logo

బకాయిలు ఇవ్వకపోతే చెరకు సాగెలా : అయ్యన్న

గోవాడ చక్కెర కర్మాగారానికి చెరకు సరఫరా చేసిన రైతులకు మూడేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. ‘టన్నుకు రూ.2,755 చొప్పున రైతులకు రూ.40 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి

Published : 30 Sep 2022 03:57 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: గోవాడ చక్కెర కర్మాగారానికి చెరకు సరఫరా చేసిన రైతులకు మూడేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. ‘టన్నుకు రూ.2,755 చొప్పున రైతులకు రూ.40 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గోవాడ కర్మాగారం పరిధిలో గతంలో 35 వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. రైతులకు, ఉద్యోగులకు సకాలంలో చెల్లింపులు జరిగేవి. ఎరువుల ధరలు పెరగడం, సకాలంలో బకాయిలు ఇవ్వకపోతే రైతులు చెరకు ఎలా పండిస్తార’ని ప్రశ్నించారు. ప్రస్తుతం చెరకు సాగు 15 వేల ఎకరాలకు తగ్గడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు రైతులకు సహకరిస్తోందో తెలుస్తుందన్నారు. ‘2020లో ఇక్కడ ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రూ.26 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చి.. ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. ఇటీవల ఫ్యాక్టరీని సందర్శించిన సుగర్‌ కేన్‌ కమిషనర్‌ వి.వెంకటరావు ఇథనాల్‌ యూనిట్‌ ఏర్పాటుకు రూ.వంద కోట్లు అవసరమని, ఫ్యాక్టరీయే ఈ మొత్తాన్ని సమకూర్చుకోవాలని చెప్పార’ని పేర్కొన్నారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు చక్కెర కర్మాగారాలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక తాండవ, ఏటికొప్పాక కర్మాగారాలు మూతపడ్డాయి. శుక్రవారం జరగనున్న ఫ్యాక్టరీ మహాజన సభలో రైతులు ఈ అంశాలపై అధికారులను ప్రశ్నించాల’ని అయ్యన్న కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని