logo

అందరి సంక్షేమం.. పార్టీల సంకల్పం

ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో).. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు చేసే మేలు గురించి తెలియజేసే విధానపరమైన హామీ పత్రం. పార్టీల ఎన్నికల ప్రచారం వీటి చుట్టే  తిరుగుతుంది. ఒక రకంగా ఇది పార్టీ భవిష్యత్తు ముఖచిత్రం..

Published : 18 Apr 2024 06:17 IST

ఈనాడు, మహబూబాబాద్‌

ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో).. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు చేసే మేలు గురించి తెలియజేసే విధానపరమైన హామీ పత్రం. పార్టీల ఎన్నికల ప్రచారం వీటి చుట్టే  తిరుగుతుంది. ఒక రకంగా ఇది పార్టీ భవిష్యత్తు ముఖచిత్రం..

లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఉద్ధృతమవుతున్న వేళ జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లు తమ ఎన్నికల ప్రణాళికలు వెలువరించాయి. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా వాటిని రూపొందించాయి. ఏ పార్టీ ఎన్నికల ప్రణాళికలు ఎలా ఉంది.. వీటి వల్ల ఉమ్మడి వరంగల్‌ వాసులకు కలిగే మేలు గురించి ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..


కాంగ్రెస్‌.. అందరికీ అభయహస్తం

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని దిల్లీలో ఈ నెల 5న వెలువరించిన తన ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ నెల 6న హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలోనూ ఈ విషయం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ గ్యారంటీ పథకాల కార్డును వెల్లడించారు. ఐదింటిలో యువ, మహిళ, రైతు, శ్రామిక, సామాజిక న్యాయానికి సంబంధించి పథకాలు ఉన్నాయి.


భాజపా.. అన్ని వర్గాలకు మోదీ గ్యారంటీ

తమ పార్టీ మరోసారి అధికారంలో వచ్చాక ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా పథకాలు అందిస్తామని.. ‘మోదీకీ గ్యారంటీ’ పేరుతో ఈ నెల 14న అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని భాజపా తన ఎన్నికల ప్రణాళికను వెలువరించింది. పేదలు, యువత, మహిళలు, రైతులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా పథకాలను పొందుపరిచింది.


నారీ న్యాయం

దేశంలో ఏ కుటుంబం పేదరికంలో ఉండొద్దు. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళ బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.లక్ష జమ చేస్తామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి జిల్లాకు కలిగే ప్రయోజనం: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న 19.08 లక్షల మంది మహిళల్లో సుమారు 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.


యువ

నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి యువ న్యాయం కార్యక్రమం అమలు చేస్తామన్నారు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన 25 ఏళ్లలోపు యువత కోసం ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్‌ అమలు చేస్తారు. ఏడాది కాలంలో రూ.లక్ష ఉపకార వేతనం అందిస్తామన్నారు.

ఉమ్మడి జిల్లాలో 15 లక్షల మంది 18 నుంచి 39 ఏళ్ల యువత ఉన్నారు. ఇందులో 25 ఏళ్లలోపు వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. వారందరికీ యువ న్యాయం ఉపయుక్తం కానుంది.


రైతు న్యాయం

అన్నదాతలకు ప్రయోజనం కలిగేలా రైతు న్యాయం పథకానికి రూపకల్పన చేశారు. ముఖ్యంగా కిసాన్‌ న్యాయ్‌ ద్వారా రుణమాఫీ చేస్తామన్నారు. స్వామినాథన్‌ ఫార్ములా ప్రకారం పంటలకు చట్ట బద్ధమైన మద్దతు ధర కల్పిస్తామన్నారు.

ఉమ్మడి జిల్లాలోని 7,54,327 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. 18.02 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వివిధ రకాల పంటలకు మద్దతు ధర దక్కనుంది.


సామాజిక న్యాయం

అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక, కులగణన చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో పరిమితి తొలగింపు ఉంటుంది. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్‌ ఏరియాలుగా గుర్తింపు ఇస్తారు. ఇలా సామాజిక న్యాయం కలిగేలా పథకాలను రూపొందించారు.


శ్రామిక న్యాయం

శ్రామిక్‌ న్యాయ్‌ పథకం ద్వారా కార్మికులు, కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీని ద్వారా గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు, ఇతర రంగాల్లోని కార్మికులు సంతోషించేలా రోజుకు వారి కనీస వేతనం రూ.400 అమలు చేస్తారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న 15.38 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు, తక్కువ వేతనంతో పని చేసే 3 లక్షల మంది కార్మికులకు కనీస వేతనం అందనుంది. మత్స్య కార్మికులకు డీజిల్‌పై రాయితీ అందిస్తామని, సహకార బ్యాంకు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీని వల్ల ఉమ్మడి జిల్లాలోని దాదాపు 80 వేల మంది మత్స్య కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.


ఉచిత రేషన్‌

అధికారంలో వచ్చాక ఐదేళ్లపాటు ప్రజలకు ఉచిత రేషన్‌ అందిస్తామని ప్రకటించారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 11.11 లక్షల కార్డుల్లోని 32,55,117 మంది లబ్ధిదారులకు ఉచిత  బియ్యం అందుతుంది.


రూ.5 లక్షల వైద్యం

పేద, ధనిక భేదం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద నాణ్యమైన వైద్యం అందించాలని నిర్ణయించుకుంది. దీని ద్వారా వారికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది.

  • ఉమ్మడి జిల్లాలోని సుమారు 1.93 లక్షల మందికి నాణ్యమైన ఉచిత వైద్యం అందనుంది.
  • ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి ట్రాన్స్‌జెండర్లను తీసుకొస్తామంటున్నారు. దీనిద్వారా ఉమ్మడి జిల్లాలో ఉన్న సుమారు 495 ట్రాన్స్‌జెండర్లకు మెరుగైన వైద్యం అందనుంది.

యువతకు అవకాశాలు

స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రశ్నపత్రాల లీకేజీ నివారణకు చట్టం తీసుకోస్తామని ప్రకటించారు. స్వనిధి, ముద్ర యోజన కింద రుణ వసతి కల్పిస్తామన్నారు.


రైతులు

పీఎం కిసాన్‌ యోజన కింద రూ.6 వేల సాయాన్ని కొనసాగిస్తారు. పంట నష్టాన్ని కచ్చితంగా అంచనా వేసి రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా, పీఎం ఫసల్‌ బీమా యోజన బలోపేతం చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి, సాగునీటి సదుపాయం కల్పనకు ‘కృషి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌’ను ప్రారంభిస్తామన్నారు.


మహిళలు

చట్ట సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను క్రమబద్ధంగా అమలు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు నైపుణ్యాలు కల్పించి, వారి ఆదాయం పెంచేలా తగిన చర్యలు చేపట్టనున్నారు.

  • ఉమ్మడి జిల్లాలోని సంఘాల్లో ఉన్న సుమారు 6.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగపడనున్నాయి. అనారోగ్య సమస్యలను నివారించడానికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు.
  • పీఎం ఆవాస్‌ యోజన ఇళ్లలో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో ఉన్న 64,564 మంది దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు