logo

కాలుష్య కాటు.. నిర్లక్ష్యంతో చేటు

అభివృద్ధి పేరుతో చేసే విపరీత చర్యల వల్ల పర్యావరణం పాడవుతున్నా, దాని నుంచి కాపాడడానికి తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటున్నాయి.

Published : 05 Jun 2023 03:51 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

భరించలేని దుర్గంధాన్ని విడుదల చేస్తున్న ఏపీఐఐసీకి చెందిన సీఈటీపీ ప్లాంట్‌

అభివృద్ధి పేరుతో చేసే విపరీత చర్యల వల్ల పర్యావరణం పాడవుతున్నా, దాని నుంచి కాపాడడానికి తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో 2004లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేశారు. ఇక్కడ 120 వరకు రసాయన, ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేశారు. రసాయన పరిశ్రమల వ్యర్థాల శుద్ధికి 875 కిలోలీటర్ల సామర్థ్యంతో కామన్‌ ఎఫ్ల్యుయంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (సీఈటీపీ) నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా రసాయన, ఫార్మాకంపెనీల వ్యర్థాలు ఏ విధంగా శుద్ధి జరుగుతుందీ పెద్దగా పట్టించుకోవడం లేదు. సీఈటీపీ ప్లాంటుకు తీసుకొస్తే శుద్ధి చేయడానికి రూ. లక్షల్లో చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొన్ని కంపెనీలు ఖాళీరోడ్లు, మురుగు కాలువల్లో రహస్యంగా వదిలేస్తున్నారని నిర్వాసితులు, సెజ్‌ కార్మికులు చెబుతున్నారు. రసాయనాలను కాలువలు, రోడ్లుమీద విడిచిపెడుతున్న కంపెనీలు కొన్నయితే మరికొన్ని ప్రమాదకరమైన ముడిసరకును తీసుకొచ్చే ప్లాస్టిక్‌ సంచులను మండలంలోని శివారు ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు.

గాలి కాలుష్యానికి సజీవ సాక్ష్యం

ప్రత్యేక ఆర్థిక మండలిలో 200 వరకు పరిశ్రమలుండగా వీటిలో 134 అత్యంత ప్రమాదమైన రెడ్‌జోన్‌లో ఉన్నాయి. ఇంతటి ప్రమాదకర పరిశ్రమలను ఆనుకొని 22 వేల మంది మహిళా కార్మికులు పనిచేసే గ్రీన్‌జోన్‌ రంగానికి చెందిన బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ పార్కు ఉంది. గత ఏడాది జూన్‌, ఆగస్ట్‌ నెలల్లో రెండుసార్లు విషవాయువులు విడుదలై సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో పనిచేసే 539 మంది మహిళలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. విషవాయువులు ఎక్కడ నుంచి విడుదలయ్యాయో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తేల్చలేకపోయారు.


భూగర్భ జలాలు కలుషితం

కాలువల్లో వ్యర్థాలు వదిలేయడంతో నల్లగా మారిన నీరు

సెజ్‌లో పూడి వద్ద ఉన్న రసాయన పరిశ్రమల వల్ల అక్కడ భూగర్భజలాలు కలుషితం అయ్యాయి. ఈ గ్రామానికి చెందిన నిర్వాసితులకు వెదురువాడ వద్ద ఇంటిస్థలాలు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో పాత గ్రామాల్లోని తాటాకిళ్లలో నివాసం ఉంటున్నారు. గ్రామాల్లోని బోర్లు, బావుల నుంచి నీటిని తీసుకొని తాగితే గతంలో 90 మందికి అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఈ నీటిని తనిఖీ చేయగా ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలింది.


ఐదువేల మొక్కలు నాటుతున్నాం..

పర్యావరణాన్ని కాపాడడానికి నిరంతరం కృషిచేస్తున్నాం. పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని సెజ్‌లో ఈనెల 6న ఐదువేల మొక్కలను నాటుతున్నాం. సీఈటీపీ ప్లాంట్‌ వెనకా పచ్చదనం పెంచుతాం. దీంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి సెజ్‌లో గాలికాలుష్యం  నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.

త్రినాథరావు, జడ్‌ఎం, ఏపీఐఐసీ, అచ్యుతాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని