logo

రాజకీయ నేతలకు రామ పాఠం

ఎన్ని తరాలైనా రామరాజ్యం గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. నేటి పాలకులు ఆ కోదండపాణిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడిస్తే సుపరిపాలన సాధ్యం.

Published : 17 Apr 2024 05:13 IST

అందిపుచ్చుకుంటే సుపరిపాలన సాధ్యం 
నేడు శ్రీరామనవమి

ఎన్ని తరాలైనా రామరాజ్యం గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. నేటి పాలకులు ఆ కోదండపాణిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడిస్తే సుపరిపాలన సాధ్యం. లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాకతీయులు ఏలిన గడ్డలో వరంగల్‌, మహబూబాబాద్‌ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కోసం పోటీ చేస్తున్న వారు రాముడి సుగుణాలను అందిపుచ్చుకొంటే విజేతలయ్యాక పాలనలో అద్భుతాలు సాధిస్తారు. నేడు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాజకీయ నేతలు రాముడి సుగుణాలను అందిపుచ్చుకొంటే కలిగే ప్రయోజనాలపై కథనం.

ఈనాడు, వరంగల్‌ ‘ రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటే శ్రీరాముడు ధర్మానికి నిలువెత్తు రూపం అని అర్థం. ఈ మాటలు అన్నది మరెవరో కాదు రాక్షసుడైన మారీచుడు అని రామాయణం చెబుతోంది. దానవులు సైతం ప్రశంసించే గొప్ప వ్యక్తిత్వం రామచంద్రుడిది.’

గొప్ప వారసుడు

నేడు వారసత్వ రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు అధికారంలో ఉంటే అనేక మంది వారి వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎలాంటి పదవి లేకున్నా లేనిపోని అధికారాలు చెలాయిస్తున్నారు. రాముడు అలా కాదు. పట్టాభిషేకం చేసుకొని రాజ్యమేలాల్సిన సమయంలో కైకేయికి ఇచ్చిన వరం వల్ల తండ్రి దశరథుడు ఆదేశించిన వెంటనే వనం బాట పట్టాడు. అక్కడ నిరాడంబర జీవితం గడిపాడు.

ఏం నేర్చుకోవాలి: ఇప్పుడు వారసులుగా వచ్చే వారు ఇవే సుగుణాలను అలవర్చుకోవాలి. తల్లిదండ్రుల అధికారంతో కాకుండా తమ మంచి వ్యక్తిత్వంతో ప్రజా సేవ చేసి మంచి పేరు పొందాలి. డాబు దర్పం ప్రదర్శించకుండా రాముడిలా నిరాడంబరంగా ఉండాలి.

శత్రువునూ గౌరవించడం

నేటి నేతలు ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థుల పొరపాట్లను చెబుతూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. రాముడు ఏనాడూ శత్రువును పల్లెత్తు మాట అనలేదు. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొనిపోతే మొదట అది అధర్మమని, చేసిన తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోవాలని పలు మార్గాల్లో సూచించాడు. ధర్మబద్ధంగా యుద్ధం చేసి రావణాసురుడిని హతమార్చాడే తప్ప ఏనాడూ ఆయన్ని అసభ్య పదజాలంతో దూషించలేదు.

నేటి నేతలు కూడా ప్రసంగాల్లో, గౌరవంగా మాట్లాడాలి. నిజంగా ఎదుటి వ్యక్తి పొరపాట్లు ఉంటే వాటిని సరైన రీతిలో వెల్లడించాలి.

రాజ్యంలో ప్రశాంతం

రామరాజ్యంలో ప్రజలు ఆనందంగా జీవించేవారు. సకాలంలో వర్షాలు కురిసేవి. మహిళలపై అకృత్యాలు లేవు. వన్య మృగాల భయం ఉండేది కాదు.  దొంగతనాలు, దోపిడీల గురించి ఆనాటి ప్రజలకు తెలియదు.  ఇప్పుడు అడవుల ఆక్రమణ వల్ల వన్యమృగాల దాడులు పెరుగుతున్నాయి. మూగజీవాల హింస పెరిగింది. పారిశుద్ధ్య సమస్య వల్ల దోమల బెడద పెరిగింది. కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. తరచూ గొడవలు, హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నాం.

నాయకులు గెలిచినా, ఓడినా ప్రజల్లో వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది. రాముడి నుంచి పాలనా దక్షత నేటి నేతలు నేర్చుకోవాలి.

ఇచ్చిన మాటకు కట్టుబడి..

రాముడు ఏనాడూ అబద్ధం పలకలేదు. ఎంత కష్ట సమయంలోనైనా నిజాన్నే నమ్ముకున్నాడు. నేటి నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట గురించి ఆలోచించడం లేదు.

 ఇచ్చిన మాటకు ఆ పరంధాముడిలా కట్టుబడి ఉండడం నేర్చుకోవాలి. హామీలిస్తే అవి కచ్చితంగా నెరవేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పకూడదు.

విలువలే ప్రాణం

పట్టాభి ఏనాడూ నమ్మిన సిద్ధాంతాన్ని, విలువలను వదులుకోలేదు. రాజ్యం పోయినా, భార్య దూరమైనా, అడవిలో అడుగడుగునా కష్టాలు కడగండ్లు ఎదురైనా విలువల కోసం చివరి వరకు పాటుపడ్డాడు. నేటి తరం నాయకులు అనేక మంది విలువలకు పాతరేస్తున్నారు. అధికారం ఉంటే చాలు విలువలు ఏమైపోతే అనే ధోరణితో ఫార్టీలు మారుతున్నారు. అక్రమ మార్గాల్లో సంపాదిస్తూ ఎన్నికల్లో నెగ్గేందుకు డబ్బు వెదజల్లుతున్నారు.

 మన నాయకులు సీతాపతిలా విలువలతో కూడిన పాలన అందించే దిశగా అడుగులు వేస్తే ఓరుగల్లులోనూ రామరాజ్యం సాధ్యమవుతుంది.

ధైర్యం ఎంతో అవసరం

రాముడు ఎంతో పరాక్రమవంతుడు. ఎవరికీ సాధ్యం కాని శివధనస్సును ఎత్తాడు. మారీచాది రాక్షసులను సంహరించాడు. లంకేశ్వరుడు ఎంతో శక్తిమంతుడు అని తెలిసి ఏమాత్రం భయపడకుండా వానర సేనతో ఏకంగా సముద్రంపై వారధి కట్టి చివరకు కొండంత ధైర్యంగా రావణుడిని సంహరించాడు.

 నేటి తరం నేతలకు కూడా ధైర్యం ఎంతో అవసరం. ప్రజల కోసం సమస్యలపై ధైర్యంగా పోరాడాలి. మంచి పాలన కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలవాలి.  


అన్నింటిలో ఆదర్శప్రాయుడు

- శేషు శర్మ, భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు

రాముడు తాను ఏనాడూ దేవుడినని చెప్పలేదు. విలువలతో కూడిన మనిషిగానే జీవించాడు. అయోధ్యను పాలించే భరతుడు అడవిలో ఉన్న రాముడి దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన వేసిన మొదటి ప్రశ్న ప్రజలు బాగున్నారా? అని, తప్పు చేయకుండా ఎవరికీ శిక్షలు పడడం లేదుగా మన రాజ్యంలో అన్నాడట. అది గొప్ప నాయకత్వ లక్షణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని