logo

నారసింహ హోమం.. భక్తజన నీరాజనం

భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు.

Published : 29 Mar 2024 03:58 IST

సింహాచలం, న్యూస్‌టుడే: భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న చతుర్వేద హవన పూర్వక పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీసుదర్శన నృసింహ మహాయజ్ఞం గురువారం రెండవ రోజు శాస్త్రోక్తంగా కొనసాగింది. అప్పన్న స్వామికి ప్రీతిపాత్రమైన గురువారం, స్వామివారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రం ఒకేరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభాత సేవతో ప్రారంభించి..: తొలుత అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు. ఉదయం 7గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి యాగశాల ఆవరణలోని వేదికపై ఆశీనులను చేశారు. పండితులు చతుర్వేదాలు, నారసింహ, సుదర్శన మంత్రాలతో హోమాలు నిర్వహించారు. హోమ ద్రవ్యాలను యజ్ఞగుండాల్లో సమర్పించి పూర్ణాహుతి చేపట్టారు. భక్తులు యాగశాల ప్రదక్షిణం అనంతరం స్వామిని దర్శించుకుని యజË్ఞ ప్రసాదం స్వీకరించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ జైన్‌ పాల్గొన్నారు. ఈవో సింగల శ్రీనివాసమూర్తి యజ్ఞ ఏర్పాట్లను; ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఐ.వి.రమణాచార్యులు, అలంకారి పురోహితులు కరి సీతారామాచార్యులు యాగశాలను పర్యవేక్షించారు. ట్రస్టీలు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేశ్‌రాజ్‌, 98వ వార్డు కార్పొరేటర్‌ పి.వి.నరసింహం, తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని