logo

35 రోజులుగా వరద గోదావరి

గోదావరి వరద తగ్గు ముఖం పట్టిందన్న మాటేగాని.. వేగంగా తగ్గడం లేదు. జులై 10న ప్రారంభమై తగ్గుతూ, పెరుగుతూ ఇప్పటికీ గ్రామాలను తాకుతూనే ఉంది. అనేక పల్లెలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

Published : 14 Aug 2022 03:51 IST

బాధిత కుటుంబాలు ఊళ్లు వదిలి 30 రోజులు


పోలీస్‌ చెక్‌ పోస్టులోకి ప్రవేశించిన నీరు

కుక్కునూరు, న్యూస్‌టుడే: గోదావరి వరద తగ్గు ముఖం పట్టిందన్న మాటేగాని.. వేగంగా తగ్గడం లేదు. జులై 10న ప్రారంభమై తగ్గుతూ, పెరుగుతూ ఇప్పటికీ గ్రామాలను తాకుతూనే ఉంది. అనేక పల్లెలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జులైలో ఆరంభమైన వరద పూర్తిగా తగ్గక ముందే, తిరిగి ఆగస్టు 9న మళ్లీ  ఉద్ధృతమైంది. 11వ తేదీ నాటికి అది గరిష్ఠంగా 52.5 అడుగులకు చేరింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టిన వరద శనివారం సాయంత్రానికి 51 అడుగులకు చేరి నిలకడగా ఉంది. అంటే రెండు రోజుల వ్యవధిలో తగ్గిన వరద కేవలం 1.5 అడుగులు మాత్రమే.

ఊళ్లకు వెళ్లేదెప్పుడు: గ్రామాలను వదిలి  దాదాపు 30 రోజులు పైగా అవుతోంది. జులై 10న వరద ప్రారంభం కాగా, అప్పటి నుంచి వరుసగా ఒక్కో ఊరు ఖాళీ చేసుకుంటూ వచ్చారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 125 ఆవాస ప్రాంతాల్లోని 20,248 కుటుంబాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో 60కి పైగా ఆవాసాలు ఖాళీ చేసి బయటకు వచ్చాయి.అందులో 25 శాతం గ్రామాలు కూడా తిరిగి చేరుకోలేదు. మిగిలిన గ్రామాలన్నీ పునరావాసంలోనే మగ్గుతున్నాయి. కొన్ని గ్రామాలైతే గుట్టలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని కాలం గడుపుతున్నాయి. వరద తగ్గి తిరిగి పూర్వపు స్థితి నెలకొంటే గ్రామాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాయి. గుట్టలు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న బాధితులు విద్యుత్తు, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.

ముంపులోనే చేలు.. పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద శనివారం ఉదయం 34.07 మీటర్లకు పెరిగిన వరద, సాయంత్రానికి 34.02 మీటర్లకు తగ్గింది. 48 గేట్ల నుంచి 11.87 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని పోలీస్‌ చెక్‌పోస్టులోకి వరద ప్రవేశించింది. గోదావరి ఒడ్డున ఉద్ధృతంగా వరద ప్రవహిస్తుండటంతో లాంచీలను కడెమ్మ వంతెనను అనుకుని ఉన్న కాలువలో ఉంచారు. పోలవరం గ్రామంలో నీట మునిగిన వరిచేలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని