logo

ఏవీ కూరగాయలు.. నిలువెల్లా గాయాలు!

రైతు బజారుకెళ్తే తక్కువ ధరకు కూరగాయలు లభిస్తాయని కొనుగోలుదారుల ఆశ. నగరంలో ఎక్కువ మంది వీటిపైనే ఆధారపడతారు. రైతులకు ఉపాధి దక్కి...కొనుగోలుదారులకు మేలు జరగాల్సిన ఈ రైతుబజార్ల అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం దృష్టిసారించకపోవడం ఎన్నో కష్టాలు తెచ్చి పెడుతోంది.

Published : 16 Apr 2024 04:39 IST

సీఎం జగన్‌ మరిచె.. కష్టాలు ముసిరె!!
అధ్వానంగా రైతుబజార్లు
ఈనాడు, విశాఖపట్నం

రైతు బజారుకెళ్తే తక్కువ ధరకు కూరగాయలు లభిస్తాయని కొనుగోలుదారుల ఆశ. నగరంలో ఎక్కువ మంది వీటిపైనే ఆధారపడతారు. రైతులకు ఉపాధి దక్కి...కొనుగోలుదారులకు మేలు జరగాల్సిన ఈ రైతుబజార్ల అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం దృష్టిసారించకపోవడం ఎన్నో కష్టాలు తెచ్చి పెడుతోంది.

గన్‌ పాలనలో రైతుబజార్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. జనం ఏం కోరుకుంటున్నారు...అవసరమైన కూరగాయలు వస్తున్నాయా, రైతులు తెస్తున్నారా? లేకుంటే ఏం చేయాలి అనే ధ్యాసే కరవయింది. ఫలితంగా సమస్యల నడుమే నిర్వహణ సాగుతోంది. పలు చోట్ల విక్రయించే కాయగూరలు నాణ్యతగా ఉండటం లేదు. దీంతో అధిక సంఖ్యలో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలు అందుబాటులో లేక వెనుదిరుగుతున్నారు. కొన్ని రకాల ధరలు బయట మార్కెట్‌తో పోల్చితే రైతుబజార్లలో ఎక్కువగా ఉంటున్నా పర్యవేక్షించే నాథుడు లేడు. అటు రైతులు...ఇటు ప్రజలు కష్టాలు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరుపై జనం మండిపడుతున్నారు.

ఎంవీపీ బజారు వద్ద చెత్త నిల్వ

సమస్యలు స్వాగతం: ‘అందుబాటు ధరల్లో నాణ్యమైన కాయగూరలు విక్రయించాలి. అటు రైతులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజల అవసరాలను తీర్చాలి’ అనేది రైతు బజార్ల లక్ష్యం. విశాఖ వంటి నగరంలో వీటి మీదే ఎక్కువమంది ఆధారపడతారు. వారాంతాల్లో రద్దీగా ఉంటాయి. గతంలో నిర్వహణ బాగుండేది. ఇప్పుడు దారుణంగా మారాయి. లోపలికి అడుగుపెడితే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

మరుగుదొడ్డి వద్దే కరివేపాకు

నాణ్యత ఏది?: ప్రస్తుతం బజార్లకు వస్తున్న కాయగూరల్లో నాణ్యత వెతుక్కోవాల్సిందే. ముఖ్యంగా ఉల్లి, బంగాళదుంప, టమాట, క్యారెట్‌, క్యాబేజి, కాలీఫ్లవర్‌, చిక్కుడు రకాలు నాసిరకంగా ఉంటున్నాయి. ఉల్లి, టమాటాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కొందరు రైతులను దీనిపై ప్రశ్నిస్తే సరకు అలానే వస్తుందంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు కళ్లుమూసుకోవడంతో వినియోగదారులు వాటినే కొనుగోలు చేయాల్సి వస్తోంది.

పనిచేయని తాగునీటి కుళాయి

నగరంలో రైతుబజార్లు 13
రోజుకు విక్రయించే కూరగాయలు 5 వేల క్వింటాళ్లు


అవస్థలు ఇలా..

  • సీతమ్మధార రైతుబజారు అత్యంత ఇరుకుగా ఉంది. స్థలం చాలక మరుగుదొడ్ల వద్దే రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారు. పార్కింగ్‌ సమస్య కూడా నెలకొంది.
  • ఎంవీపీ రైతుబజారు విశాలంగా ఉన్నా చాలామంది రైతులు దుకాణాల్లో కాకుండా ఆరుబయటే అమ్ముతున్నారు. గతంలో తాగునీరు, విశ్రాంతికి కేటాయించిన గదులు ఇతర అవసరాలకు వాడుతున్నారు. శీతలగిడ్డంగులు పాడైపోయాయి. నడకదారులు శిథిలమయ్యాయి.
  • నరసింహనగర్‌ బజారులో నాణ్యమైన కాయగూరలు ఎప్పుడూ అందుబాటులో ఉండవని వినియోగదారులు వాపోతున్నారు. ఇక్కడి పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి.  
  • పెందుర్తిలో నిర్వహణకు సరిపడినంత స్థలం లేదు. దీంతో చాలామంది విక్రయాలకు ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్‌ సమస్య ఉంది.
  • పెదవాల్తేరు బజారులో రైతుల పేర్లతో కొందరు బినామీలు స్టాళ్లు నిర్వహిస్తున్నారు. తాగునీరు అందుబాటులో లేదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. విద్యుత్తు దీపాలు వెలగడం లేదు.
  • కంచరపాలెంలో 201 మంది రైతులుంటే 114 స్టాళ్లు ఉన్నాయి. మిగిలిన వారంతా నేలపైనే విక్రయిస్తున్నారు. పార్కింగు సమస్య తీవ్రంగా ఉంది.
  • మధురవాడలో 84 స్టాళ్లు ఉండగా 100 మంది రైతులున్నారు. కొందరు స్టాళ్ల ముందు డేరాల్లో వ్యాపారాలు సాగిస్తున్నారు. చిన్నపాటి వర్షంపడితే చాలు బురదమయంగా మారిపోతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని