logo

కొత్త నంబరేసి.. కట్టబెట్టేసి

స్థిరాస్తి ధరలకు రెక్కలు రావడంతో భూదందా కొత్తపుంతలు తొక్కుతోంది. ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్చి స్వాహా చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అసలు సర్వే నంబర్‌కు

Published : 27 May 2022 03:43 IST

అక్రమ రిజిస్ట్రేషన్లతో సర్కారు భూముల స్వాహా పర్వం

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే

స్థిరాస్తి ధరలకు రెక్కలు రావడంతో భూదందా కొత్తపుంతలు తొక్కుతోంది. ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్చి స్వాహా చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అసలు సర్వే నంబర్‌కు సబ్‌ డివిజన్‌ నంబరు సృష్టించి ఇతరుల పేరున రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వ భూములను కాజేశారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన కొందరు అధికారుల ప్రమేయం ఉన్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల భూదందా ఆలస్యంగా వెలుగు చూసింది.

తణుకు(సజ్జాపురం), పాలకొల్లు, ఆచంట, ఆకివీడు, మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రూ.కోట్లు విలువ చేసే 11.42 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఏటా కలెక్టర్‌ 22(ఎ) రిజిస్టర్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపుతారు. అందులో నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూముల వివరాలు ఉంటాయి. అలాగే 2020లో అప్పటి కలెక్టర్‌ జిల్లా వ్యాప్తంగా అలాంటి వివరాలతో పుస్తకరూపంలో విడుదల చేశారు. ఆయా సర్వే నెంబర్లతో ఎలాంటి క్రయవిక్రయాలు జరగడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు. వాటికి సబ్‌డివిజన్‌ నంబర్లు వేసినా రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఈ పుస్తకంలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్తే ఆన్‌లైన్‌లో తిరస్కరణ చూపుతుంది. ఈ నేపథ్యంలో కొందరు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల అండతో బైనంబరు వేసి రిజిస్ట్రేషన్లు చేసేశారు. వీటిపై అప్పట్లో సత్యమేవ జయతే సంస్థ ఉన్నతాధికారులకు పక్కా ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. వీటిపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు కనీసం శాఖాపరమైన విచారణ కూడా చేపట్టలేదు.

ఐదు కార్యాలయాల్లో... తణుకు (సజ్జాపురం) సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఐదు దస్తావేజులుగా సృష్టించి విక్రయించారు. ఐదింటికీ బైనంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. 809/2020 దస్తావేజుకు సంబంధించి మండపాక గ్రామంలో 454/2 నిషేధిత భూమి జాబితాలో ఉంది. దీనిని 454/2(ఎ)గా మార్పుచేసి రిజిస్ట్రేషన్‌ చేసేశారు. ఇలా ఐదు డాక్యుమెంట్లుగా ఈ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఇతరులు సొంతం చేసుకున్నారు. ఈ తరహాలోనే ఉభయ జిల్లాలోని ఐదు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోనూ చేశారు. వీటి పరిధిలోని 24 గ్రామాల్లో 24 సర్వే నంబర్లలో సుమారు 53 దస్తావేజులుగా వీటిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు.

చర్యలు తీసుకుంటాం.. గతంలో 22(ఎ) జాబితాలపై విచారణ జరిగింది. కొందరిని సస్పెండ్‌ చేశారు. సర్వేనంబర్లు, ఇతర వివరాలు అందిస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. - నాగమల్లేశ్వరరావు, ఇన్‌ఛార్జి జిల్లా రిజిస్ట్రార్‌ పశ్చిమగోదావరి.

మొగల్తూరులో చర్యలు..

నిషేధిత భూములను రిజిస్ట్రేషన్లు చేసినట్లు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహించి వాస్తవాలని ధ్రువీకరించారు. గత ఏడాది ఆగస్టులో మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ సత్యనారాయణపై అభియోగం రుజువు కావడంతో సస్పెండ్‌ చేశారు. ఛార్జిషీటు కూడా నమోదు చేశారు. అయితే అతనిని మళ్లీ సర్వీసులోకి తీసుకున్నారు.

సిబ్బంది పాత్ర కీలకం

రిజిస్ట్రేషన్‌ సమయంలో దస్త్రాలను దాఖలు చేసినప్పుడు వాటి పరిశీలనకు డేటా ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు చెక్‌ స్లిప్‌లను కొడతారు. అవి రెడ్‌మార్క్‌తో చూపిస్తూ కర్సర్‌ ముందుకు వెళ్లకుండా ఆగి ఉంటుంది. ఈ సమయంలో సిబ్బంది సాఫ్టువేర్‌లో అంకెలను మార్చి నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముందుకు వెళ్లేలా సహకరిస్తున్నారు. ఈ రకంగా ఆక్రమించిన భూములను మరొకరికి అమ్మినట్లు దస్తావేజులు సృష్టిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని