logo

మద్యం మత్తులో తోపులాట.. ప్రమాదవశాత్తు క్లీనర్‌ మృతి

మద్యం మత్తులో గొడప పడి.. ఒకరినొకరు తోసుకున్నారు. ఓ వ్యక్తి తూలి రోడ్డుపై పడడంతో లారీ మృత్యురూపంలో దూసుకొచ్చింది. 

Published : 27 Nov 2022 05:04 IST

గాజువాక, న్యూస్‌టుడే : మద్యం మత్తులో గొడప పడి.. ఒకరినొకరు తోసుకున్నారు. ఓ వ్యక్తి తూలి రోడ్డుపై పడడంతో లారీ మృత్యురూపంలో దూసుకొచ్చింది.  గాజువాక ఎస్‌ఐ సతీష్‌ వివరాల మేరకు... కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన క్లీనర్‌ మొహిద్దీన్‌(45), డ్రైవర్‌ చాంద్‌బాషాతో కలిసి రెండురోజుల కిందట లారీలో సరకు తీసుకుని గంగవరం పోర్టుకు వచ్చారు. శుక్రవారం రాత్రి ఇద్దరూ అతిగా మద్యం తాగి, పోర్టురోడ్డు ప్రకాశ్‌ తుక్కు దుకాణం సమీపంలో డబ్బుల విషయంలో షుర్షణ పడ్డారు.  తెల్లవారుజాము 3.45 గంటల ప్రాంతంలో మరోసారి గొడవ పడ్డారు. ఇంతలో డ్రైవర్‌ చాంద్‌బాషా తోసేయడంతో మొహిద్దీన్‌ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వై.జంక్షన్‌ నుంచి ఓ లారీ దూసుకురావడంతో ముందు చక్రాల కిందపడిన మొహిద్దీన్‌ తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కరరావు, ఎస్‌ఐలు సతీష్‌, రవికుమార్‌ తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. అనంతరం సమీప సీసీ ఫుటేజీలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చాంద్‌బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చాంద్‌బాషా ఉద్దేశపూర్వకంగా తోసేశాడా..? ప్రమాదవశాత్తు జరిగిందా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సతీష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని