logo

గెలుపు మలుపులై... లక్ష్యసాధనకు సిదం

గత నెలలో తిరుపతిలో నిర్వహించిన మహిళా వాలీబాల్‌ సీఎం కప్‌ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఇందులో కెప్టెన్‌తో సహా తొమ్మిది మంది క్రీడాకారిణులు జంగారెడ్డిగూడెం ప్రాంతం వారే.

Published : 09 Jun 2023 05:43 IST

జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రాంత క్రీడాకారిణుల ప్రతిభ
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే

గత నెలలో తిరుపతిలో నిర్వహించిన మహిళా వాలీబాల్‌ సీఎం కప్‌ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఇందులో కెప్టెన్‌తో సహా తొమ్మిది మంది క్రీడాకారిణులు జంగారెడ్డిగూడెం ప్రాంతం వారే. వీరంతా పట్టణంలోని మొటపర్తి శివరామ వరప్రసాద్‌ క్రీడా ప్రాంగణంలో విశ్రాంత పీడీ ముదునూరి నరసింహరాజు వద్ద శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి క్రీడా ప్రస్థానం.. భవిష్యత్తు లక్ష్యాలను ఇలా వివరించారు.

పోలీస్‌ ఉద్యోగం సాధిస్తా..

‘సీఎం కప్‌ గెలుపొందిన జట్టుకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు జాతీయ స్థాయి పోటీల్లో 13 సార్లు పాల్గొన్నా. 2017లో బంగారు పతకం సాధించా. స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-17 విభాగంలో కాంస్య పతకం దక్కింది. పోలీసు ఉద్యోగం సాధిస్తాను’ అని తగరం దేవి తెలిపారు.


జాతీయ స్థాయిలో రాణించాలని..

‘వాలీబాల్‌ క్రీడలో ఇప్పటి వరకు ఒక బంగారు, రెండు వెండి, కాంస్య పతకాలు సాధించా. మూడు సార్లు రాష్ట్ర జట్టు తరఫున ఆడా. నన్నయ్య విశ్వవిద్యాలయం జట్టు క్రీడాకారిణిగా ఉన్నా. జాతీయ క్రీడాకారిణిగా రాణించాలన్నది నా లక్ష్యం’అని బలగా ఢిల్లేశ్వరి చెప్పారు.


రాష్ట్ర జట్టుకు మూడు సార్లు ప్రాతినిధ్యం

‘సీఎం కప్‌ సాధించిన జట్టులో సభ్యురాలినవడం సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదగాలన్నది నా ఆశయం. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను’ అని కలగర జయశ్రీ పేర్కొన్నారు.


జట్టులో కీలకంగా..

‘సీఎం కప్‌ గెలుపొందిన జట్టులో కీలక సభ్యురాలిని. ఇప్పటి వరకు ఐదు సార్లు జాతీయ స్థాయి, మూడు సీఎం కప్‌ పోటీల్లో ఆడా. ఎనిమిదో తరగతి నుంచే వాలీబాల్‌ ఆడటం ప్రారంభించా. జాతీయ క్రీడాకారిణిగా రాణించాలన్నది నా లక్ష్యం’ అని ఎం.శేషభువనేశ్వరి పేర్కొన్నారు.


ఐపీఎస్‌ సాధిస్తా

‘క్రీడలతో పాటు చదువులోనూ రాణించి ఐపీఎస్‌ అవ్వాలన్నది నా లక్ష్యం. 2018 నుంచి వాలీబాల్‌ ఆడుతున్నా. నాలుగు సార్లు జూనియర్‌ నేషనల్స్‌, మూడు సీఎం కప్‌లు, మూడు యూత్‌ నేషనల్స్‌, రెండు సార్లు సీనియర్‌ నేషనల్స్‌లో ఆడా. ప్రస్తుతం బీటెక్‌ చదువుతున్నాను’ అని ఎస్‌.స్టెల్లా చెప్పారు.


మంచి వేదిక

‘జంగారెడ్డిగూడెంలో క్షత్రియ సేవా సమితి సహకారంతో అందిస్తున్న శిక్షణ మాకు మంచి వేదికగా ఉంది. ఒక క్రీడా మైదానం నుంచి రాష్ట్ర స్థాయి క్రీడాకారిణులు తొమ్మిది మంది ఉండటం ఆనందంగా ఉంది. బీపీఈడీ చదువుతున్నా. రెండు నేషనల్స్‌, మూడు సార్లు యూనివర్సిటీ జట్టు తరఫున ఆడాను’ అని కె.నాగమల్లేశ్వరి వెల్లడించారు.


రోజూ ఐదు గంటలకు పైగా సాధన

‘క్రీడా కోటాలో పోలీసు ఉద్యోగం సాధించాలన్నది నా ప్రధాన ఆశయం. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆరు పర్యాయాలు పాల్గొన్నా. రోజూ ఐదు గంటలకుపైగా సాధన చేస్తా. అప్‌ల్యాండ్‌ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు ఇస్తున్న సహకారం వల్లే రాణించగలుగుతున్నాను’ అని గుడివాక జయశ్రీ వివరించారు.


ఆర్మీలో చేరతా..

‘సీఎం కప్‌ గెలుపొందిన జట్టు క్రీడాకారిణి అయినందుకు గర్వపడుతున్నా. ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనేది నా లక్ష్యం’అని మానికల సుధారాణి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని