logo

పంచదార అరకొర

జిల్లాలోని బియ్యం కార్డుదారులకు రాయితీతో కూడిన నిత్యావసరాల సరకులు పంపిణీ ప్రారంభించారు. గతంలో పలు రకాలు పంపిణీ చేసేవారు. కొంతకాలం నుంచి మూడు రకాలే ఇస్తుండగా.. అవీ అరకొరగానే అందిస్తున్నారు.

Updated : 03 Jun 2023 05:29 IST

నాసిరకంగా కందిపప్పు
ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే

ఎండీయూ వాహనం వద్ద సరకులు పొందుతున్న కార్డుదారులు

జిల్లాలోని బియ్యం కార్డుదారులకు రాయితీతో కూడిన నిత్యావసరాల సరకులు పంపిణీ ప్రారంభించారు. గతంలో పలు రకాలు పంపిణీ చేసేవారు. కొంతకాలం నుంచి మూడు రకాలే ఇస్తుండగా.. అవీ అరకొరగానే అందిస్తున్నారు.

ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం, కందిపపు, పంచదార సరఫరా చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 6.39 లక్షల బియ్యం కార్డుదారులు ఉన్నారు. కార్డులోని ఒక్కో సభ్యునికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు, అరకిలో పంచదార అందజేస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా రేషన్‌ డీలర్లకు బియ్యాన్ని సరిపడా సరఫరా చేయగలిగారు. కానీ పంచదార సగం కూడా సరఫరా కాలేదు. స్టాకు తగినంత అందుబాటులో లేకపోవడం ఒక కారణం కాగా, ఎక్కువ శాతం మంది డీలర్లు ఆర్థిక పరిస్థితుల కారణంగా డీడీలను చెల్లించలేకపోయారు. ఫలితంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు అరకొరగా సరఫరా అయింది. బయట మార్కెట్లో కిలో పంచదార రూ.40 నుంచి రూ.45 వరకు విక్రయిస్తుండగా ఎండీయూ వాహనాల్లో కార్డుదారులకు అర కిలో రూ.17కు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది పంచదార కొనుగోలుకు  ఆసక్తి కనబరుస్తుండగా ఒక్కో కార్డుపై నెలకు అరకిలో మాత్రమే అందజేస్తున్నారు.  

* బియ్యం కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో వీటి సరఫరాకు అనువైన పరిస్థితుల గురించి సర్వే కూడా చేశారు. ఎక్కువ శాతం మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచినా కొన్ని జిల్లాలకు మాత్రమే వీటిని పరిమితం చేశారు.

రుచీపచీ ఉండటం లేదు

పౌరసరఫరాల సంస్థ ద్వారా సరఫరా చేసే కందిపప్పు నాసిరకంగా ఉండటంతో కొనేందుకు కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. కొన్ని నెలల క్రితమే టెండర్ల ద్వారా ప్రభుత్వం కంది పప్పు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచింది. అదికాస్తా పాడైపోయింది. ఇటువంటి పప్పును కొనుగోలు చేసి పొయ్యిపై పెడితే ఉడకడానికి గంటలకొద్దీ సమయం పడుతోందని, తీరా ఉడికిన తర్వాత రుచీపచీ ఉండటం లేదని పలువురు కార్డుదారులు ఆరోపిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.128 నుంచి రూ.135 వరకు ఉండగా.. ఎండీయూ వాహనాల ద్వారా కార్డు దారులకు కిలో రూ.67 లకు పంపిణీ చేస్తున్నారు.

తూకాల్లో  తేడాలు

ప్రతినెలా కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ జరిగేటప్పుడల్లా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తూకాల్లో తేడాలు రావడం షరామామూలైంది. ఒక్కో బియ్యం బస్తాలో అరకిలో నుంచి కిలో వరకు తగ్గుతోంది. దీనిపై రేషన్‌ డీలర్లు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద పలుమార్లు ధర్నాలు చేశారు. ఇటువంటివి జరిగినప్పుడు అధికారులు సమస్యకు తగిన పరిష్కార చర్యలు చేపడతామని అంటున్నారేతప్ప పరిష్కారం చూపడం లేదు.

అన్ని సరకులు  పంపిణీ చేస్తాం

‘జిల్లాలోని కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, పంచదార సరకులను పంపిణీ చేస్తాం. ప్రస్తుతానికి పంచదార 30 శాతమే జిల్లాకు దిగుమతి అయింది. ఒకటి రెండు రోజుల్లో దశల వారీగా సరఫరా అవుతుంది. వచ్చిన సరకు వచ్చినట్లుగా డీలర్లకు పంపిస్తున్నాం. అంగన్‌వాడీ బాలలకు, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రాగిపిండి సరఫరా చేస్తున్నాం. రాగులు, జొన్నలు కొన్ని జిల్లాలకు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది’ అని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు మంజుభార్గవి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని