logo

తప్పటడుగు వేస్తే... తప్పదు వేటు!

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది.. అభ్యర్థుల తరఫున పార్టీల వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Published : 17 Apr 2024 05:19 IST

 ఎన్నికల వేళ.. ఉద్యోగులూ జాగ్రత్త
న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌

 

లోక్‌సభ ఎన్నికల్లో శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులకు సూచనలు చేస్తున్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది.. అభ్యర్థుల తరఫున పార్టీల వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలి. ఎన్నికల సభలు, సమావేశాలు, రాజకీయ పార్టీలకు మద్దతు తెలపడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉద్యోగులు పనిచేయాలి.. ఆరు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న  70 వేల మందికి పైగా శాశ్వత, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

నిబంధనలు ఇవే..

  •  ఉద్యోగులు రాజకీయ సభలు, సమావేశాల్ల్లో పాల్గొని ప్రచారం చేయడం, రాజకీయ పార్టీలు, నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం వంటి పనులు చేయొద్దు. సెక్షన్‌ 23 ప్రకారం ఎన్నికల కోడ్‌ ఉన్నన్ని రోజులు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.
  • ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఉద్యోగానికి రాజీనామా చేయాలి.
  •  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆధారం దొరికినా చాలు సంబంధిత ఉద్యోగిపై వేటు తప్పదు.
  •  ఉద్యోగి కింది స్థాయి సిబ్బందికి ఫలానా అభ్యర్థికి మద్దతు తెలపాలని, లేదా సహకరించాలని, ఓటేయాలని సూచించినా శాఖాపరమైన చర్యలు తప్పవు.

సామాజిక మాధ్యమాల్లోనూ  జాగ్రత్తలు అవసరం

  •  తమకు నచ్చిన నాయకుల కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుంటారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ఇలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే త్వరగా దొరికిపోవడం ఖాయం.
  •  ప్రభుత్వ ఉద్యోగుల సోషల్‌ మీడియా అకౌంట్లపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఉద్యోగులు సోషల్‌ మీడియాలో పెట్టే ప్రతి పోస్టును గమనిస్తుంది.  
  •  ఉద్యోగులు రాజకీయ పార్టీలు, నాయకులకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపైనా ఎవరైనా ఫిర్యాదు చేసినా వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటారు.

గ్రూప్‌ అడ్మిన్‌ సైతం బాధ్యులే..

ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు పలు సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులపై పోస్టులు పెడుతుంటారు. అలాంటి వాటిపై సంబంధిత గ్రూప్‌ అడ్మిన్‌ ప్రభుత్వ ఉద్యోగి అయినా జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా గ్రూపులో పోస్టులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎవరైనా తప్పుడు పోస్టు చేసిన వ్యక్తితో పాటు అడ్మిన్‌పైనా కేసు నమోదు చేస్తారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో..

  •  భారాస అధినేత కేసీఆర్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నందున భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న సాంస్కృతిక సారథి కళాకారిణిని భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.
  •  పెద్దపల్లి జిల్లా రామగుండంలో భారాస ఎమ్మెల్యే అభ్యర్థి నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న భూపాలపల్లి జిల్లాలోని మరొక సాంస్కృతిక సారథి కళాకారుడు కూడా సస్పెండ్‌కు గురయ్యారు.
  •  ములుగు జిల్లా ఎక్సైజ్‌ శాఖ కానిస్టేబుల్‌ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద సస్పెండ్‌ చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని