logo

ఇదే అదును!

నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని 14 గ్రామాల్లో దాదాపు మూడువేల ఎకరాల ఆయకట్టు కలిగిన రావణాపల్లి జలాశయం గేటు మరమ్మతు చేపట్టాలని ఆయకట్టుదారులు ఎదురు చూస్తున్నారు.

Published : 29 May 2023 06:14 IST

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని 14 గ్రామాల్లో దాదాపు మూడువేల ఎకరాల ఆయకట్టు కలిగిన రావణాపల్లి జలాశయం గేటు మరమ్మతు చేపట్టాలని ఆయకట్టుదారులు ఎదురు చూస్తున్నారు. ఈ గేటు రబ్బరు సీలు సరిగ్గా అమర్చకపోవడం, తదితర కారణాల వల్ల నిత్యం క్యూసెక్కుల కొద్ది నీరు వృథాగా బయటకు పోతోంది. ప్రస్తుతం రబీ సీజన్‌ ముగిసింది. జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. జూన్‌ నుంచి ఖరీఫ్‌ మొదలవుతుంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 132 ఎంసీఎఫ్‌టీలు. ఏజెన్సీలో భారీ వర్షాలు కురిస్తే నీటిమట్టం ఒక్కసారిగా పెరుగుతుంది. జులైలో వర్షాలు ముమ్మరంగా కురుస్తాయి. ఆ లోగానే గేటు మరమ్మతు చేస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు పనులు చేపట్టకపోతే నీళ్లొస్తే మరమ్మతులకు వీలుకాదు. ఉపాధి హామీ పథకం కింద జలాశయం కింద కొత్తూరు, గబ్బాడ, నగరం కాలువల్లో పూడికతీసే పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం రూ.20 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. కాలువలు బాగుపడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా గేటు మరమ్మతు చేపట్టకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

* సమస్యని జల వనరుల శాఖ ఏఈఈ రవికుమార్‌ దృష్టికి తీసుకురాగా రెండు మూడు రోజుల్లో గేటు మరమ్మతుకు చేసే నిపుణులకు తీసుకువెళ్తామన్నారు. వారి పరిశీలన అనుసరించి గేటు పునరుద్ధరణ పనులు అవసరాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. త్వరలోనే మరమ్మతులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.

  ప్రధాన గేటు వద్ద దిగజారిన నీటి మట్టం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని