logo

ఇంకా అంతుచిక్కలేదు!

2020 డిసెంబరు 5.. ఏలూరు నగర వాసులు ఎప్పటిలాగే దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు.

Updated : 05 Dec 2022 05:24 IST

రెండేళ్లయినా వెలుగుచూడని కారణాలు
ఆ 14 రోజులూ నగరవాసులకు ఆందోళనే
ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు (పాత చిత్రం)

2020 డిసెంబరు 5.. ఏలూరు నగర వాసులు ఎప్పటిలాగే దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇంతలో ఒక్కసారిగా కలవరం. ఉన్నట్టుండి కిందపడిపోతున్నారంట.. కాళ్లూ చేతులూ కొట్టుకుంటున్నారంట.. నోటి వెంట నురగలు వస్తున్నాయంట.. ఎవరి నోటి వెంట విన్నా ఇవే మాటలు. మొదటి విడత కరోనా కోరల్లో చిక్కుకుని అప్పుడప్పుడే కోలుకుంటున్న నగర ప్రజలకిది మళ్లీ అశనిపాతం. మొదట తూర్పువీధిలో ఇద్దరు ముగ్గురు పడిపోయారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరికొద్ది నిమిషాల్లో నగరంలోని పలుచోట్ల ఇళ్ల వద్ద, వీధుల్లో ఉన్నట్టుండి కిందపడిపోవడం చూసి ప్రజల గుండె ఘొల్లుమంది. అసలేం జరుగుతోంది.. ఎందుకు పడిపోతున్నారో తెలియక ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. అయినా ఆ అంతు చిక్కని వ్యాధికి అధికార యంత్రాంగం సరైన కారణాలను కనిపెట్టలేకపోయింది. నీటి కలుషితం వల్లే ఈ విధంగా జరిగిందని దిల్లీ ఎయిమ్స్‌ నివేదిక అందజేసింది. కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు కనుగొన్నామని.. అందుకే ఇలా జరిగి ఉంటుందని పుణేకు చెందిన అధ్యయన సంస్థ నివేదించింది. అంతిమంగా ఇదీ కారణమని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించకపోవడం గమనార్హం.

ఇతర ప్రాంతాల్లోనూ.. నగరంలో కనిపించిన వ్యాధి లక్షణాలు ఆ తరువాత ఇతర ప్రాంతాల్లోనూ వెలుగు చూడటంతో నీటి కాలుష్యం కారణంగా జరిగిందని అంతా అనుకున్నారు. డిసెంబరు 5 నుంచి 14 రోజులు వరుసగా నగరంలో  కేసులు నమోదు కాగా.. నెల వ్యవధిలో దెందులూరు మండలం కొమరేపల్లిలో 30 మంది ఇవే లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. భీమడోలు మండలం పూళ్లలో 20 మంది అవస్థలుపడ్డారు.

ప్రభుత్వాసుపత్రి కిటకిట.. అంతుచిక్కని వ్యాధి ఒక్క రోజు వ్యవధిలో నగరాన్ని చుట్టేసింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి కిటకిటలాడింది. డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో సీనియర్‌ వైద్య నిపుణుడు పోతుమూడి శ్రీనివాసరావు తదితర వైద్యులు సేవలు అందించారు. బాధితులకు ప్రత్యేక వార్డు కేటాయించారు. నగరంలోని 64 ప్రాంతాల్లో 615 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. విద్యానగర్‌కు చెందిన ఒకరు మృతి చెందారు.

ఉన్నట్టుండి పడిపోయా.. ‘ఆ రోజు సాయంత్రం డాబాపై ఉన్నా. ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయా. ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు మూడు గంటల వరకు ఏం జరిగిందో తెలియలేదు. మూర్ఛ మాదిరి వచ్చి కొట్టుకున్నానని.. నోటి వెంట నురగ వచ్చిందని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు బాగానే ఉంది’ అని దక్షిణపు వీధికి చెందిన కల్లపల్లి వినయ్‌ తెలిపారు.

నీరు కలుషితంగా వచ్చేది.. ‘అప్పట్లో తాగునీరు కలుషితంగా వచ్చేది. మా ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు ఆ నీటినే తాగేవారు. ఒకామె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అందించారు. అలా అందరికీ అవుతుందేమోనని ఆందోళన చెందాం’      అని దక్షిణపు వీధికి చెందిన సీహెచ్‌ మూర్తి రాజు వివరించారు.

ఎప్పటికప్పుడు సర్వే.. ‘నగర పరిధిలో ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నాం. ఫిట్స్‌, కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో ఎవరూ బాధ పడటం లేదు. అప్పుడు సేకరించిన నమూనాలకు సంబంధించి ఆయా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి’ అని డీఎంహెచ్‌వో డాక్టరు బి.రవి వివరించారు.

ఇంకా నేర్చుకోని పాఠాలు

అంతు చిక్కని వ్యాధి ప్రబలిన సమయంలో శ్యాంపిల్స్‌ సేకరించి మనకు ల్యాబ్‌లు అందుబాటులో లేనందున దిల్లీ, హైదరాబాద్‌లకు పంపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాకొక ప్రయోగశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రెండేళ్లయినా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు సరికదా ఆ ఊసే లేకుండాపోయింది. దిల్లీ, మంగళగిరి ఎయిమ్స్‌, హైదరాబాద్‌ ఎన్‌ఐఎన్‌.. ఇలా ఐదు ప్రధాన సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చి నమూనాలను సేకరించారు. ఆసుపత్రిలో బాధితుల వద్ద నుంచి, ప్రభావిత ప్రాంతాల్లో కూరగాయలు, నీరు.. ఆ ప్రాంతాల్లోని ఇతర వ్యక్తుల నుంచీ కొన్ని నమూనాలను సేకరించారు.

అంతంత మాత్రంగానే  పారిశుద్ధ్యం

నగరంలో నేటికీ పారిశుద్ధ్య పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతుచిక్కని వ్యాధి వచ్చిన ప్రాంతాల్లోనూ కొన్నిసార్లు డ్రెయిన్లు, పూడిక తీత పనులు సక్రమంగా జరగడంలేదని స్థానికులు చెబుతున్నారు.  చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయని అంటున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కృష్ణా కాలువ ప్రక్షాళన, ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు వంటి కార్యక్రమాలు చేపట్టినా పూర్తి స్థాయిలో జరగలేదు. వ్యాధి బారిన పడిన నగర వాసులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా.. అప్పట్లో హడావుడి చేసి తరువాత పట్టించుకోకుండా వదిలేశారని పలువురు పెదవి విరుస్తున్నారు. కాగా, తాగునీటి సరఫరాలో మాత్రం ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని