logo

ఆగని మోసాలు.. తేలని లెక్కలు!

కైకలూరు మండలం శృంగవరప్పాడులో 20 సంఘాలకు చెందిన రుణ వాయిదాల సొమ్ము రూ.20 లక్షలను స్థానిక వీవోఏ పక్కదారి పట్టించిన వ్యవహారం ఇటీవల వెలుగు చూసింది.

Updated : 19 Mar 2023 05:50 IST

మహిళల సొమ్ము అక్రమార్కుల పాలు

కైకలూరు మండలం శృంగవరప్పాడులో 20 సంఘాలకు చెందిన రుణ వాయిదాల సొమ్ము రూ.20 లక్షలను స్థానిక వీవోఏ పక్కదారి పట్టించిన వ్యవహారం ఇటీవల వెలుగు చూసింది. కొత్త రుణం కోసం ఓ బృందం సభ్యులు బ్యాంకుకు వెళ్లిన సందర్భంలో ఈ అక్రమం బయటపడింది.


వీరవాసరం మండలంలో ఓ గ్రామానికి చెందిన స్వయంసహాయక బృందం నాయకురాలు వాయిదాల సొమ్ము చెల్లింపుల్లో చేతివాటం ప్రదర్శించారు.   సొమ్మును బ్యాంకులో జమచేయకుండా సుమారు రూ. 3.80 లక్షలు స్వాహా చేయడంతో సంఘ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ఆమె రూ.లక్ష తిరిగి జమ చేసినట్లు సమాచారం.


పాలకోడేరు మండలం గరగపర్రులో ఓ గ్రామ సంఘానికి చెందిన నగదు నిల్వల్లో అవకతవకలు జరిగాయి.   సుమారు రూ.31 లక్షల మేర నగదు నిల్వల్లో కొంత మొత్తాన్ని సంబంధిత వీవోఏ, ఓబీలు కాజేసినట్లు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు.

వీరవాసరం, చింతలపూడి, న్యూస్‌టుడే: మహిళా స్వయం సహాయక సంఘాల లావాదేవీల్లో తరచూ మోసాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ గ్రామ సంఘం నిధులను వీవోఏ కాజేసిన వ్యవహారం పాలకోడేరు మండలంలో వెలుగుచూసింది. వాయిదాల సొమ్ము బ్యాంకులో జమచేయకుండా స్వాహా చేయడం, స్త్రీ నిధి రుణాల మళ్లింపు వంటి వ్యవహారాలపై ఇరు జిల్లాల్లో తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి.

గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల నిర్వహణకు గ్రామ సంఘ సహాయకులను(వీవోఏ)  నియమించారు. 30 నుంచి 50 సంఘాల బాధ్యతను ఒక వీవోఏకు అప్పగించారు. ఆయా సంఘాలపై పర్యవేక్షణ, అర్హులకు రుణాలు అందించే బాధ్యతవారిపై ఉంటుంది. దీనికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.8 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తోంది. గ్రామ సమాఖ్య ఆర్థిక లావాదేవీలు బాగుంటే దాని నుంచి అదనంగా మరో రూ.2 వేలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. సంఘాల సభ్యులు ప్రతి నెలా సమావేశాలకు హాజరు కాకపోవడం.. వచ్చినా నగదు నిల్వలపై ఆరా తీయకపోవడంతో మోసాలకు తావిచ్చినట్లవుతోంది. మహిళా బృందాలు కొత్త రుణాలు పొందేటప్పుడు వీవోఏలు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటారు. గ్రామ సంఘాల సభ్యులు పొదుపు చేసిన నగదు నుంచి రుణం పొందాలంటే వారి అనుమతి తీసుకోవాల్సిందే. ఇలాంటి సందర్భాల్లోనూ వారికి కొంత మొత్తాన్ని ముట్టజెప్పక తప్పని పరిస్థితి. ఒక్కో గ్రామ సంఘానికి ముగ్గురు ఓబీలు ఉంటారు. నగదు చెల్లింపులు, చెక్కులు, రికార్డుల నిర్వహణ బాధ్యత వారిపై ఉంటుంది. వీవోఏలు కొందరు ఓబీలతో కుమ్మక్కవ్వడం, లేదా ఓబీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అంతా తామై వ్యవహరిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.


బ్యాంకు సిబ్బంది పాత్రపై సందేహాలు

బ్యాంకు అధికారుల సహకారంతో వీవోఏలు బృందాల సభ్యులతో సంబంధం లేకుండా వారి ఖాతాల్లో నగదు మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సభ్యుల సంతకాలు లేకుండానే సీఏ, వీవోఏలు నగదు డ్రా చేస్తుంటే బ్యాంకు సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రశ్నార్థంగా మారింది.


పర్యవేక్షణ లేమే కారణం

వివిధ సంఘాల్లో నగదు అవకతవకలపై విచారణ జరుగుతోంది. వీరవాసరంలో బృంద నాయకురాలు నగదు దుర్వినియోగానికి పాల్పడినట్లు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గరగపర్రు గ్రామ సంఘంలో వీవోఏ అవకతవకలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఆ సంఘానికి సంబంధించి రూ.4.8 లక్షలను సంబంధిత వీవోఏ సొంతానికి వాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఓబీల పర్యవేక్షణ లేకపోవడం వల్లే నిధులు దుర్వినియోగమవుతున్నాయి.

వేణుగోపాల్‌, డీఆర్‌డీఏ పీడీ, భీమవరం


గరగపర్రులో మొత్తం నాలుగు గ్రామ సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 104 మహిళా బృందాలు ఉన్నాయి. వీటికి సంబంధించి సుమారు రూ. 43.50 లక్షలు నగదు నిల్వలు ఉన్నట్లు సభ్యులు తెలిపారు. వీటిలో రెండు సంఘాల నగదు నిల్వల్లో తేడాలు ఉన్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని