logo

డబ్బులెప్పుడిస్తారు

గోవాడ కర్మాగారంలో గతేడాది డిసెంబరు ఆఖరి వారంలో గానుగాట ప్రారంభించారు. చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ. 2,700 పైగా యాజమాన్యం చెల్లించాలి.

Updated : 07 Jun 2023 05:33 IST

చెరకు రైతుల ఎదురుచూపులు
రూ.40 కోట్ల మేర బకాయిలు

చోడవరం, న్యూస్‌టుడే: గోవాడ కర్మాగారంలో గతేడాది డిసెంబరు ఆఖరి వారంలో గానుగాట ప్రారంభించారు. చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ. 2,700 పైగా యాజమాన్యం చెల్లించాలి. ప్రస్తుతం టన్నుకు రూ. 2,500 మాత్రమే చెల్లిస్తూ వస్తున్నారు. బకాయిలు చెల్లించాలంటూ కర్షకులు మొర పెట్టడంతో యాజమాన్యం అరకొర చెల్లింపులు చేస్తూ వచ్చింది. డిసెంబరు 31 వరకు మొత్తానికి బకాయిలు చెల్లించారు. ఇటీవల జనవరి 1 నుంచి 15 వరకు పంట సరఫరా చేసిన కొందరు రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు వేశారు. తాజాగా మరికొందరి ఖాతాలకు నగదు వేస్తున్నట్లు సమాచారం. జనవరి ఆఖరు వారంతోపాటు ఫిబ్రవరి, మార్చి నెలల్లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇంతవరకు ఒక్క పైసా చెల్లించలేదు. 2022-23 గానుగాట కాలానికి ఇంకా రూ. 40 కోట్ల మేర యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. చెరకు సరఫరా చేసిన 15 రోజుల్లోగా రైతులకు యాజమాన్యాలు చెల్లింపులు చేయాలన్నది నిబంధన. ఇది అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత చెరకు అభివృద్ధి మండలి అధికారులది. ఇటు యాజమాన్యానికి పట్టక, అటు చెరకు అభివృద్ధి మండలి పట్టించుకోక రైతుల గోడు అరణ్య రోదనే అవుతోంది.


ఇదంతా మా ఖర్మ

గోవాడ కర్మాగారం రైతుగా చెప్పుకొనేందుకు ఒకప్పుడు గర్వపడేవాళ్లం. 300 టన్నుల వరకు చెరకు సరఫరా చేసేవాడిని. 15 రోజులకోసారి నగదు చెల్లింపులు చేసేటప్పుడు పండగ వాతావరణం కనిపించేది. ఇపుడు చెరకు సరఫరా చేసి ఎదురుచూడటంతోనే కాలం గడిచిపోతోంది. దుస్థితి నుంచి గట్టెక్కించేలా పెద్దలు ఆలోచన చేయకపోవడం రైతుల దురదృష్టకరం. ఈ ప్రాంత రైతుల ఆర్థిక దన్నయిన గోవాడను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జనవరి తర్వాత సరఫరా చేసిన పంటకు డబ్బులు అందాల్సి ఉంది. చెరకు సాగు బాగా తగ్గించేశాం. పెట్టుబడులు ఎక్కువయ్యాయి. సకాలంలో యాజమాన్యం డబ్బులివ్వడం లేదు. దీంతో విరక్తి వస్తోంది.

గూనూరు సూర్యనారాయణ, చోడవరం


వడ్డీలకే సరిపోతోంది

కర్మాగారానికి చెరకు సరఫరా చేయగా వచ్చే డబ్బులను సంక్రాంతి పండగ, పిల్లల చదువులకు ఖర్చులు చేసేవాళ్లం. నేడు సాగుకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. 25 టన్నుల మేర చెరకు సరఫరా చేశాను. రూ. 45 వేలకు పైగా అందాలి. నేటికీ పడలేదు. జనవరి ముందు సరఫరా చేసిన పంటకు మాత్రమే చెల్లించారు. కూలీల ధరలు పెరగడం, డబ్బులు అదునుకు చేతిలో లేకపోవడంతో ఈ ఏడాది 60 సెంట్లలో మాత్రమే చెరకు వేశాను. చోడవరం, మాడుగుల పెద్దలు ఈ ప్రాంత కల్పతరువును రక్షించే చర్యలు చేపట్టాలి.

నాగులాపల్లి సూర్యనారాయణ, లక్కవరం


దశలవారీగా చెల్లిస్తున్నాం

చెరకు రైతులకు దశలవారీగా టన్నుకు రూ. 2,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నాం. బయట మార్కెట్లో చక్కెర విక్రయించడం ద్వారా వచ్చిన నగదుతో ఇప్పటివరకు జనవరి 15 వరకు సరఫరా చేసిన రైతులకు నగదు జమ చేశాం. జనవరి 16 నుంచి 31 వరకు సరఫరా చేసినవారి ఖాతాలకు నగదు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్యుదుత్పాదన పడిపోవడంతో కాస్త ఆదాయం తగ్గింది. దానికితోడు మార్కెట్లో చక్కెర ధర ఆశాజనకంగా లేదు. వచ్చే గానుగాట కాలం బాగుంటుందని భావిస్తున్నాం. సాగుకు రైతులను సమాయత్తం చేస్తున్నాం.

వి.సన్యాసినాయుడు, ఎండీ, గోవాడ చక్కెర కర్మాగారం


చెరకు సరఫరా చేసి ఆరు నెలలు అవుతోంది. గానుగాట ముగిసి మూడు నెలలు దాటింది. మాకు ఇవ్వాల్సిన నగదు నేటికీ చెల్లించలేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. దీంతో చెరకు సాగు చేయాలంటేనే విరక్తి కలుగుతోంది. అందుకే సాగు తగ్గించేస్తున్నాం..

గోవాడ చక్కెర కర్మాగారం రైతుల ఆవేదన ఇదీ.


గోవాడ కర్మాగారంలో షేర్లు ఉన్నాయి.. ఏటా 20 టన్నులకు పైగా చెరకును సరఫరా చేస్తాం అంటూ మొన్నటి వరకు ఫ్యాక్టరీ రైతు గొప్పగా చెప్పుకొంటూ మీసం మెలేసేవాడు. నేడు ఆ పరిస్థితులు పోయాయి. చెరకు సాగు తగ్గించేస్తున్నాడు. ఎవరైనా షేర్లు కొంటే... ఇచ్చేస్తామంటూ తిరుగుతున్నారు.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం చెరకు రైతులకు కర్మాగారం సకాలంలో చెల్లింపులు చేయకపోవడమే.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని