logo

వస్తాం..ఉంటాం..!

ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో విద్యార్థులు కాని వారూ ఉండటం కలకలం రేపుతోంది. ఫలితంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకే ఈ పరిస్థితి ఎదురవుతోందనే విమర్శలు వస్తున్నాయి.

Published : 05 Aug 2022 04:39 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో విద్యార్థులు కాని వారూ ఉండటం కలకలం రేపుతోంది. ఫలితంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకే ఈ పరిస్థితి ఎదురవుతోందనే విమర్శలు వస్తున్నాయి.
గతంలో ఏయూ అధికారులు నాన్‌ బోర్డర్‌లను గుర్తించి బయటకు పంపించారు. స్కాలర్‌ల నిమిత్తం నిర్వహిస్తున్న బాలయోగి వసతి గృహంలో రైల్వేలో పని చేస్తున్న ఉద్యోగి, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉండడం గుర్తించారు. రెండు నెలల క్రితం ఒక వ్యక్తిని ఏయూలోని వసతి గృహం సమీపంలో హత్య చేశారు. ఈ సంఘటనతో ఏయూకి సంబంధంలేకపోయినా... బయటి వ్యక్తులు  ఏయూ వసతి గృహాల సమీపం వరకూ స్వేచ్ఛగా రాగలుగుతున్నారన్న విషయం చర్చనీయాంశమయింది. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినులు తరచూ ఆందోళన చేస్తున్న తీరు ఇక్కడి సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది. మహారాణిపేటలోని మహిళా వసతి గృహం ప్రహరీ దూకి అగంతకుడు లోపలికి రావడం కలకలం రేపింది.
*    ఇటీవల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య రాజేంద్ర కర్మార్కర్‌ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి నాన్‌బోర్డర్‌లను గుర్తించి బయటకు పంపించారు. తాజాగా వసతులు, ఆహారం బాగోలేదని ఓ వసతి గృహ విద్యార్థులు ఆందోళన చేశారు.


అందుకే ఆందోళన..
ఏయూలో 32 వసతి గృహాలున్నాయి. కొన్నింటిలో బయటివారు తిష్ఠవేస్తుండడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. వివిధ పోటీ పరీక్షల నిమిత్తం, పలు పనులు, వ్యాపకాల కోసం నగరానికి వచ్చే కొందరు వసతి గృహాల్లో తెలిసిన విద్యార్థుల గదుల్లోకి వచ్చేస్తున్నారు. ఈ విధంగా ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ వసతి గృహాల్లోనే 60 నుంచి 80 మంది ఉన్నారని చర్చ సాగుతోంది. వీరు పగలు ఏయూ నుంచి బయటకు వెళ్లిపోయినా రాత్రి వేళ్లలో మళ్లీ వచ్చేస్తున్నారు. గదుల్లోని వసతులను వినియోగించుకుంటూ ఇక్కడే కొన్ని రోజుల పాటు ఉండిపోతున్నారు. ఫలితంగా నగదు చెల్లించి ఉంటున్న విద్యార్థులకు తాగునీరు, ఇతరత్రా వసతులు కొరత ఏర్పడి ఆందోళనకు దిగుతున్నారు.

తరచూ తనిఖీలతో..
ఒక్కో విభాగానికి చెందిన వసతి గృహాలకు ఒక చీఫ్‌ వార్డెన్‌ ఉంటారు. వీరి పరిధిలో ఒక్కో వసతి గృహానికి ఒక వార్డెన్‌ ఉంటారు. వీరు కాకుండా వంటమనుషులు, వారి సహాయకులు, రక్షణ సిబ్బంది... ఇలా ఎంతమంది ఉన్నా.. ఇతరులు రోజులు తరబడి ఉంటున్నా అడ్డుకోలేకపోతున్నారు. కొందరి పర్యవేక్షణ లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ‘తరచూ పరిశీలించడం, సీసీ కెమేరాల వినియోగంతో నాన్‌ బోర్డర్లను నిరోధించడం సాధ్యమవుతుంది’ అని పలువురు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని