logo

ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలయ్యారు

శాసన మండలి సభ్యులుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. జనగామలో పల్లారాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై విజయం సాధించగా, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి.. సింగపురం ఇందిరను ఓడించారు.

Updated : 04 Dec 2023 06:26 IST

ఫలితాలు ప్రకటించిన అనంతరం విజయ సంకేతం చూపుతున్న కడియం,  పల్లా

జనగామ, న్యూస్‌టుడే: శాసన మండలి సభ్యులుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. జనగామలో పల్లారాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై విజయం సాధించగా, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి.. సింగపురం ఇందిరను ఓడించారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ సిట్టింగు శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్యల స్థానంలో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు భారాస టికెట్లు ఇచ్చింది. ఈ ఇద్దరూ భారాస తరఫున తొలిసారి శాసనసభకు పోటీ చేయడంతో పాటు ఒకే జిల్లా పరిధిలోని పక్కపక్క నియోజకవర్గాల నుంచి ఎన్నిక కావడం విశేషం.

కడియం శ్రీహరి 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఆయన 2027 నవంబరు 30 వరకు పదవీకాలం ఉంది.

డాక్టర్‌ పల్లారాజేశ్వర్‌రెడ్డి 2015లో తెరాస తరఫున నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక 2021లోనూ ఇదే నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించారు. రాజేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 వరకు ఉంది. నిబంధనల ప్రకారం  15 రోజుల లోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల కమిషన్‌ ఆరు మాసాల లోపు ఎన్నికలు నిర్వహిస్తుంది.


ఈ రికార్డు దొంతి సొంతం: 2014 ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెరాస అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిపై 18,376 ఓట్లతో  గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో అదే అభ్యర్థిపై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి 19,184 మెజార్టీతో విజయం సాధించారు.

న్యూస్‌టుడే, నర్సంపేట, చెన్నారావుపేట


మూడోసారి కలిసిరాని పరకాల

ఏ పార్టీ నుంచి అయినా మూడోసారి బరిలో నిలిచిన అభ్యర్థికి పరకాల స్థానం కలిసి రావట్లేదు. 1952లో నియోజకవర్గంగా ఏర్పడిన పరకాలలో 17  పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. గతంలో ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున బొచ్చు సమ్మయ్య రెండు పర్యాయాలు(1978, 1983) వరుసగా విజయం సాధించి మంత్రి అయ్యారు. కానీ తరవాత మూడు పర్యాయాలు(1984, 1989, 1994) పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒంటేరు జయపాల్‌ కూడా రెండు పర్యాయాలు (1985, 1989) ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు (1983) తొలిసారి ఓడిపోయారు. 2009లో కొండా సురేఖ గెలుపొందగా 2012 ఉప ఎన్నికతోపాటు 2018 ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఓటమి చవి చూశారు. ప్రస్తుత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 2014, 2018లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

న్యూస్‌టుడే, పరకాల


నర్సంపేట నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు

నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు శాసనసభ్యులుగా ఎన్నిక కావడంతో ఈప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరకాల నుంచి గెలుపొందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి దుగ్గొండి మండలం కేశవాపురం వాసి కాగా.. నర్సంపేట నుంచి విజయం సాధించిన దొంతి మాధవరెడ్డిది చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌. వీరిద్దరు 1999, 2009 ఎన్నికల్లో ముఖాముఖి తలపడ్డారు. 2014లో రేవూరి తెదేపా నుంచి పోటీ చేయగా, దొంతి మాధవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజేతగా నిలిచారు. ఇలా ప్రత్యర్థులు ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీ నుంచి ఎన్నిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

న్యూస్‌టుడే, నర్సంపేట, చెన్నారావుపేట


రెండు చోట్ల.. మూడో స్థానంలో ‘స్వతంత్ర’ అభ్యర్థులు

ఉమ్మడి జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో ‘స్వతంత్ర’ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌, భారాసల తర్వాత స్థానంలో వీరు ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా వెంకట్‌రెడ్డి ‘కెమెరా’ గుర్తుతో పోటీ చేసి 4,089 ఓట్లు పొందారు. డోర్నకల్‌ నియోజకవర్గం స్థానంలో స్వతంత్ర అభ్యర్థి రత్న అజ్మీరాకు 1,388 ఓట్లు వచ్చాయి. ఆయన ‘కుట్టు మిషన్‌’ గుర్తుతో   ఎన్నికల పోటీలో తలపడ్డారు.

న్యూస్‌టుడే, డోర్నకల్‌, పాలకుర్తి


అధికారి నుంచి ప్రజానాయకుడిగా నాగరాజు

వర్ధన్నపేట, న్యూస్‌టుడే: వర్ధన్నపేట ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేఆర్‌ నాగరాజు పోలీసు శాఖలో 1989లో ఎస్సైగా జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఐపీఎస్‌ స్థాయికి చేరుకున్నారు. ఈ ఏడాది మార్చి వరకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరి తీవ్ర పోటీ నడుమ అనూహ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గం టికెట్ సాధించారు. వర్ధన్నపేట నుంచి రెండు సార్లు రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన భారాస అభ్యర్థి అరూరి రమేశ్‌ను ఎదుర్కొని విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని