logo

Venkaiah Naidu: మంచివారిని ఎన్నుకోండి.. లేదంటే ప్రజాస్వామ్యానికే ముప్పు

రాజకీయాల్లో మంచివారిని ప్రోత్సహించాలని, అటువంటి వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని భారత మాజీ  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

Published : 25 Jun 2023 23:10 IST

చట్టసభల స్థాయి పడిపోతోంది
నిజాయితీ ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలి
బూతులు మాట్లాడే నేతలకు ఓటుతో సమాధానం చెప్పాలి
ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

అనకాపల్లి: రాజకీయాల్లో మంచివారిని ప్రోత్సహించాలని, అటువంటి వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అనకాపల్లిలో రాజ్యసభ మాజీ సభ్యుడు, తుమ్మపాల చక్కెర కర్మాగారం వ్యవస్థాపకుడు వీవీ రమణ శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వీవీ రమణ విగ్రహాం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాలు, వ్యక్తుల అభ్యున్నతి జరగాలన్నది తన ఆకాంక్షని పేర్కొన్నారు. దీని కోసం నిజాయతీ ఉన్న, చదువుకున్న యువతరం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలంటే ఇప్పుడు గౌరవం తగ్గుతోందని, ఈ పరిస్థితి మారాలంటే ప్రజల కోసం అంకితభావంతో పని చేసే యువత రాజకీయాలలోకి రావాలన్నారు.  చట్టసభలు పవిత్రమైన ఆలయాలు లాంటివని, అక్కడ బూతులు మాట్లాడటం ఆవేదన కలిగిస్తోందన్నారు. అటువంటి నేతలకు పోలింగ్ బూత్‌లలో ఓటుతో సమాధానం చెప్పాలని సూచించారు. చట్టసభల స్థాయి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, అందుకు కారణం స్థాయి లేని వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవటమేనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మంచి వారిని ప్రోత్సహించాలని, లేదంటే రాజకీయాలు భ్రష్టు పట్టి ప్రజాస్వామ్యానికే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఒక నేతను ఎన్నుకునే ముందే ప్రజల కోసం పనిచేసే గుణం ఉందా లేదా అని అంచనా వేసుకొని ఓటు వేయాలన్నారు. నేతలు ఒకరినొకరు దూషించుకోవడం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు వేరయినంత మాత్రాన శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదని, ఒకరికొకరు ప్రత్యర్థులే గాని శత్రువులు కాదని, పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు