరిస్థితి. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని చాలా మంది త్రీస్టాపు, నాన్‌స్టాప్‌, సింగిల్‌ స్టాప్‌, డీలక్స్‌, ఆల్ట్రాడీలక్స్‌,

Published : 24 Jun 2022 04:55 IST

ఆలస్యంగా నడుస్తున్న కండక్టరు లేని బస్సులు

ఈనాడు, విశాఖపట్నం

గంభీరం బస్స్టాపు  వద్ద ఆగిన బస్సులు

విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న నాన్‌స్టాప్‌ బస్సులు ప్రయాణికులకు విసుగు తెప్పిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చే వాటిల్లోనూ ఇదే పరిస్థితి. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని చాలా మంది త్రీస్టాపు, నాన్‌స్టాప్‌, సింగిల్‌ స్టాప్‌, డీలక్స్‌, ఆల్ట్రాడీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సమయానికి చేరుకోవడంలో మాత్రం ఆలస్యం అవుతుండటంతో అసహనంవ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం వైపు కొత్తగా జాతీయ రహదారిని ఆరువరుసలుగా అభివృద్ధి చేసినా ప్రయాణ సమయం తగ్గకపోవడంపై అసంతృప్తి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సులు ఎప్పుడు బయలుదేరుతున్నాయి, ఏ సమయానికి చేరుకుంటున్నాయి అనే అంశాలపై అధికారుల పర్యవేక్షణ అవసరమంటున్నారు.  

గంభీరం ముందు టిక్కెట్లు: విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, టెక్కలి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు కండక్టరు లేని బస్సులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖలోని ద్వారకా బస్టాండ్‌లో బయలుదేరే సమయంలో కొందరు టికెట్లు అక్కడే తీసుకుంటారు. ఆ తరువాత మద్దిలపాలెం, కొమ్మాది ఇతర చోట్ల ఎక్కేవారికి గంభీరం ముందున్న బస్‌స్టాండ్‌లో ఇస్తున్నారు. గతంలో ఈ బస్‌స్టాప్‌ హనుమంతువాక వద్ద ఉండేది. అక్కడి నుంచి మారికవలసకు మార్చారు. ప్రస్తుతం గంభీరం ముందున్న బస్‌స్టాండ్‌లో ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు ఒకే సమయంలో   వరుసగా బస్సులు వస్తుండటంతో టికెట్లు ఇచ్చేందుకు కండక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఒక్కో బస్సు పావు గంటకుపైగా ఆలస్యం అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయిదారు బస్సులు ఒకేసారి వచ్చే సమయంలో కండక్టర్లు తక్కువగా ఉండడంతో ఇంకా జాప్యం అవుతోంది.


గంభీరం వద్ద టికెట్లు ఇచ్చేందుకు కండక్టర్లు షిప్టుల్లో పనిచేస్తారు. ఇక్కడ అదనపు సిబ్బందిని నియమించడమో,  ఇతరత్రా ప్రత్యామ్నాయ ఏర్పాట్లో చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సు ఆగిన వెంటనే  టికెట్లు ఇచ్చే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలంటున్నారు.


ట్రాఫిక్‌తో మరింత ఆలస్యం: నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. సిగ్నల్‌ పాయింట్ల సంఖ్యా ఎక్కువయింది. దీంతో ద్వారకానగర్‌లో బయలుదేరిన బస్సు మద్దిలపాలెం, ఇసుకతోట, వెంకోజీపాలెం, హనుమంతువాక, రవీంద్రనగర్‌, ఎండాడ, పీఎంపాలెం, కార్‌షెడ్డు, కొమ్మాది, మారికవలస సిగ్నల్‌ పాయింట్లు వద్ద ఆగాల్సి ఉంటుంది. రద్దీ సమయాల్లో మరింత ఆలస్యం అవుతోంది.  సాలూరు, బొబ్బిలి, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి చాలా మంది విశాఖ వచ్చి...ఇక్కడి నుంచి రైలు , విమానాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లటానికి ప్రణాళిక రూపొందించుకుంటారు.

* నాన్‌స్టాపు అయితే త్వరగా చేరుకోవచ్చని అధిక ఛార్జీ చెల్లించి ప్రయాణిస్తారు. ఆ బస్సులూ ఆలస్యం అవుతుండటంతో అసంతృప్తి చెందుతున్నారు.

* విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లేవారు అక్కడి నుంచి (కనెక్టివిటీ)ఇతర ప్రాంతాలకు చేరుకోవాల్సిన బస్సులను అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కండక్టరు లేని బస్సుల్లో కన్నా.. కండక్టరుతో ప్రయాణించే ఇతర బస్సులు త్వరగా చేరుకుంటున్నాయంటున్నారు.

* శ్రీకాకుళం వెళ్లే పలు అద్దె బస్సులు తరచూ ఆలస్యం అవుతున్నాయి. దారి బాగున్నా సమయానికి చేరుకోవడంలో అరగంటకు పైగా జాప్యం అవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. డీజిల్‌ ఆదా కోసం కొందరు అద్దె బస్సుల నిర్వాహకులు డ్రైవర్లకు వేగం తగ్గించేలా సూచనలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని