logo

మళ్ళీ మొదటికొచ్చింది

షీలానగర్‌- సబ్బవరం అనుసంధాన రహదారి పనులు ఎప్పుడు మొదలై... ఎప్పుడు పూర్తవుతాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నౌకాశ్రయం నుంచి భారీ వాహనాలు నేరుగా నూతన జాతీయ రహదారిలోకి వెళ్లడానికి వీలుగా ఈ అనుసంధాన రహదారిని ప్రతిపాదించారు.

Updated : 28 Jun 2022 07:09 IST

షీలానగర్‌- సబ్బవరం అనుసంధాన రహదారి పరిస్థితిది

ఈసారి నాలుగు కాదు...ఆరువరుసలు

ఈనాడు, విశాఖపట్నం

షీలానగర్‌ కూడలి

షీలానగర్‌- సబ్బవరం అనుసంధాన రహదారి పనులు ఎప్పుడు మొదలై... ఎప్పుడు పూర్తవుతాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నౌకాశ్రయం నుంచి భారీ వాహనాలు నేరుగా నూతన జాతీయ రహదారిలోకి వెళ్లడానికి వీలుగా ఈ అనుసంధాన రహదారిని ప్రతిపాదించారు. అనకాపల్లి- ఆనందపురం నూతన జాతీయ రహదారితోపాటే దీనికీ టెండర్లు పిలిచారు. ఓ గుత్తేదారు నిర్మాణ పనులు దక్కించుకుని కార్యాలయాన్ని కూడా విశాఖలో ప్రారంభించారు. పనులు ప్రారంభించడానికి వీలుగా భూసేకరణ చేసి అందించడంలో నాటి రెవెన్యూ అధికారులు జాప్యం చేయడంతో గుత్తేదారు పనులు చేయలేమంటూ వెళ్లిపోయారు. దీంతో కొత్తగా టెండరు పిలవాల్సి వచ్చింది. గతంలో మాదిరిగా ముందే కాకుండా భూసేకరణ చేసిన తరువాతే టెండర్లు పిలవాలని ఎన్‌.హెచ్‌.ఎ.ఐ. అధికారులు నిర్ణయించారు. ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు భూసేకరణ పనులు పూర్తిచేయడంతో ఆ ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు.

మారిన రహదారి స్వరూపం:

ప్రాజెక్టు పనులు ఓసారి రద్దు కావడంతో మళ్లీ కొత్తగా సమగ్ర పథక నివేదిక (డి.పి.ఆర్‌.) తయారు చేయాలని నిర్ణయించారు. షీలానగర్‌ నుంచి సబ్బవరం వరకు గతంలో నాలుగువరుసల రహదారిని ప్రతిపాదించగా తాజాగా ఆరు వరుసలకు వీలుగా రూపొందించారు. షీలానగర్‌ నుంచి సబ్బవరం వైపు వెళ్లే మార్గంలో రైల్వే లైను మీదుగా కిలోమీటరుకు పైగా ‘ఎలివేటెడ్‌ కారిడార్‌’ను నిర్మిస్తారు. షీలానగర్‌ కూడలిలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఒక ‘రోటరీ’ నిర్మాణం చేస్తారు. ఫలితంగా వాహనాలు ఆగకుండా వెళ్లొచ్ఛు సబ్బవరం వద్ద నిర్ణీత రహదారిలోకి నేరుగా ప్రవేశించడానికి వీలుగా ఒక ‘ఇంటర్‌ ఛేంజ్‌’ను నిర్మిస్తారు.

కనీసం 30 నెలలు:

ఈ రహదారి నిర్మాణం పూర్తికావడానికి కనీసం 30 నెలల సమయం పడుతుంది. భూసేకరణ వివాదాలు ఇప్పటికే పరిష్కారం అయినా.. పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాజెక్టు రూపురేఖలు మారిన నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అధికారులు దిల్లీకి పంపిన డీపీఆర్‌ పరిశీలించి ఆమోద ముద్ర వేయడానికి కనీసం రెండు నెలల సమయమైనా పడుతుందని అంచనా. ఆ తరువాత టెండర్లకు నెల రోజులు పట్టొచ్చని చెబుతున్నారు. అన్నీ కుదిరితే మూడు నెలల తరువాత పనులు ప్రారంభం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని