logo

నాకేమీ తెలియదు..!!

బక్కన్నపాలెం ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (ఐటీఐ శిక్షణ, ఉత్పత్తి కేంద్రం)లో తుక్కు, వృక్షాల మాయంపై సోమవారం జిల్లా ఉపాధి అధికారి సీహెచ్‌.

Published : 28 Mar 2023 04:18 IST

సమాధానాలపై అవాక్కయిన కమిటీ
‘తుక్కు, వృక్షాల మాయం’పై విచారణ

సస్పెన్షన్‌కు గురైన పీవో విజయ్‌కుమార్‌ను విచారిస్తున్న బృందం

కొమ్మాది, న్యూస్‌టుడే: బక్కన్నపాలెం ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (ఐటీఐ శిక్షణ, ఉత్పత్తి కేంద్రం)లో తుక్కు, వృక్షాల మాయంపై సోమవారం జిల్లా ఉపాధి అధికారి సీహెచ్‌.సుబ్బిరెడ్డి నేతృత్వంలో విచారణ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. సాయంత్రం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని 33 మందికి నోటీసులు జారీ చేయగా అందులో 24 మంది హాజరై కమిటీ ఇచ్చిన ఓ ప్రశ్నావళిని రాత పూర్వకంగా పూర్తి చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

* ఈ కేంద్రంలో దశాబ్దాలుగా నిల్వ ఉన్న తుక్కు విక్రయించి రూ.20 లక్షల వరకు లబ్ధి పొందారని, భారీ వృక్షాలను నరికించేసి ఉన్నతాధికారులకు సమాచారమివ్వకుండా తరలించే ప్రక్రియ చేపట్టారనే ఆరోపణలపై కమిటీ ఈ విచారణ చేపట్టింది. హాజరైన వారు ‘నాకు ఏమి తెలియదు’ అన్న సమాధానమే చెప్పడంతో విచారణ చేపట్టిన జిల్లా ఉపాధి అధికారి సీహెచ్‌.సుబ్బిరెడ్డి, సబ్‌ డీఎఫ్‌వో సీహెచ్‌.ధర్మరక్షిత్‌, ప్రస్తుత ఇన్‌ఛార్జి పీవో జె.మాధవి అవాక్కయ్యారు. అసలు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు ఎవరంటూ ప్రశ్నల వర్షం కురిపించినా అందరి నోటా ఇదే సమాధానం వచ్చింది.

సీసీ ఫుటేజీలు లేకపోవడంతో

ప్రాంగణంలో ప్రతిచోట నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ ప్రతి నెలా 15వ తేదీ నాటికి రద్దయ్యే వ్యవస్థ ఇక్కడ ఉండడంతో ఈ అక్రమాలకు అసలైన ఆధారం లేకుండా పోయింది. దీంతో అందరూ ఒకే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు  తెలుస్తోంది. గతంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏడుగురితో ఏర్పడిన కమిటీ ఇక్కడి తుక్కు విక్రయించింది. ఆ కమిటీలో సస్పెన్షన్‌కు గురైన ప్రాజెక్టు ఆఫీసర్‌ వి.విజయ్‌కుమార్‌, పెయింటర్‌ శిక్షకుడు పి.వి.రమణ మూర్తి, ప్రిన్సిపల్‌ ఐ.అబద్దంతో పాటు అదే కమిటీలో సభ్యులుగా ఉన్న ఎం.అర్జున్‌రాజు, ఎం.వి.రమణ, ఎం.సత్యనారాయణ, ప్రస్తుత ప్రిన్సిపల్‌ సీహెచ్‌. భాస్కర్‌ రావులతో పాటు తుక్కు కొనుగోలు చేసిన కృప ట్రేడర్స్‌ యజమాని రామస్వామి, వృక్షాలు నరికి తీసుకెళ్లిన టింబర్‌ డిపో యజమాని సన్యాసిరావును సైతం విచారణ చేపట్టారు.  విద్యుత్తు లైన్‌మెన్‌, కేంద్రంలో శిక్షణ పొందుతున్న కొంతమంది విద్యార్థులను కూడా విచారించారు.

అసలు బాధ్యులెవరు?

జనవరి 6, 7 తేదీల్లో తుక్కు విక్రయించారు. ఆ కమిటీలో ముగ్గురిపైనే చర్యలు తీసుకోగా.. మిగతా నలుగురిపై చర్యలు లేకపోవడం, సీసీ ఫుటేజీ రద్దు కావడం, ఆ ఏడుగురితో పాటు ఇతర సిబ్బంది తమకేమీ తెలియదని, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మున్ముందు చర్యలు... నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణలో తుక్కు కొనుగోలుదారు రామస్వామి రూ.2,05,707లకే ఇక్కడి నిల్వ తరలించినట్లు బదులిచ్చారు. ప్రాంగణంలో తుప్పలు మొలిచి అడవిని తలపించడంతో విషసర్పాలు వస్తాయని అప్పటి అధికారుల సూచన మేరకు వాటిని తరలించినట్లు వృక్షాలు నరికించి తీసుకెళ్లిన సన్యాసిరావు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ స్థాయిలో తుక్కు తరలించి లబ్ధి పొందిన మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు అధికారులు చర్యలేమైనా చేపడతారా? నివేదికలతో సరిపెడతారా? అనే చర్చ స్థానికంగా నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని