logo

ఒక్క టికెట్‌ దొరికితే చాలు

ఈ నెల 19న వన్డే క్రికెట్‌ మ్యాచ్‌. అందులోను అభిమానించే క్రికెట్‌ హీరోలు వస్తున్నారు. వారిని చూసేందుకు ఎలాగైనా స్టేడియానికి వెళ్లాల్సిందే...అందుకు టికెట్‌ సంపాదించాల్సిందేనని వందలాది మంది అభిమానులు మంగళవారం ఆఫ్‌లైన్‌లో.

Updated : 15 Mar 2023 04:24 IST

క్రికెట్‌ అభిమానుల పడిగాపులు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ఈ నెల 19న వన్డే క్రికెట్‌ మ్యాచ్‌. అందులోను అభిమానించే క్రికెట్‌ హీరోలు వస్తున్నారు. వారిని చూసేందుకు ఎలాగైనా స్టేడియానికి వెళ్లాల్సిందే...అందుకు టికెట్‌ సంపాదించాల్సిందేనని వందలాది మంది అభిమానులు మంగళవారం ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎటుచూసినా అభిమానుల కోలాహలం కనిపించింది. టికెట్‌ లభిస్తుందో లేదో అనే ఆందోళనతో గంటల కొద్దీ మండు టెండను లెక్కచేయకుండా బారులు తీరారు. పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం, ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక వికాస్‌నగర్‌ రాజీవ్‌గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద భారీ వరుసలు కనిపించాయి. టికెట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో సగం మందికి కూడా లభించలేదు. దీంతో కొందరు నిరుత్సాహంతో వెనుదిరిగారు.

పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం-బి మైదానం వద్ద...


తెల్లవారుజాము 3 గంటలకే..

- గోపాల్‌, శ్రీను, ప్రవీణ్‌

మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తలసిల సముద్రం గ్రామం. సోమవారం అర్ధరాత్రి ఊరి నుంచి బయలుదేరి తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి క్రికెట్‌ స్టేడియం వద్ద వరసలో నిల్చున్నాం. రూ.600 టికెట్లు దొరికాయి. ఒక్కొక్కరం రెండు చొప్పున ఆరు తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అభిమాన క్రికెటర్లను స్టేడియంలో చూసేందుకు వేచి చూస్తున్నాం.

ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం వద్ద..


భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 19న జరగనున్న డేఅండ్‌ నైట్‌ వన్డే మ్యాచ్‌కు పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.  పిచ్‌ దాదాపు సిద్ధమైంది. గ్యాలరీలను శుభ్రపరచి, కుర్చీలను తుడిచి నెంబర్లు వేశారు. క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూంలను అధునాతనంగా తీర్చిదిద్దారు. స్టేడియం లోపలికి ప్రవేశించగానే పచ్చని మొక్కలు అభిమానులకు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్‌లైట్ల పనితీరును గత రెండు రోజుల నుంచి పరిశీలిస్తున్నారు. స్టేడియం బయట బారికేడ్లు ఏర్పాటు చేసి అభిమానులు మైదానంలోకి రావడానికి వీలుగా సూచికలు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని