logo

వ్యూహకర్తను వరించిన పదవి

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని మారుమూల గ్రామం అర్పన  పల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవి వరించింది.

Updated : 22 Jan 2024 04:41 IST

వేం నరేందర్‌రెడ్డి

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని మారుమూల గ్రామం అర్పన  పల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవి వరించింది. కేబినెట్‌ హోదాలో ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రికి సలహాదారుగా రాష్ట్ర స్థాయిలో పదవి లభించడం గర్వకారణంగా ఉందని మానుకోట జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 2004లో తెదేపా నుంచి మహబూబాబాద్‌ శాసనసభ నియోజకవర్గ సభ్యుడిగా విజయం సాధించిన వేం నరేందర్‌ రెడ్డి యువనేతగా పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేశారు. జనరల్‌ స్థానమైన మహబూబాబాద్‌ శాసనసభ టికెట్‌ను ఆశిస్తూ 1999లో ప్రయత్నించినా అవకాశం లభించకపోవడంతో పార్టీలో చురుకుగా వ్యవహరించారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు రైతు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. 2004లో మహబూబాబాద్‌ శాసనసభ టికెట్‌ పొంది ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై పోరాడారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2009లో నియోజకవర్గం గిరిజనులకు రిజర్వు అయింది. ఈ సందర్భంగా అప్పట్లో శాసనసభ ఎన్నికల కోసం షెడ్యూల్‌ వెలువడే రోజే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒకే రోజు రూ. వంద కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబాబాద్‌లో ఆర్వోబీ, కేసముద్రంలో ఆర్వోబీ, మున్నేరు, పాకాల వాగుపై హైలెవల్‌ వంతెనలు, ప్రధాన బీటీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రస్తుత ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు తదితర నేతలకు స్నేహితుడు. 2016లో రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నరేందర్‌రెడ్డి ఆయనకు సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా అవకాశం రాకపోయినా ఈ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటారు. తన అనుచరులకు వివిధ రకాలుగా సాయపడుతూ పార్టీ పదవులు ఇప్పించడం, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు వ్యూహరచన చేస్తూ సఫలీకృతుడవుతున్నట్లు ఆయనకు పేరు ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముఖ్య నాయకులు, కార్యకర్తలను సమన్వయపరుస్తూ క్రియాశీలకంగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని