logo

ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు

‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి.

Published : 18 Apr 2024 04:38 IST

రెండు ఫర్నేస్‌లు, ఓవెన్‌లు, నాలుగు రోలింగ్‌ మిల్స్‌ నిలిపివేత!

ఈనాడు-విశాఖపట్నం: ‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో స్టీలు ప్లాంటుకు చెందిన ముడిసరకు బొగ్గు,  లైమ్‌స్టోన్‌ కొన్ని రోజులుగా పోర్టులోనే ఉండిపోయాయి. ఉన్న ముడిసరకు నిల్వలతో వారం రోజులుగా ప్లాంటును నిర్వహించుకుంటూ వచ్చారు. బుధవారం నాటికి ముడి సరకు కొరత తీవ్రమై కీలకమైన బ్లాస్ట్‌ ఫర్నేస్‌(బీఎఫ్‌)లను మూసి వేసేందుకు నిర్ణయించారు. 16వ తేదీ రాత్రి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-2లో రూ. కోటి విలువైన బొగ్గును వేసి మూసివేశారు. ఆ తరువాత బీఎఫ్‌-3తోపాటు, రెండు బ్యాటరీ ఓవెన్స్‌లో బొగ్గు నింపి ఉంచారు. మిగిలిన మూడు బ్యాటరీల్లోనూ ఉత్పత్తిని సగానికి తగ్గించేశారు. ఫలితంగా కోకోవెన్‌ గ్యాస్‌ ఉత్పత్తి కూడా నిలిచి నాలుగు రోలింగ్‌ మిల్స్‌ బుధవారం షట్‌డౌన్‌ చేశారు.

విశాఖ పోర్టుకు నౌకల మళ్లింపు: స్టీలు ప్లాంటుకు చెందిన 1.50లక్షల టన్నుల బొగ్గు ఆస్ట్రేలియా నుంచి రెండు నౌకల్లో గంగవరం పోర్టుకు  మూడు రోజుల క్రితం చేరింది. వీటితోపాటు పోర్టు గోదాంలో 30వేల టన్నులకు పైగా నిల్వలున్నాయి. ఈ బొగ్గు అక్కడి నుంచి బయటకు రాలేదు. దీంతో బొగ్గు నౌకలను గంగవరం నుంచి విశాఖ పోర్టుకు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్‌ నుంచి ఇటీవల గంగవరం వచ్చిన లైమ్స్‌స్టోన్‌ 60వేల టన్నులు గోదాంలో ఉంది.  ఎక్కడికక్కడ ముడిసరకు ఉండిపోయి స్టీలు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లపై ప్రతి రోజూ సరాసరిన 20వేల టన్నుల హార్డ్‌ మెటల్‌ ఉత్పత్తి చేయాలి. కానీ, 16న 9,100 టన్నులు, 17న 4వేల టన్నులే ఉత్పత్తయింది.  ఎస్‌ఎంఎస్‌ విభాగంలోనూ ఉత్పత్తి  తగ్గిపోయింది.

ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి: విశాఖ స్టీలు ప్లాంటును ఏదొక విధంగా  దెబ్బతీసే కుట్రలో భాగంగానే తాజా పరిణామాలున్నాయని విశాఖ ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మండిపడ్డారు. అదానీ పోర్టు కార్మికుల కోరికలు సాధారణమైనవన్నారు. ఆరు నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు, వైద్య సదుపాయాలపై యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించకపోతే, ఆ ప్రభావం విశాఖ ఉక్కుపై పడుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని