logo

పర్యావరణం.. మారాల్సింది మనం

పశువులు, పక్షులు, నదీనదాలు, జలచరాలు, అడవులు, ఔషధ మొక్కలు... మానవ జీవనం సాఫీగా సాగడానికి ప్రకృతి ఎన్నో వనరులను ప్రసాదించింది.

Published : 05 Jun 2023 03:51 IST

న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్‌

పశువులు, పక్షులు, నదీనదాలు, జలచరాలు, అడవులు, ఔషధ మొక్కలు... మానవ జీవనం సాఫీగా సాగడానికి ప్రకృతి ఎన్నో వనరులను ప్రసాదించింది.

మానవ తప్పిదాలు, ఆధునిక జీవనశైలి, విచ్చలవిడి ప్లాస్టిక్‌ వినియోగం, జీవవైవిధ్యం దెబ్బతినడం... ఇలా ఎన్నో రకాలుగా పర్యావరణానికి హాని కలుగుతోంది.

ఆ ప్రభావం జీవవైవిధ్యంపైనా పడుతోంది. తరిగిపోతున్న పచ్చదనం కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతోపాటు ఎన్నో విధాలుగా అందరికీ హాని కలుగుతోంది. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

వాతావరణ సమతుల్యత మెరుగ్గా ఉండాలంటే అడవులు కనీసం 33 శాతంగా ఉండాలి. ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నప్పుడు నర్సీపట్నం అటవీ డివిజన్‌లో 59 శాతం అడవులు ఉండేవి. పునర్విభజన తరవాత అనకాపల్లి జిల్లాలో కేవలం ఇరవై శాతం అటవీ విస్తీర్ణం మాత్రమే ఉంది. మార్గదర్శకాలకు అనుగుణంగా అడవుల శాతాన్ని చేరుకోవడానికి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతం కావాల్సి ఉంది. ఆ దిశగా జిల్లాలో ఇంకా అడుగులు వేగంగా పడటంలేదు. పచ్చదనం పెంచే క్రమంలో భాగంగా ఈ ఏడాది పదిలక్షల మొక్కలు నాటించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా తీసుకున్నారు. వీటిలో దాదాపు సగం మొక్కలు సరుగుడే కావడం గమనార్హం. ఈ నెల అయిదున అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండ దగ్గర మొక్కనాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. జులై నెలాఖరుకు కనీసం లక్ష మొక్కలు నాటాలన్నది లక్ష్యం. పరిశ్రమలు, గనులు, అటవీ, జిల్లా నీటియాజమాన్యం, ఉద్యానవన తదితర శాఖలకు మొక్కల పెంపకం లక్ష్యాలను నిర్దేశించారు.

నర్సీపట్నంలో సమకూరే చెత్తలో మూడొంతులు ఇలాంటి ప్లాస్టిక్‌ వ్యర్థాలే

నదీ గర్భశోకం...

జిల్లాలో శారదా, సర్పా, వరాహా, తాండవ నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. వరాహానదిలో 0.2 శాతం కాలుష్యం ఉందని గతంలోనే నిపుణులు గుర్తించారు. మరుగుదొడ్లలోని వ్యర్థాలను చాలామంది నదుల్లో కలిపేస్తున్నారు. ప్లాస్టిక్‌ వర్థాలతో పాటు చెత్తను కొన్నిచోట్ల నదుల్లో పోయడం వల్ల జలచరాలకు ముప్పుగా మారింది. నర్సీపట్నంలో వరాహా నది పవిత్ర ఉత్తరవాహిని తీరంలో మున్సిపల్‌ చెత్త కేంద్రం నుంచి వ్యర్థాల ఊట నదిలో చేరుతోంది. దీంతో భక్తులు స్నానాలు చేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. చెత్త నిల్వకు వేరే స్థలం చూడాలని ఎమ్మెల్యే ఆదేశించి ఏళ్లు గడుస్తున్నా మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.

నర్సీపట్నంలో వరాహానది

అవగాహన... ప్రత్యామ్నాయం

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధించి 11 నెలలైంది. ఒకటి రెండు నెలలు జరిమానాలు, కేసులు అంటూ హడావుడి చేసిన అధికారులు ఆ తరవాత ఉదాసీనత చూపడంతో మళ్లీ పూర్వం మాదిరిగా వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు. ప్రజలూ వాటిని వాడుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు పొదుపు సంఘాల మహిళలను ప్రోత్సహించి వస్త్ర సంచుల తయారీని ప్రోత్సహించాలి. వాటికి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. తద్వారా ప్లాస్టిక్‌ వినియోగం కొంతయినా తగ్గించవచ్చు. నర్సీపట్నం మున్సిపాలిటీలో 2017లో పాస్టిక్‌ నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆచరణ మాత్రం పట్టించుకోలేదు.


బాధ్యత అందరిదీ...

మొక్కలు నాటడం, కాపాడటం బాధ్యతగా అందరూ భావించాలి. ఈ ఏడాది పది లక్షల మొక్కలు నాటిస్తాం. వచ్చే ఏడాది 20 లక్షల మొక్కలు నాటించాలన్నది లక్ష్యం. ముందుగానే ఇందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం లైఫ్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరిట గత నెల తొమ్మిది నుంచి చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం ఎన్టీపీసీ, అరబిందో ఫార్మా తదితర పరిశ్రమలు సామాజిక బాధ్యత మొక్కల పెంపకానికి సహకరిస్తున్నాయి. త్వరలోనే విత్తన బంతులు తయారు చేయిస్తాం. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో వెదజల్లిస్తాం.

జి.లక్ష్మణ్‌, సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌ఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని