logo

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని చేసిన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ పరిశీలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కలెక్టర్‌తో కొద్దిసేపు మాట్లాడారు.

Published : 06 Jun 2023 04:28 IST

ప్రాజెక్టులో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎమ్మెల్యే బాలరాజు తదితరులు

పోలవరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని చేసిన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ పరిశీలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కలెక్టర్‌తో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం అందరూ కలిసి ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను సందర్శించారు. పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ప్రజాప్రతినిధుల కోసం చేసిన ఏర్పాట్లను, వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, జేసీ లావణ్యవేణి, ఆర్డీవోలు పెంచల కిశోర్‌, ఝాన్సీరాణి, తహసీల్దార్‌ సుమతి ఉన్నారు. సాయంత్రం ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ మేరీ ప్రశాంతి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు హెలిప్యాడ్‌ నుంచి డయాఫ్రం వాల్‌ వరకు నిర్వహించిన ట్రయల్‌ రన్‌ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట డీఎస్పీ ఆర్లా శ్రీనివాసులు, సీఐ కె.విజయబాబు, ఎస్సై పవన్‌కుమార్‌ తదితరులున్నారు.

ప్రాజెక్టులో భారీ బందోబస్తు

పోలవరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు సందర్శనను పురస్కరించుకుని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచే వివిధ జిల్లాల నుంచి బస్సులు, కార్లపై పోలీసులు వచ్చారు. రెండు రోజులుగా జిల్లా అధికారులు ప్రాజెక్టులో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 750 మంది పోలీసులను రప్పించారు. బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు ప్రాజెక్టులో అణువణువునా గాలిస్తున్నాయి. ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు అధికారులు 50 మందితో ఒక జాబితా తయారు చేశారు. అందులో నిర్వాసితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కడికక్కడ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ముఖ్యమంత్రి సమీక్ష సమావేశ మందిరంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు రెవెన్యూ, ఆర్‌ అండ్‌ ఆర్‌, జల వనరుల శాఖాధికారులు, మేఘా సంస్థ ప్రతినిధులకు మాత్రమే పరిమితం చేశారు.


కార్యక్రమం సాగేదిలా..

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ మంగళవారం ఉదయం 10.20 గంటలకు హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. 10.30 గంటల వరకు ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలిస్తారు. ఉదయం 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12 గంటలకు ప్రాజెక్టు ప్రాంతంలోని సమావేశ మందిరానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు. అనంతరం 1.35 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.20 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లి వెళతారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని